తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Onion Bread Cutlets | రుచికరమైన స్నాక్స్.. మ్యాగీ చేసినంత ఈజీగా చేసేయొచ్చు!

Onion Bread Cutlets | రుచికరమైన స్నాక్స్.. మ్యాగీ చేసినంత ఈజీగా చేసేయొచ్చు!

HT Telugu Desk HT Telugu

28 June 2022, 17:29 IST

    • సాయంత్రం వేళ స్నాక్స్ తినాలని నాలుక జివ్వుమని లాగేస్తుందా? మీకోసమే రుచికరమైన ఆనియన్ బ్రెడ్ కట్‌లెట్స్ రెసిపీని పరిచయం చేస్తున్నాం. ఇది చాలా చాలా ఈజీ రెసిపీ.
Onion Bread Cutlet
Onion Bread Cutlet (Unsplash)

Onion Bread Cutlet

ఈ మాన్‌సూన్ సీజన్‌లో స్ట్రీట్ ఫుడ్‌కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. రోడ్డు వెంబడి నడుకుంటూ వెళ్తే ఎన్నో రకాల స్టాల్స్ కలర్‌ఫుల్ వంటకాలతో కనువిందు చేస్తాయి. కమ్మటి రుచుల సరిగమలతో రారమ్మని పిలుస్తాయి. దీంతో మీ నాలుక ఆటోమేటిక్‌గా లపలపలాడుతుంది. వద్దూ వద్దనుకుంటునే మెల్లిగా వెళ్లి ఫుల్లుగా ఆ స్నాక్స్ లాగించేస్తారు. కానీ ఇలా బయట ఏదిపడితే అది తింటే అనారోగ్యం పాలవటం గ్యారెంటీ. ముఖ్యంగా వర్షాకాలంలో అలాంటి స్నాక్స్‌కు దూరంగా ఉండాలి. వీలైతే వారానికి ఒకసారి ఇంట్లోనే అలాంటి స్నాక్స్ చేసుకోండి.

ఇక్కడ మీకు ఒక సరికొత్త స్నాక్స్ పరిచయం చేస్తున్నాం. బ్రెడ్ ముక్కలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలతో చేసే ఈ స్నాక్స్ మీరు ఇదివరకు ఎప్పుడూ తిని ఉండరు. చాలా రుచికరంగా ఉంటుంది. అంతేకాదు దీనిని తయారు చేసుకోవడం కూడా మ్యాగీ చేసినంత ఈజీ. పెద్దగా ప్రాసెస్ ఏం ఉండదు, ఎవరైనా చేసుకోవచ్చు. దీనిని ఆనియన్ బ్రెడ్ కట్‌లెట్ అంటారు, మరి దీని రెసిపీ ఇక్కడ ఇచ్చాం. మీరూ ప్రయత్నించి చూడండి.

కావాల్సిన పదార్థాలు

  • 3 బ్రెడ్ స్లైసెస్
  • 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు
  • 1/2 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
  • 1/2 టీస్పూన్ కారం
  • చిటికెడు పసుపు
  • ఉప్పు తగినంత
  • 2 స్పూన్ల తాజా కొత్తిమీర
  • కొద్దిగా కరివేపాకు
  • 1 పచ్చిమిరపకాయ
  • ఫ్రై చేసేందుకు అర కప్పు నూనె

తయారీవిధానం

ముందుగా బ్రెడ్ స్లైసెస్‌ను ఒక గిన్నెలో చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అనంతరం కొన్ని నీళ్లతో తడిపి పక్కన నానబెట్టండి.

ఇప్పుడు ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్లో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి.

అనంతరం ఈ మిశ్రమంలో నానబెట్టిన బ్రెడ్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఇది పిండి ముద్దగా తయారవుతుంది.

ఈ బ్రెడ్ ముద్దను చిన్నచిన్న కట్‌లెట్ లుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

చివరగా పాన్‌లో నూనె వేడి చేసి కట్‌లెట్‌లను చిన్నమంట మీద ముదురు వర్ణం వచ్చేంత వరకు వేయించుకోవాలి.

అంతే రుచికరమైన ఆనియన్ బ్రెడ్ కట్‌లెట్స్ రెడీ అయినట్లే. వీటిని టొమాటో సాస్ లేదా గ్రీన్ చట్నీతో కలిపి తీసుకుంటే అద్భుతంగా ఉంటాయి. ఇది ఆయిల్ ఫుడ్ కాబట్టి ఎప్పుడూ కాకుండా ఎప్పుడో ఒకసారి చేసుకోండి.

టాపిక్