Healthy Breakfast । పచ్చి మొలకలతో అల్పాహారం.. ఇలా తింటే రుచికరం, ఆరోగ్యకరం!
06 July 2022, 8:35 IST
- ఆరోగ్యకరమైన అల్పాహారం కోసం చూస్తుంటే మొలకెత్తిన విత్తనాలతో 15 నిమిషాల కంటే తక్కువ సమయంలో చేసుకోగలిగే ఈ రుచికరమైన రెసిపీని ట్రై చేయండి.
Nutritious Sprouts Meal
ఆరోగ్యకరమైన ఆహారం విషయానికి వస్తే మొలకెత్తిన విత్తనాలు ఎంతో మంచివి. వీటిని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే అవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. మొలకలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. క్యాలరీలు తక్కువగా ఉంటాయి. వీటిని అల్పాహారంగా తీసుకుంటే మీ కడుపును నిండుగా ఉంచడమే కాకుండా, అధిక బరువును తగ్గించుకోవచ్చు. మొలకలలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మొలకలు అధిక మొత్తంలో జీవ ఎంజైమ్‌లతో నిండి ఉంటాయి కాబట్టి మెరుగైన జీర్ణక్రియ పొందవచ్చు, తద్వారా జీవక్రియను ప్రోత్సహిస్తాయి. మొలకలలోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి కాబట్టి గుండె ఆరోగ్యానికి మంచిది.
మరి ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నపుడు వీటిని మీరు అల్పాహారంగా ఎందుకు తీసుకోకూడదు? ఒకవేళ మీకు పచ్చిగా తినడం ఇష్టం లేకపోతే, ఇందులోని పోషకాలు పోకుండా మీకు రుచికరంగా వివిధ రకాల మొలకాలతో తయారుచేసుకునే 'మిక్స్‌డ్ స్ప్రౌట్స్ స్టిర్ ఫ్రై' రెసిపీని ఇక్కడ అందిస్తున్నాం. ఇందుకోసం ఏమేం కావాలి? ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
కావాల్సిన పదార్థాలు
- మిక్స్‌డ్ మొలకలు- 2 కప్పులు (పెసర్లు, శనగలు, చిక్కుళ్లు)
- ఉల్లిపాయ - 1
- టొమాటో - 1
- పచ్చిమిర్చి - 2
- కూరగాయలు (క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్) - 1 కప్పు
- నూనె - 2 టీస్పూన్లు
- జీలకర్ర - 1 టీస్పూన్
- ఇంగువ - అర టీస్పూన్
- ఎర్ర మిరపకాయ - 1
- నల్ల మిరియాల పొడి - అర టీస్పూన్
- ఉప్పు - రుచికి తగినట్లుగా
- నిమ్మరసం రుచికోసం
- తాజా కొత్తిమీర
తయారు చేసుకునే విధానం
- ముందుగా మొలకలను అన్నీ కలిపి ఆవిరి మీద ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేడి చేసి జీలకర్ర, ఎర్రమిరపకాయ, ఇంగువ వేసి వేయించాలి.
- అనంతరం ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసి రంగు మారేంత వరకు వేయించాలి.
- ఇప్పుడు ఇందులోనే గింజలు తీసేసి సన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు, ఇతర వెజిటెబుల్ ముక్కలు అలాగే కొంచెం ఉప్పు వేసి ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు ఎక్కువ మంట మీద వేయించాలి.
- ఇప్పుడు మంట తగ్గించి, ఉడికించిన మొలకలు, ఉప్పు, నల్ల మిరియాల పొడి ఆపైన నిమ్మరసం వేసి అన్ని బాగా కలిసిపోయేలా తిప్పండి.
చివరగా స్టవ్ ఆఫ్ చేసి తాజాగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. వేడి వేడిగా వడ్డించుకొని తినండి. ఈ అల్పాహారం రుచికరమైనదే కాకుండా ఆరోగ్యకరమైనది.