Multiple sclerosis risk: టీనేజర్లకు హెచ్చరిక.. నిద్ర లేదంటే ఈ రోగం తప్పదు-poor sleep quality linked with multiple sclerosis risk in teens study reveals ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Multiple Sclerosis Risk: టీనేజర్లకు హెచ్చరిక.. నిద్ర లేదంటే ఈ రోగం తప్పదు

Multiple sclerosis risk: టీనేజర్లకు హెచ్చరిక.. నిద్ర లేదంటే ఈ రోగం తప్పదు

HT Telugu Desk HT Telugu
Jan 26, 2023 09:00 PM IST

Multiple sclerosis risk: యుక్త వయస్సులో తగినంత నిద్ర లేనిపక్షంలో మల్టిపుల్ స్ల్కెరోసిస్ వ్యాధి బారిన పడతారని పరిశోధనలో తేలింది.

యుక్తవయస్సులో నిద్ర తగ్గితే మల్టిపుల్ స్ల్కెరోసిస్ ముప్పు (ప్రతీకాత్మక చిత్రం)
యుక్తవయస్సులో నిద్ర తగ్గితే మల్టిపుల్ స్ల్కెరోసిస్ ముప్పు (ప్రతీకాత్మక చిత్రం) (unsplash)

యుక్తవయసులో కనీసం ఏడు గంటల పాటు నాణ్యమైన నిద్ర లేకపోతే మల్టిపుల్ స్ల్కెరోసిస్ అభివృద్ధి చెందే ప్రమాదం ఉందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. యవ్వనంలో ఉన్నప్పుడు తగినంత సమయం నిద్ర పోవడం వల్ల ఈ పరిస్థితి దూరం అయ్యే అవకాశం ఉంటుందని న్యూరాలజీ న్యూరోసర్జరీ అండ్ సైకియాట్రీ జర్నల్‌లో ప్రచురితమైన ఈ పరిశోధన తెలిపింది. మల్టీపుల్ స్ల్కెరోసిస్ అంటే అనేక రకాలుగా రక్తనాళాలు గడ్డకట్టడం. ఇది ఆటోఇమ్యూన్ వ్యాధి. క్రమంగా మెదడు, వెన్నుముక నరాలు, కంటి నరాలను దెబ్బతీసే వ్యాధి.

ధూమపానం, అధిక బరువు, ఎప్ట్సీన్ - బార్ వైరస్ ఇన్ఫెక్షన్, సూర్యరశ్మి వంటి జన్యు, అలాగే పర్యావరణ కారకాల ద్వారా మల్టిపుల్ స్ల్కెరోసిస్ ప్రభావితమవుతుందని పరిశోధకులు తెలిపారు.

షిఫ్ట్ పద్ధతిలో చేసే పని వల్ల కూడా ఈ రిస్క్ ఉందని తేలింది. ముఖ్యంగా చిన్న వయస్సులో ఈ ప్రభావం ఉంటుందని అధ్యయనం తేల్చింది. అయితే నిద్ర వేళలు, వ్యవధిలో మార్పుల కారణంగా జీవ గడియారంలో అంతరాయం, నిద్ర నాణ్యత లోపం వల్ల ఈ ముప్పును పూర్తిగా అంచనా వేయలేదని వారు చెప్పారు.

16-70 ఏళ్ల వయస్సు మధ్య గల స్వీడిష్ జనాభా ఆధారిత ఎపిడెమియోలాజికల్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ మల్టిపుల్ స్క్లెరోసిస్ నుండి డేటాను ఈ పరిశోధనకు ఉపయోగించారు. స్టాక్‌హోమ్ విశ్వవిద్యాలయం, స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం చేపట్టారు.

పరిశోధకులు ముఖ్యంగా 15 నుండి 19 సంవత్సరాల వయస్సు వ్యక్తుల నిద్ర విధానాలపై దృష్టి పెట్టారు. వివిధ వయస్సులలో వారి నిద్ర విధానాల గురించి అడిగారు. పాఠశాల రోజులు, వారాంతాలు, ఖాళీ రోజులలో ఎంత సేపు నిదురించారన్న లెక్కలు సేకరించారు. ఏడు గంటల కంటే తక్కువ సమయం నిద్ర పోయిన వారిని తక్కువ నిద్ర కలిగిన వ్యక్తులుగా, 7 నుంచి 9 గంటల పాటు నిద్ర పోయిన వారిని తగినంత నిద్ర కలిగిన వ్యక్తులుగా, 10 లేదా అంతకంటే ఎక్కువ గంటలు నిదురించిన వారిని దీర్ఘ నిద్ర కలిగిన వ్యక్తులుగా వర్గీకరించారు.

కౌమారదశలో నిద్ర సమయం, నాణ్యత మల్టిపుల్ స్ల్కెరోసిస్ రోగనిర్ధారణ ముప్పుతో ముడివడి ఉన్నాయని తేలింది. తక్కువ నిద్ర కలిగి ఉండడం, నిద్ర నాణ్యత తక్కువగా ఉండటం వల్ల ముప్పు పెరిగిందని పరిశోధకులు గుర్తించారు.

యుక్తవయసులో రాత్రికి 7-9 గంటలు నిద్రపోవడంతో పోలిస్తే అంతకంటే తక్కువ నిద్ర కలిగిన వారిలో 40 శాతం ఎక్కువగా మల్టిపుల్ స్ల్కెరోసిస్ అభివృద్ధి చెందే ప్రమాదం ఉందని వారు చెప్పారు.

Whats_app_banner