Healthy Drinks During Pregnancy। గర్భిణీలకు ఎలాంటి పానీయాలు ఆరోగ్యకరం, వేటిని నివారించాలి?!
01 November 2022, 16:22 IST
- Healthy Drinks for Pregnant women: గర్భంతో ఉన్నప్పుడు గర్భిణీలు తెలియకుండా ఏదో ఒక పానీయం తాగితే అది సురక్షితం కాకపోవచ్చు. ఏవి తాగాలి, ఏవి తాగకూడదో ఇక్కడ తెలుసుకోండి.
Pregnant women
Healthy Drinks for Pregnant women: గర్భం అనేది ప్రతి స్త్రీ జీవితంలో అత్యంత అందమైన దశలలో ఒకటి. ఈ ప్రపంచంలోకి మరొక కొత్త జీవితాన్ని తీసుకురావడానికి స్త్రీ కడుపులో జరిగే ఒక అద్భుతం గర్భం. కాబట్టి గర్భిణీలు ఈ సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వారు తీసుకునే అన్నపానీయాలు తల్లికి మాత్రమే కాకుండా, తన కడుపులో పెరిగే బిడ్డకు కూడా సరైన పోషణ ఇవ్వాలి. అందుకే ఆరోగ్యకరమైన, బలమైన ఆహారం ప్రతిరోజూ తీసుకోవాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండాలి. ఇందుకోసం తాజా పండ్లను, పండ్ల రసాలను తీసుకోవాలి. నిజానికి మంచి నీటిని మించిన ఉత్తమ పానీయం మరొకటి లేదు, అయితే అదేపనిగా మంచినీరు తాగలేరు కాబట్టి కాస్త రుచి, పోషకాల కోసం పండ్లరసాల రూపంలో తాగటం మంచి ఎంపిక అవుతుంది.
అయితే గర్భంతో ఉన్నప్పుడు ఎలాంటి జ్యూస్‌లు తీసుకోవాలి అనే దానిపై సందేహాలు ఉంటాయి. గర్భిణీలు తెలియకుండా ఏదో ఒక పానీయం తాగితే అది సురక్షితం కాకపోవచ్చు. కొన్ని జ్యూస్‌లను తప్పకుండా తీసుకోవాలి, మరికొన్నింటిని తీసుకోకూడదు.
గర్భిణీలు తాగాల్సినవి
ఏవి తాగాలి, ఏవి తాగకూడదో కొన్నింటిని ఇక్కడ పొందుపరుస్తున్నాం, తెలుసుకోండి.
సిట్రస్ పండ్ల రసాలు
తాజా నిమ్మరసం, నారింజ రసం వంటి సిట్రస్ డ్రింక్స్ గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా తీసుకోవాలి. నారింజ రసం బలవర్థకమైనమైది, ఇది రక్తపోటును తగ్గిస్తుంది, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది, ప్రినేటల్ విటమిన్‌గా పనిచేస్తుంది అలాగే పిండం అభివృద్ధికి తోడ్పడుతుంది.మొదటి త్రైమాసికంలో నిమ్మరసం చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది వికారం, వాంతులు, ఉదయపు అనారోగ్యానికి సమర్థవంతమైన నివారణగా పని చేస్తుంది.
స్వచ్ఛమైన పాలు
పాలు కేవలం శిశువులకే కాదు, కాబోయే తల్లులకు కూడా. గర్భిణీ స్త్రీలకు అవసరమయ్యే ఉత్తమ పోషక పానీయాలలో స్వచ్ఛమైన పాలు ఒకటి అని నిపుణులు అంటున్నారు. పాలల్లో గర్భిణీలకు కావలసిన విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయి. నెలలు నిండుతున్న కొద్దీ శిశువు అభివృద్ధికి తోడ్పడతాయి అలాగే కాబోయే తల్లులను ఆరోగ్యంగా ఉంచుతాయి. గర్భం పెరిగేకొద్దీ ప్రతిరోజూ కనీసం ఒక గ్లాసు పాలు తాగాలి. డైరీ ఉత్పత్తులు పడనివారు ప్రత్యామ్నాయంగా సోయా లేదా బాదం పాలు తీసుకోవచ్చు.
స్పోర్ట్స్ డ్రింక్స్
అవును, కొన్ని స్పోర్ట్స్ డ్రింక్స్ గర్భిణీలకు సురక్షితమైనవే కాకుండా మేలు కూడా చేస్తాయి. ముఖ్యంగా రెండవ త్రైమాసికంలో ఆకస్మిక తిమ్మిరిని ఎదుర్కోవటానికి ప్రత్యేకించి ఈ స్పోర్ట్స్ డ్రింక్స్ ప్రయోజనకరంగా ఉంటాయి. ఇందులో ప్రధానంగా ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. అయితే శక్తివంతమైనవి, అదనపు చక్కెర లేని వాటిని ఎంచుకోవాలి.
గర్భిణీలు వీటిని నివారించాలి
అయితే ఇప్పుడు ఎలాంటి పానీయాలు తీసుకోకూడదో తెలుసుకుందాం. గర్భుణీలు మీరు ఇలాంటి పానీయాలు తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి.
కెఫీన్ పానీయాలు
మొదటి రెండు త్రైమాసికాల్లో కెఫీన్ పానీయాలు తీసుకోవడం పూర్తిగా నిషిద్ధం. ఆల్కాహాల్, సోడా కలిగిన పానీయాలు, ఫిజీ డ్రింక్స్ వంటి వాటికి కూడా పూర్తిగా దూరంగా ఉండాలి. ఎక్కువ చక్కెర కలిగిన పానీయాలను నివారించాలి. గర్భధారణ సమయంలో తల్లులు సోడా కలిగిన పానీయాలు తాగడం వల్ల పిల్లలకు బాల్యంలోనే ఊబకాయం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పలు అధ్యయనాలు తెలిపాయి. చక్కెర కలిగిన పానీయాలు రోజుకి రెండు కూడా మించకూడదు. కాబట్టి తల్లులూ జాగ్రత్త!
డిటాక్స్ డ్రింక్స్
కడుపును శుద్ధి చేయటానికి డిటాక్స్ డ్రింక్స్ అంటూ ఇటీవల కాలంలో చాలా మంది తాగుతుంటారు. అయితే ఇవి గర్భిణీలకు మంచివి కాకపోవచ్చు. ఈ జాబితాలో తాజా పండ్ల రసాలు కూడా ఉంటాయి. ఎందుకంటే తాజాగా జ్యూస్ చేసినవి ఆరోగ్యకరం అని తెలిసినా, అవి పాశ్చరైజ్ చేయనివి కాబట్టి, పచ్చి వాటిలో హానికరమైన బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంటుంది. అది ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలకు దారితీస్తుంది, ఇది చాలా ప్రమాదకరమైనది.కాబట్టి పచ్చి కూరగాయ రసాలు, పండ్ల రసాల విషయంలో జాగ్రత్త. అలాగే బొప్పాయి పండ్ల రసాలకు దూరంగా ఉండాలి, ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
కుళాయి నీరు
నీరు తాగటం మంచిదే కానీ, కలుషిత నీరు తాగటం మంచిది కాదు. పంపు నీటిలో సీసం స్థాయిలు ఎక్కువగా ఉండవచ్చు, ఇది ప్రమాదకరమైన రసాయనం. కలుషితమైన సీసం నీరు ఎవరికీ మంచిది కానప్పటికీ, గర్భిణీ స్త్రీలు మరింత జాగ్రత్త వహించాలి.
చివరగా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి.. ఇక్కడ సూచించినవి కేవలం మీ అవగాహన కోసమే. గర్భిణీలు ఏది తినాలన్నా, తాగాలన్నా ముందు మీ వైద్యుల సలహా తీసుకొని మాత్రమే ముందుకు వెళ్లండి.