Hair Fall Control : జుట్టు రాలుతోందా? ఈ పోషకాలతో కంట్రోల్ చేయండి
27 December 2022, 9:00 IST
- Hair Fall Control : జుట్టు రాలడానికి విభిన్న సమస్యలు కారణమవుతాయి. చుండ్రు, కాలుష్యం, పోషకాల లోపం, హార్మోన్ల అసమతుల్యత, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వంటివేవైనా కారణమై ఉండొచ్చు. మిమ్మల్ని ఈ సమస్య బాగా వేధిస్తుంటే మాత్రం ఒకసారి చర్మ వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టు రాలే సమస్యకు పరిష్కారం
Hair Fall Control : జుట్టు ఊడిపోవడానికి ఒకటి కాదు.. రెండు కాదు చాలా కారణాలు ఉంటాయి. వాటి గురించి సరిగ్గా తెలుసుకున్నప్పుడే.. మనం మంచి చికిత్స అందించగలుగుతాం. మీకు హెయిర్ ఫాల్ అవుతుంటే మాత్రం కచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి. వారు తగిన పరీక్షలు చేసి.. వాటికి తగిన చికిత్స అందించడం ద్వారా ఉపయోగం ఉంటుంది.
జుట్టు సమస్యలకు డయాగ్నోసిస్
జుట్టు రాలడం, ఇతర సమస్యలు ఉన్నప్పుడు మీ శరీరానికి అవసరమైన పోషకాల స్థాయిని పరీక్షిస్తారు. ముఖ్యంగా హిమోగ్లోబిన్, విటమిన్ బీ 12, విటమిన్ డి, ఎస్.ఫెరిటిన్, సీబీసీ, థైరాయిడ్, తదితర పరీక్షలు నిర్వహిస్తారు. విటమిన్ల లోపం ఉందని తేలితే సంబంధిత సప్లిమెంట్లు, ఔషధాలు ఇచ్చి చూస్తారు. జుట్టు పెరుగుదలకు అవసరమైన గామా-లైనోలెనిక్ యాసిడ్, ఇతర ముఖ్యమైన విటమిన్ సప్లిమెంట్లు రాస్తారు. గామా-లైనోలెనిక్ యాసిడ్ అనేది ఒక ఫాటీ యాసిడ్. ఇది జుట్టు రాలకుండా నివారించడమే కాకుండా, పెరిగేలా తోడ్పడుతుంది.
అంతేకాకుండా జుట్టు ఊడిపోవడానికి గల మూలకారణాలు తెలుసుకునే చర్మ వ్యాధి సంబంధిత వైద్య నిపుణులు తగిన సీరమ్, షాంపూలు సిఫారసు చేస్తారు. ఆయా సీరమ్, షాంపూలు, సప్లిమెంట్లలో జుట్టు, స్కాల్ప్ సంబంధిత సమస్యలకు మెరుగైన ఔషధాలను కూడి ఉంటాయి.
వైద్యులు చెప్పే ఇతర జాగ్రత్తలు
మన దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో జుట్టుకు నూనె రాసే అలవాటు విపరీతంగా ఉంటుంది. కొందరైతే జుట్టు నుంచి జిడ్డులా నూనె కారేంతవరకూ రాస్తూనే ఉంటారు. అసలు తలకు నూనె పెట్టొద్దని చర్మవ్యాధి సంబంధిత వైద్యనిపుణులు చెబుతారు. రోజు విడిచి రోజు స్నానం చేయడం, రెండు మూడు రోజులకోసారి తేలికపాటి షాంపూతో స్నానం మీ జుట్టు ఆరోగ్యానికి క్షేమమని చెబుతున్నారు. మీ జుట్టు తత్వాన్ని, మీ స్కాల్ప్ సమస్యలను బట్టి వీటిని రాస్తుంటారు. వైద్య నిపుణుల సలహాలు, సూచనలు ఆచరించి ఒక ఐదారు నెలలు పరిశీలించండి. ఒకవేళ ఫలితం కనిపిస్తే దానినే కొనసాగించండి.
స్కాల్ప్, పోషకాల సమస్యలు ఏవీ లేకపోతే బయటి వాతావరణం ఏదైనా ప్రభావం చూపుతోందో పరిశీలించండి. అంటే ఒత్తిళ్లు, వాతావరణ కాలుష్యం, దుమ్మూదూళి, వేడిమి వంటివి కూడా జుట్టు సమస్యలకు కారణమవుతాయి. వీటిని తట్టుకునేందుకు మీరు సమతుల ఆహారం, తగిన వ్యాయామం, మెడిటేషన్ చేయడం మంచిది. జుట్టుకు ఉపయోగపడే సహజ సిద్ధ ఆహారం నట్స్‌లో ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా విటమిన్ ఇ ఎక్కువగా ఉండే బాదం వంటివి తీసుకుంటూ ఉండండి. అలాగే హిమోగ్లోబిన్, విటమిన్ బీ 12, విటమిన్ డి స్థాయి పెంచే ఆహారాలను తీసుకోండి. థైరాయిడ్ వంటి సమస్యలు ఉంటే కచ్చితంగా చికిత్స తీసుకోవాలి.
టాపిక్