Karivepaku Nilva Pachadi: కరివేపాకు నిల్వ పచ్చడి రెసిపీ, ఒకసారి చేసుకుంటే రెండు నెలలు తాజాగా ఉంటుంది
19 December 2024, 11:34 IST
- Karivepaku Nilva Pachadi: కరివేపాకులతో చేసే టేస్టీ నిల్వ పచ్చడి రెసిపీ ఇది. రుచి అదిరిపోతుంది. ఒకసారి చేసుకుంటే రెండు నెలల పాటూ తాజాగా ఉంటుంది.
కరివేపాకు నిల్వ పచ్చడి
కరివేపాకులను కూరలో వేసినా, సాంబార్ లో వేసినా తీసి పడేసే వారు ఎంతో మంది. నిజానికి అవి చేసే మేలు అంతా ఇంతా కాదు. కరివేపాకులను తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అందుకే కరివేపాకు నిల్వ పచ్చడి చేసుకుని పెట్టుకోండి. ప్రతిరోజూ ఇది కలుపుకుని రెండు ముద్దలు అన్నం కలుపుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
కరివేపాకుల నిల్వ పచ్చడి రెసిపీకి కావాల్సిన పదార్థాలు
కరివేపాకులు - పావు కిలో
చింత పండు - పెద్ద నిమ్మకాయ సైజులో
నీళ్లు - సరిపడినన్ని
ఆవాలు - రెండు స్పూన్లు
ధనియాలు - ఒక స్పూను
మెంతులు - అర స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - తగినంత
కారం - అర కప్పు
పచ్చి శెనగపప్పు - ఒక స్పూను
వెల్లుల్లి రెబ్బలు - పది
ఎండు మిర్చి - రెండు
ఇంగువ - పావు స్పూను
కరివేపాకుల నిల్వ పచ్చడి రెసిపీ
1. కరివేపాకులను శుభ్రంగా కడిగి గాలికి ఆరబెట్టాలి.
2. చింతపండును నీళ్లలో నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి.
3. స్టవ్ మీద కళాయి పెట్టి రెండు స్పూన్ల నూనె వేయాలి
4. అందులో కరివేపాకులను వేసి వేయించాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
5. ఇప్పుడు మరొక కళాయి పెట్టి అందులో ఆవాలు, ధనియాలు, మెంతులు వేసి వేయించి పొడి చేసి పెట్టుకోవాలి.
6. అదే కళాయిలో నానబెట్టుకున్న చింతపండును వేసి అది దగ్గరగా అయ్యే దాకా ఉడకబెట్టుకోవాలి.
7. ఇప్పుడు మిక్సీజార్లో వేయించుకున్న కరివేపాకులు, ముందు చేసి పెట్టుకున్న పొడి, చింత పండు, కారం, రుచికి సరిపడా ఉప్పు, రెండు స్పూన్ల నూనె వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
8. స్టవ్ మీద కళాయి పెట్టి నాలుగు స్పూన్ల నూనె వేయాలి. అందులో వెల్లుల్లి రెబ్బలు, పచ్చి శెనగపప్పు, ఇంగువ, ఎండుమిర్చి వేసి వేయించాలి.
9. అందులోనే మిక్సీ జార్లో ఉన్న కరివేపాకుల మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే టేస్టీ కరివేపాకుల పచ్చడి రెడీ అయినట్టే.
కరివేపాకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో చేసిన ఆహారాలు తినడం వల్ల ఎన్నో సమస్యలు రాకుండా ఉంటాయి. కరివేపాకులు జీర్ణశక్తిని పెంచుతాయి. కొలెస్టాల్ స్థాయిని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. జుట్టు పెరుగుదలను కూడా ఇది వేగవంతం చేస్తుంది. కంటి ఆరోగ్యానికి కరివేపాకులు తినడం చాలా అవసరం. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడడంలో కరివేపాకులు ముందుంటాయి. కరివేపాకు పచ్చడిని చలికాలంలో తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి.
టాపిక్