Usiri Pulihora: రోగనిరోధక శక్తిని పెంచే ఉసిరి పులిహోర రెసిపీ, చాలా ఈజీ-usiri pulihora recipe in telugu know how to make it ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Usiri Pulihora: రోగనిరోధక శక్తిని పెంచే ఉసిరి పులిహోర రెసిపీ, చాలా ఈజీ

Usiri Pulihora: రోగనిరోధక శక్తిని పెంచే ఉసిరి పులిహోర రెసిపీ, చాలా ఈజీ

Haritha Chappa HT Telugu
Jan 06, 2024 11:16 AM IST

Usiri Pulihora: కార్తీక మాసం వచ్చిందంటే ఉసిరికాయల సీజన్ వచ్చినట్టే. దీంతో పులిహోర చేసి చూడండి టేస్టీగా ఉంటుంది.

ఉసిరి పులిహోర
ఉసిరి పులిహోర (Recipe Table/Youtube)

Usiri Pulihora: ఉసిరితో చేసే వంటకాలు ఎన్నో. ఉసిరి పచ్చడి, ఉసిరి ఊరగాయ, ఉసిరి జ్యూస్... ఇలా రకరకాల రూపాల్లో ఉసిరికాయని తింటూ ఉంటారు. కొంతమందికి ఈ వంటకాలేవీ నచ్చవు. అలాంటి వాళ్ళు ఉసిరి పులిహోరను చేసుకొని తినండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. నిమ్మకాయ పులిహోర ఎలా చేస్తారో ఉసిరి పులిహోర కూడా దాదాపు అలాగే చేస్తారు. ఉసిరికాయతో చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చలికాలంలో మాత్రమే దొరికే ఉసిరిని ఖచ్చితంగా తినాలి. ఇవి సీజనల్ ఫ్రూట్... కాబట్టి ఏ సీజన్లో దొరికినవి ఆ సీజన్లో దొరకడం తినడం చాలా ముఖ్యం. ఉసిరి పులిహోరను సింపుల్‌గా ఎలా చేయాలో చూద్దాం.

ఉసిరి పులిహోర రెసిపీకి కావాల్సిన పదార్థాలు

వండిన అన్నం - ఒకటిన్నర కప్పు

నూనె - మూడు స్పూన్లు

పల్లీలు - గుప్పెడు

ఉసిరి కాయలు - నాలుగు

పసుపు - అర స్పూను

ఎండుమిర్చి - నాలుగు

కరివేపాకు - గుప్పెడు

ఉప్పు - రుచికి సరిపడా

ఆవాలు - అర స్పూను

శనగపప్పు - అర స్పూను

మినప గుళ్ళు - అర స్పూను

ఉసిరి పులిహోర రెసిపీ

1. అన్నాన్ని మరీ ముద్దలా కాకుండా పొడిపొడిగా వచ్చేలా వండుకోవాలి.

2. ఉసిరికాయల్లోని గింజలు తీసేసి చిన్న ముక్కలుగా కోసి, మెత్తగా నూరి పక్కన పెట్టుకోవాలి.

3. అన్నంలో ఉసిరి పేస్టును, రుచికి సరిపడా ఉప్పును వేసి కలుపుకోవాలి.

4. ఇప్పుడు కళాయి స్టవ్ మీద పెట్టి అందులో నూనె వేయాలి.

5. నూనె వేడెక్కాక ఆవాలు, శెనగపప్పు, మినపప్పు, పల్లీలు వేసి వేయించాలి.

6. అవి చిటపటలాడుతున్నప్పుడు ఎండు మిరపకాయలు, కరివేపాకులు, పసుపు వేసి కలుపుకోవాలి.

7. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఉసిరి పేస్ట్ కలుపుకున్న అన్నంలో వేసి పొడిపొడిగా వచ్చేలా కలుపుకోవాలి. అంతే ఉసిరి పులిహోర రెడీ అయినట్టే.

చలికాలంలో దొరికే ఉసిరికాయను రోజుకొకటి తింటే ఎంతో మంచిది. ఉసిరికాయ తినడం వల్ల కంటి చూపు మెరుగుమవుతుంది. మలబద్ధకం సమస్య తగ్గుతుంది. జలుబు, దగ్గు వంటివి తరచూ దాడి చేయడం తగ్గిస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి కొన్ని రకాల జ్వరాలు రావు. ఉసిరికాయలో విటమిన్ సి, ఫాస్పరస్, క్యాల్షియం, బి కాంప్లెక్స్, బీటా కెరాటిన్ పుష్కలంగా ఉంటాయి. అలాగే విటమిన్‌లు, ఖనజాలు లభిస్తాయి. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఆయుర్వేదంలో ఉసిరికి ఉన్నత స్థానం ఉంది. అలాంటి ఉసిరిని తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మధుమేహం ఉన్నవారు ఉసిరికాయను ప్రతిరోజూ తినాలి. ఇలా తినడం వల్ల షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. ఉసిరిలో క్రోమియం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండేలా చేస్తుంది. అలాగే గుండె కవాటాలు మూసుకుపోకుండా అడ్డుకుంటుంది. చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా కలిగిస్తుంది. అధిక బరువుతో బాధపడేవారు ఉసిరిని ఆహారంలో భాగం చేసుకోవాలి. ఉసిరిలోని పోషకాలు ఆరోగ్యానికి చాలా ముఖ్యం.

టాపిక్