Oats Vegetable Cutlet Recipe । అనారోగ్యకరమైన చిరుతిళ్లు వద్దు.. ఓట్స్ కట్‌లెట్‌లను ఇలా చేసుకోండి!
02 January 2023, 18:26 IST
- Oats Vegetable Cutlet Recipe: ఓట్స్‌తో రుచికరమైన కట్‌లెట్‌లు చేసుకోవచ్చు, ఇవి తేలికైన, ఆరోగ్యకరమైన చిరుతిండి. ఎలా తయారు చేయవచ్చో ఇక్కడ రెసిపీ ఉంది.
Oats Vegetable Cutlet Recipe
సాయంత్రం వేళ స్నాక్స్ తినడం అందరికీ ఇష్టం, కానీ చాలా వరకు స్నాక్స్ అనేవి ఆరోగ్యకరమైనవేమి కాదు. చిరుతిళ్లు ఎక్కువగా తినేవారికి భోజనం చేయడంపై దృష్టి ఉండదు. ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా భోజనం కంటే కూడా చిరుతిళ్లు తినడానికే ఇష్టపడతారు. మీకు ఇక్కడ ఒక స్నాక్స్ రెసిపీని పరిచయం చేస్తున్నాం. ఇది బ్రేక్ సమయంలో తినగలిగే తేలికైన అల్పాహారం.
చాలా మందికి కట్‌లెట్స్ తినడం ఇష్టమే, పానీపూరీ విక్రేత వద్ద మీరు కట్‌లెట్స్ చాలా సార్లు తినే ఉంటారు. అయితే అలాంటి కట్‌లెట్ కాకుండా ఓట్స్ కట్‌లెట్ ఒకసారి తిని చూడండి. రోస్టెడ్ ఓట్స్, కాటేజ్ చీజ్, సుగంధ ద్రవ్యాలు, వెజిటేబుల్స్‌తో చేసే ఈ కట్‌లెట్ ఆరోగ్యం, రుచి రెండింటి కలయికగా ఉంటుంది. మీ ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినపుడు, లేదా మీ పిల్లలకు చిరుతిండిగా తినిపించడానికి ఇది బయట లభించే కట్‌లెట్ కంటే చాలా ఆరోగ్యకరమైనది.
మరి ఈ ఓట్స్ వెజిటెబుల్ కట్‌లెట్ తయారు చేసేందుకు కావలసిన పదార్థాలేమిటి, ఎలా తయారు చేయాలి తెలుసుకోవాలంటే ఈ కింద ఓట్స్ వెజిటెబుల్ కట్‌లెట్ రెసిపీ ఉంది చూడండి.
Oats Vegetable Cutlet Recipe కోసం కావలసినవి
- 1 కప్పు రోస్టెడ్ ఓట్స్
- 1 కప్పు ఉడికించిన బంగాళదుంపల గుజ్జు
- 1/2 కప్పు పనీర్
- 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
- 2 పచ్చిమిర్చి
- 2 చిన్న క్యారెట్లు
- 1 స్పూన్ గరం మసాలా
- 1/4 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్
- 2 స్పూన్ల నూనె
- ఉప్పు రుచికి తగినట్లుగా
ఓట్స్ వెజిటెబుల్ కట్లెట్ ఎలా తయారు చేయాలి
1. ముందుగా ఉడకబెట్టిన బంగాళదుంపలను గుజ్జుగా చేసుకోవాలి, అలాగే క్యారెట్లను కూడా సన్నగా తురిమి రెండింటిని కలిపి మెత్తని ముద్దగా చేసుకోవాలి.
2. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో రోస్టెడ్ ఓట్స్, బంగాళాదుంప- క్యారెట్ మిశ్రమం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కారం పొడి , గరం మసాలా పౌడర్ వేసి అన్ని బాగా కలపాలి.
3. మసాలా కట్లెట్ మిశ్రమానికి మరింత స్థిరత్వం తీసుకు వచ్చేందుకు పనీర్ ముక్కల్ను నలిపేసి కలిపేయండి.
4. ఇప్పుడు కట్లెట్ మిశ్రమంను చిన్న ముద్దలుగా విభజించి, వృత్తాకారంలో మలచండి, ఆపై వాటిని మీ చేతులతో చదును చేసి కట్‌లెట్‌ల రూపం ఇవ్వండి.
5. ఇప్పుడు ఓవెన్‌ను 200 డిగ్రీల సెల్సియస్‌కి ప్రీహీట్ చేయండి. తర్వాత, బేకింగ్ ట్రేలో 1 టీస్పూన్ నూనెతో గ్రీజు వేయండి. కట్లెట్లను జాగ్రత్తగా అమర్చండి, 20 నిమిషాలు వేచి తర్వాత బయటకు తీయండి.
రుచికరమైన ఓట్స్ వెజిటెబుల్ కట్‌లెట్‌లు తినడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటిని రుచి చూస్తూ మీ సాయంత్రం టీ టైంను ఆస్వాదించండి.
టాపిక్