CM Jagan : రంగు మారిన, తడిసిన ధాన్యం కొనుగోలు-సీఎం జగన్ కీలక ఆదేశాలు
CM Jagan : రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ ద్వారా కొనుగోలు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. వైఎస్సార్ ఉచిత బీమా పరిహారం, ఇన్ పుట్ సబ్సిడీలను రైతులకు సకాలంలో అందించాలని ఆదేశించారు.
CM Jagan : మిగ్ జామ్ తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలపై, రంగుమారిన వరి ధాన్యం కొనుగోలుపై క్యాంప్ కార్యాలయంలో మంగళవారం సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. తుపాను బాధిత ప్రాంతాల్లో రైతులను ఆదుకుంటున్న చర్యలపై ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులతో చర్చించారు. వైఎస్సార్ ఉచిత బీమా పరిహారం, ఇన్ పుట్ సబ్సిడీలను రైతులకు సకాలంలో అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు.
రైతులకు భరోసా కల్పించండి
రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం జగన్ అన్నారు. రైతులకు ప్రభుత్వం అన్నిరకాలుగా అండగా ఉంటుందన్న భరోసా కల్పించాలని ఎమ్మెల్యేలు, అధికారులతో సీఎం జగన్ తెలిపారు. అవసరమైతే కొన్ని నిబంధనలు సడలించి రైతులకు న్యాయం చేయాలని సూచించారు. రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేస్తోందన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఈ విషయాన్ని రైతులకు తెలియజేసి, వారిలో భరోసాను నింపాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు విషయంలో లిబరల్ ఉండాలన్నారు.
ఎన్యూమరేషన్ ప్రక్రియ
రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు పంపే బాధ్యతను పౌరసరఫరాల శాఖ తీసుకుంటుందని సీఎం జగన్ అన్నారు. రైతు భరోసా కేంద్రాల వారీగా ధాన్యం కొనుగోళ్లు జరుగుతాయన్నారు. పంట నష్టం అంచనా ప్రక్రియపై అధికారులను సీఎం జగన్ ఆరా తీశారు. ఈ నెల 11 నుంచి 18 వరకు పంట నష్టం అంచనా జరుగుతోందన్నారు. ఈ నెల 19 నుంచి 22 వరకు సోషల్ ఆడిట్ కోసం రైతు భరోసా కేంద్రాల్లో జాబితాలు అందుబాటులో ఉంచుతామని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. ఇన్ పుట్ సబ్సిడీ అందించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
లక్షల ఎకరాల్లో పంట నష్టం
ఏపీలో మిగ్ జామ్ తుపాను కారణంగా ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. పంటలు పండి చేతికి వచ్చే సమయంలో తుపాను కారణంగా తీవ్ర నష్టం జరిగింది. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు అన్ని జిల్లాల్లో తుపాను తీవ్ర ప్రభావం చూపింది. లక్షల ఎకరాల పంటలు దెబ్బతిన్నాయి. వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అంచనా. తుపాను వల్ల జరిగిన పంట నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేస్తుంది. వివిధ శాఖలు తమ పరిధిలో జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో అంచనా వేస్తున్నాయి. పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులు ఎదురుచూస్తు్న్నారు. ప్రభుత్వం పరిహారం అందిస్తే కనీసం కొంత మేర కోలుకునే పరిస్థితి ఉంటుందని భావిస్తున్నారు.