Eating millets in right way: మిల్లెట్స్ తినేటప్పుడు ఈ మిస్టేక్స్ చేయొద్దు
27 January 2023, 18:00 IST
- Eating millets in right way: మిల్లెట్లు ఇచ్చే అనేక ఆరోగ్య ప్రయోజనాల వల్ల వేగంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. అయితే ఇందులో ఉన్న కొన్ని ప్రతికూలతలు తొలగాలంటే ఏం చేయాలో పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
మిల్లెట్స్ తినేముందు ఈ మిస్టేక్స్ చేయొద్దు
మిల్లెట్స్ (చిరు ధాన్యాలు) పురాతన కాలం నుంచి సాగవుతున్న పంటలు. వీటిలో ఉండే పోషకాలు అద్భుమైన ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. అయితే కాలక్రమంలో అంతరించి పోయే పరిస్థితికి వెళ్లి.. తిరిగి ప్రాచుర్యం పొందుతున్నాయి. పైగా ఇండియా పిలుపు మేరకు ఐక్య రాజ్యసమితి 2023ను అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరంగా గుర్తించింది.
జొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగులు, వరిగెలు, అరికెలు, అండు కొర్రలు, ఊదలు, సామలు.. ఇలా చాలా రకాల చిరుధాన్యాలు ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్నాయి. వీటి వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
వీటిలో కాంప్లెక్స్ కార్బొహైడ్రేట్లు ఉండడమే కాకుండా, గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల రక్తంలో చక్కెర స్థాయి ఆకస్మికంగా పెరగదు. మిల్లెట్స్‌లో ఉండే ఫైబర్ ప్రిబయోటిక్‌గా మారి మీ ఉదరంలో మంచి బ్యాక్టీరియా పెరిగేలా దోహదపడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. విటమిన్ ఏ, విటమిన్ బీ, నియాసిన్, ఫాస్ఫరస్, పోటాషియం, యాంటీయాక్సిడెంట్లు, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి.
న్యూట్రిషనిస్ట్ అనుపమా మీనన్ మిల్లెట్స్ ఉపయోగాలు, అవి వినియోగిస్తున్నప్పుడు మనం చేసే మిస్టేక్స్ వివరించారు.
అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగ జేసే చిరుధాన్యాలు అనేక దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తుందని చెప్పారు. కాకపోతే వీటిని నెమ్మదిగా అలవాటు చేసుకోవాలని మీనన్ సూచించారు. ఇవి జీర్ణం కావడం కొందరికి సమస్యగా మారుతుందని చెప్పారు. వండే ముందు నానబెట్టడం వల్ల ప్రతికూలతలను తగ్గించవచ్చని సూచించారు.
‘పోషకాహార నిపుణులు చేసే సిఫారసులను ఆసక్తిగా, ప్రయోగాత్మకంగా గమనించాలి. అందులో నుంచి మనల్ని శక్తిమంతుల్ని చేసే వాటిని, ప్రతికూల ప్రభావం లేనివాటిని ఎంచుకోవాలి. జీర్ణ వ్యవస్థపై గానీ, నిద్రపై గానీ, ఆరోగ్యంపై గానీ ప్రభావం చూపని వాటిని ఎంచుకోవాలి..’ అని మీనన్ సూచించారు.
మిల్లెట్స్ అన్నీ అధిక ఫైబర్, బీ కాంప్లెక్స్ విటమిన్లు కలిగి ఉంటాయి. మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం వంటి ఖనిజ లవణాలు కలిగిఉంటాయి.
Millets must be soaked: మిల్లెట్లు నానబెట్టాలి
‘మిల్లెట్టలో ఉండే యాంటీ-న్యూట్రియెంట్ అయిన ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. అది ఇతర పోషకాలను శరీరం శోషించకుండా చేస్తుంది. అయితే మిల్లెట్స్ నానబెట్టినప్పుడు ఈ ప్రతికూలత పోతుంది. నానబెట్టడం, మొలకెత్తించడం, పులియబెట్టడం వల్ల మిల్లెట్లలోని యాంటీ-న్యూట్రియెంట్‌కు సంబంధించిన ప్రతికూల ప్రభావాలన్నీ పోతాయి. అధికంగా పీచు పదార్థం ఉండడం, నెమ్మదిగా జీర్ణం కావడం వల్ల కొందరిలో జీర్ణాశయం ఇబ్బందుల్లో పడుతుంది. అందువల్ల ఈ చిరు ధాన్యాలను అలవాటు చేసుకునే ముందు కొద్ది మొత్తాల్లో ప్రారంభించాలి. ముందుగా రాగులు, కొర్రలు వంటి వాటితో ప్రారంభించి తదుపరి జొన్నలు, సజ్జలు వంటి వాటిని అలవాటు చేసుకోవచ్చు..’ అని మీనన్ సూచించారు.
Millets must be avoided by people with thyroid issues: థైరాయిడ్ ఉన్న వారు జాగ్రత్త
మిల్లెట్లలో గొయిట్రోజెన్స్ ఉంటుంది. ఇది అయోడిన్ శోషణలో ఆటంకాలను కలిగిస్తాయి. వండుతున్న ప్రక్రియలో అయోడిన్ తగ్గుతుంది. హైపోథైరాయిడిజం ఉన్న వారు మిల్లెట్లకు దూరంగా ఉండాలని మీనన్ సూచించారు.
‘చిరు ధాన్యాలు మీ డైట్‌లో చేర్చుకోవాల్సిన గొప్ప ఆహార పదార్థాలు. అయితే వీటిని ఎలా తీసుకోవాలి? ఎంత మొత్తంలో తినాలని తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీ జీర్ణాశయం ఇచ్చే సంకేతాల ఆధారంగా మీరు ఈ అంశాన్ని అర్థ: చేసుకోవచ్చు..’ అని సూచించారు.