Healthy Breakfast | తేలికైన ఓట్స్ దోశ.. ఒక ఆరోగ్యకరమైన అల్పాహారం!
04 May 2022, 10:31 IST
- మీరు ఆరోగ్యకరమైన అల్పాహారం చేయాలనుకుంటున్నారా? అయితే మీకోసమే ఓట్స్ దోశ రెసిపీ అందిస్తున్నాం. కేవలం 15 నిమిషాల్లో సిద్ధం చేసుకోవచ్చు.
Oats Dosa (Stock Photo)
Oats Dosa
చాలా మందికి దోశ ఇష్టమైన అల్పాహారం. దోశలో ఎన్నో వెరైటీలు ఉంటాయి కూడా. అయితే ఆ దోశలన్నింటిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాంటి దోశలు రుచికి బాగుంటాయి కానీ ఆరోగ్యపరంగా అంత మంచివి కావు. అయితే మీకు తేలికగా జీర్ణమయ్యే, ఆరోగ్యకరమైన ఓట్స్ దోశ రెసిపీని అందిస్తున్నాం. ఓట్స్ దోశను చేసుకోవడం చాలా సులభం. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, ఎలా తయారో చేసుకోవాలో చూడండి.
ఓట్స్ దోశకు కావాల్సిన పదార్థాలు
1 కప్ రోల్డ్ ఓట్స్
1 టేబుల్ స్పూన్ సూజి రవ్వ
1/2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి
1/2 టీస్పూన్ మెంతులు
రుచికి సరిపడా ఉప్పు
చిటికెడు ఇంగువ
1/2 టీస్పూన్ నల్ల మిరియాలు
7-8 కరివేపాకులు
1 టీస్పూన్ అల్లం
1 టీస్పూన్ పచ్చిమిరపకాయలు
1 ఉల్లిపాయ
1 టేబుల్ స్పూన్ నూనె
తయారు చేసుకునే విధానం
- మొదట ఓట్స్ ను దోరగా వేయించాలి. ఆపై ఓట్స్ చల్లబరిచి అందులో కొన్ని మెంతులు వేసి గరిటెతో తిప్పుతూ పొడిగా మార్చండి.
- ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో ఒక చెంచా సూజి రవ్వ, అలాగే బియ్యపిండిని వేయండి.
- ఈ పిండికి ఒక చెంచా పెరుగు, కొద్దిగా ఉప్పు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు, అల్లం తురుము వేసి బాగా కలపండి.
- దోశలు వేసుకునేలా తగినంతగా నీరు పోసి పిండిని బాగా కలపండి. దీనిని 15 నిమిషాలు పక్కన పెట్టండి. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చి మిరపకాయలు వేయండి
- ఇప్పుడు పెనంపై దోశలాగా వేసుకోవాలి. రెండు వైపులా కాల్చుకోవాలి.
ఈ ఓట్స్ దోశలను సాంబారుతో తీసుకుంటే రుచిగా ఉంటాయి.