తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Broccoli Curry Recipe । బ్రోకలి, కాలీఫ్లవర్‌లో ఏది తినడం మేలు? బ్రోకలీ కర్రీని ఇలా చేయండి!

Broccoli Curry Recipe । బ్రోకలి, కాలీఫ్లవర్‌లో ఏది తినడం మేలు? బ్రోకలీ కర్రీని ఇలా చేయండి!

HT Telugu Desk HT Telugu

03 August 2024, 22:05 IST

google News
    • Broccoli Curry Recipe: బ్రోకలీ, కాలీఫ్లవర్ మధ్య తేడా ఏమిటి? బ్రోకలీలో ఎలాంటి పోషకాలు ఉంటాయి, రుచికరమైన బ్రోకలీ కూర ఎలా చేసుకోవాలి.. ఈ సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోండి.
Broccoli Curry Recipe:
Broccoli Curry Recipe: (slurrp)

Broccoli Curry Recipe:

ఆకుపచ్చని ఆకుకూరలు, కూరగాయల్లో మంచి పోషక విలువలు ఉంటాయని మనందరికీ తెలుసు. ఇందులో క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి కూరగాయలు మనకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. ఈ క్యాబేజీ కుటుంబంలోనే బ్రోకలీ కూడా ఒకటి. ఇది కూడా కాలీఫ్లవర్‌ను పోలి ఉంటుంది, అయితే కాలీఫ్లవర్ తెల్లగా ఉంటుంది, బ్రోకలీ ఆకుపచ్చగా ఉంటుంది.

పోషక విలువలను బట్టి చూస్తే బ్రోకలీలో కాలీఫ్లవర్ కంటే ఎక్కువ కేలరీలు, ప్రోటీన్, లిపిడ్లు, పిండి పదార్థాలు, ఫైబర్ ఉంటాయి. మరోవైపు, కాలీఫ్లవర్‌లో ఎక్కువ చక్కెరలు ఉన్నాయి. బ్రోకలీలో అధిక విటమిన్ కంటెంట్ ఉంది, ప్రత్యేకంగా విటమిన్ కె, విటమిన్ సి అలాగే కాలీఫ్లవర్‌లో లేని విధంగా విటమిన్ ఎ కూడా బ్రోకలీలో లభిస్తుంది. ఈ పోషకాలు కంటి ఆరోగ్యానికి మంచివి. అందువల్ల బ్రోకలీ తినడం మరింత ఆరోగ్యకరమని చెబుతారు.

భారతీయ శైలిలో రుచికరమైన, ఆరోగ్యకరమైన బ్రోకలీ కర్రీ రెసిపీని ఇక్కడ అందిస్తున్నాం. ఈ శాకాహారి కూర మీరు లంచ్ సమయంలో అయినా, డిన్నర్ సమయంలో అయినా అన్నం, రోటీ లేదా నాన్‌తో తిన్నా కూడా ఎంతో బాగుంటుంది. సులభంగా బ్రోకలీ కర్రీ ఎలా చేయాలో ఈ కింద సూచనలు చూడండి.

Broccoli Curry Recipe కోసం కావలసినవి

  • 2 కప్పుల బ్రోకలీ
  • 2 బంగాళాదుంపలు
  • 1/2 కప్పు కొబ్బరి క్రీమ్
  • 2 ఉల్లిపాయలు
  • 1 అంగుళం అల్లం
  • 2-3 వెల్లుల్లి రెబ్బలు
  • 2-3 పచ్చిమిర్చి
  • 2 టమోటాలు
  • 1 టేబుల్ స్పూన్ నూనె
  • 1/2 టీస్పూన్ జీలకర్ర
  • 1/4 టీస్పూన్ పసుపు
  • 1/2 టీస్పూన్ జీలకర్ర పొడి
  • 1/2 టీస్పూన్ ధనియాల పొడి
  • తాజా కొత్తిమీర అర కప్పు
  • రుచికి తగినంత ఉప్పు
  • 1/4 కప్పు నీరు

బ్రోకలీ కూర వండే విధానం

  1. ముందుగా బ్రోకలీ ముక్కలను, ఆలుగడ్డ ముక్కలను ఉడికించి పెట్టుకోండి.
  2. ఆ తర్వాత ఒక మిక్సర్ బ్లెండర్‌లో ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, టొమాటోలు, కొత్తిమీర వేసి పేస్ట్‌లా చేసి పక్కన పెట్టండి.
  3. ఇప్పుడు పాన్ వేడి చేసి, తక్కువ నుంచి మీడియం వేడి మీద నూనె వేడిచేయండి. అది వేడెక్కిన తర్వాత, జీలకర్ర వేసి వేయించండి.
  4. తర్వాత ఇదివరకు చేసుకున్న పేస్ట్ వేసి వేయించండి, ఇందులోనే పసుపు, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి బాగా కలపండి.
  5. 10-12 నిమిషాలు మొత్తం ద్రవం ఆవిరైపోయే వరకు, మిశ్రమం గోధుమ రంగులోకి మారే వరకు చిన్న మంటపై ఉడికించాలి.
  6. ఇప్పుడు కొన్ని నీళ్లు పోసుకొని ఉడికించిన బ్రోకలీ, బంగాళదుంప ముక్కలు వేసి కలపాలి.
  7. ఆపైన మూతపెట్టి మీడియం మంట మీద 5-7 నిమిషాలు ఉడికించాలి.
  8. చివరగా కొబ్బరి క్రీమ్ వేసి, బాగా కలిపేయాలి, అనంతరం స్టవ్ ఆఫ్ చేయాలి.

రుచికరమైన బ్రోకలీ కూర సిద్ధంగా ఉంది. అన్నం, నాన్స్ లేదా రోటీలతో తింటూ ఆస్వాదించండి.

తదుపరి వ్యాసం