Bhogi Recipes : భోగి రోజు తప్పకుండా తినాల్సిన పిండి వంటలు ఇవే
14 January 2024, 11:00 IST
- Bhogi Recipes Telugu : సంక్రాంతి వచ్చిందంటే ఇంటిలో రుచికరమైన పిండి వంటలు ఉండాల్సిందే. అయితే భోగి రోజు సైతం కొన్ని రకలా నైవేద్యాలు, పిండి వంటలు చేసుకోవాలి. అవేంటో చూద్దాం..
భోగి పిండి వంటలు
పండగలు అంటే పిండి వంటలు ఉండాల్సిందే. ఇక సంక్రాంతి వచ్చిందంటే రకరకాల పిండి వంటలు చేస్తూ ఉంటారు. దీని వెనక సైన్స్ కూడా దాగి ఉంది. ఆరోగ్యానికి మంచి జరిగేందుకు కొన్ని రకాల వంటకాలు పండగపూట తినాలని చెబుతారు. అలాగే భోగి పండుగ రోజున కొన్ని రకాల వంటకాలు చేసుకుని తినాలి. వాటి గురించి చూద్దాం..
సంక్రాంతి అంటే సూర్యుడి గమనాన్ని ప్రధానంగా చేసుకుని చేసే పండుగ. దానికి ముందు రోజు వచ్చే పండుగ భోగి. చలికాలంలో శరీరంలో ఉష్ణ శాతం తక్కువగా ఉంటుంది. భోగి రోజున చేసుకుని తినే ఆహారాలు.. శరీర ఉష్ణోగ్రతను పెంచడమే కాకుండా ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
భోగి రోజున కొత్తగా ఇంటికి వచ్చిన ధాన్యం భగవంతుడికి ప్రసాదంగా పెట్టాలని పెద్దలు చెబుతారు. ఒకవేళ పంట లేనివారు.. కొత్త బియ్యాన్ని కొని ప్రసాదం తయారు చేసి పెట్టాలి. కొత్త బియ్యం ప్రాసాదంతోపాటుగా గుమ్మడికాయ తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఇది ఆరోగ్యానికి మంచిది.
పెసలు, బియ్యం, మిరియాలు, ఉప్పు కలిపిన పొంగలిని ప్రసాదంగా పెడతారు. ఇందులో ఉపయోగించే పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈరోజున చేసే పిండి వంటల్లో శరీరాన్ని వేడి ఎక్కించే గుణాలు ఉంటాయి.
చాలా ప్రాంతాల్లో నువ్వుల రొట్టెలు చేసి గుమ్మడి కూరతో ఆహారాన్ని తింటారు. చక్కెరకు బదులుగా బెల్లాన్ని ఉపయోగించి పిండి పదార్థాలు చేస్తారు. నువ్వులు, బెల్లం కలిపి కూడా తింటారు. ఇలాంటి ఆహారాలతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నువ్వులతో చేసిన పిండి పదార్థాలను తినడం ఆరోగ్యానికి మంచిది. నువ్వులతో అరిసెలు, సకినాలు, మరుకులు చేసుకొని తినాలి. మార్కెట్లో మరమరాలు దొరుకుతాయి. వాటిని బెల్లం కలుపుకొని కూడా తినొచ్చు.
భోగి నాడు ఉదయం గుమ్మడి కాయను పగులగొట్టి గుమ్మడి కాయతో తీపి పదార్థాలు తయారు చేస్తారు. కొత్త బియ్యం, పెసరుపప్పు, ఆవుపాలు, బెల్లం, నెయ్యితో చేసిన పాయసం తింటారు. ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. పెసరపప్పు శరీరానికి చలువ. పండుగ నాడు ఇది కూడా తినాలి.
భోగి రోజున పైన చెప్పినవి దేవుడికి నైవేద్యంగా పెట్టాలి. వాటిని తినాలి. ఆరోగ్యానికి చాలా మంచిది. సంక్రాంతి సందర్భంగా నువ్వులు, బెల్లం తినాలి. శరీరానికి ఎన్నో ఉపయోగాలు ఉంటాయి.