Spinach Oats Attu Recipe । బ్రేక్‌ఫాస్ట్‌లో పాలకూర ఓట్స్ అట్టు.. ఆరోగ్యానికి ఇది బెస్టు!
03 August 2024, 22:42 IST
- Spinach Oats Attu Recipe: ఆరోగ్యకరమైన, తేలికైన అల్పాహారం చేయాలనుకుంటే పోషకాలతో నిండిన పాలకూర ఓట్స్ అట్టు ప్రయత్నించండి. రెసిపీ కోసం ఇక్కడ చూడండి.
Spinach Oats Attu Recipe
ఉదయం పూట తినే అల్పాహారం ఆరోగ్యకరమైనది, రుచికరమైనది అయితే రోజంతా ఉల్లాసంగా గడిచిపోతుంది. మీరు ఉదయాన్ని ఆరోగ్యకరమైన రీతిలో ప్రారంభించడానికి పాలకూర ఓట్స్ అట్టుతో బ్రేక్‌ఫాస్ట్ చేయండి. ఈ పాలకూర అట్టు చాలా ప్రత్యేకమైనది. దీనిలో ఉపయోగించే పదార్థాలు శరీరానికి ఎన్నో పోషకాలను అందిస్తాయి.
పాలకూరలో విటమిన్ కె సమృద్ధిగా ఉండటంతో పాటు కాల్షియం, విటమిన్ డి, డైటరీ ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి వంటి పోషకాలు ఉంటాయి. ఇవన్నీ ఎముకల ఆరోగ్యానికి అవసరమైనవి. బరువు తగ్గాలనుకునే వారికి ఓట్స్ ఒక తేలికైన ఆహారం. ఇంకా బాదాం పాలలోని గుణాలు మెరిసే చర్మం కోసం, గుండె ఆరోగ్యానికి మంచివి. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ అల్పాహారాన్ని తినకుండా ఉండగలమా. పాలకూర ఓట్స్ అట్టు రెసిపీ ఈ కింద ఉంది చూడండి.
Spinach Oats Attu Recipe కోసం కావలసినవి
- 2 కప్పులు ఓట్స్
- 1/2 కప్పుగోధుమ పిండి
- 2 కప్పులు బాదాంపాలు
- 1 కప్పు తరిగిన పాలకూర
- 1 చిటికెడు మిరియాల పొడి
- 1 చిటికెడు ఉప్పు
- 1/2 పావు నూనె
పాలకూర ఓట్స్ అట్టు తయారీ విధానం
- ముందుగా ఒక పెద్ద గిన్నెలో ఓట్స్ తీసుకొని, అందులో బాదం పాలు పోసి 1 గంటపాటు నానబెట్టండి.
- గంట తర్వాత బాదాం ఓట్స్ మిశ్రమాన్ని మెత్తని పేస్టులాగా గ్రైండ్ చేయండి.
- ఆ తర్వాత తరిగిన పాలకూరను పేస్ట్‌లో వేసి, ఉప్పు, మిరియాల పొడి కూడా వేసి మరోసారి ఈ పేస్ట్‌ను రుబ్బుకోవాలి.
- ఇప్పుడు ఇందులో గోధుమ పిండి, కొన్ని నీళ్లను కలపడం ద్వారా అట్టు వేసుకునేటట్లుగా పిండి చిక్కగా తయారవుతుంది.
- మీడియం వేడి మీద నాన్ స్టిక్ పాన్ వేడి చేయండి. కొద్దిగా నూనె చిలకరించి గుండ్రంగా అట్టు వేయండి.
- బంగారు గోధుమ రంగు వచ్చేవరకు రెండు వైపులా అట్టును బాగా ఉడికించాలి.
అంతే, పాలకూర ఓట్స్ అట్టు రెడీ. వేడివేడిగా తినండి.