Kadai Mushroom curry: నోరూరించే కడాయి మష్రూమ్ కర్రీ.. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు..
28 August 2023, 12:30 IST
Kadai Mushroom curry: రెస్టరెంట్ స్టైల్ రుచితో ఇంట్లోనే కడాయి మష్రూమ్ ఎలా తయారు చేసుకోవాలో పక్కా కొలతలతో సహా చూసేయండి.
కడాయ్ మష్రూమ్
కడాయ్ పన్నీర్, పన్నీర్ మసాలా.. ఇలా వెజిటేరియన్ వంటల్లో కాస్త ప్రత్యేకంగా చేసుకుందాం అంటే గుర్తొచ్చేవి పన్నీర్ వంటలే. కానీ ప్రతిసారీ పన్నీర్ తింటే బోర్ కొట్టేస్తుంది. పన్నీర్ లాంటి మంచి ఆప్షన్ పుట్టగొడుగులు. వాటితో కూడా రకరకాల రుచికరమైన వంటలు వండుకుని ఆస్వాదించేయొచ్చు. ఇప్పుడు పుట్టగొడుగులు లేదా మష్రూమ్ లతో కడాయ్ మష్రూమ్ ఎలా చేసుకోవాలో చూసేయండి.
కావాల్సిన పదార్థాలు:
200 గ్రాముల పుట్టగొడుగులు
1 క్యాప్సికం
2 టమాటాలు
3 చెంచాల నూనె
కొద్దిగా కొత్తిమీర తరుగు
అంగుళం అల్లం ముక్క
1 పచ్చిమిర్చి
గుప్పెడు జీడిపప్పు గింజలు
పావు చెంచా కారం
తగినంత ఉప్పు
పావు చెంచా గరం మసాలా
అరచెంచా ధనియాల పొడి
పావు చెంచా పసుపు
చెంచా కసూరీ మేతీ
కొద్దిగా ఇంగువ
అరచెంచా జీలకర్ర
తయారీ విధానం:
- ముందుగా కడాయిలో చెంచా నూనె వేసి టమాటా ముక్కలు, జీడిపప్పు, అల్లం వేసుకుని మిక్సీ పట్టుకోవాలి.
- ఇప్పుడు పుట్టగొడుగుల్ని శుభ్రంగా కడుక్కుని సగానికి కట్ చేసుకోవాలి. అలాగే క్యాప్సికం కూడా ముక్కలు కోసుకుని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు అదే కడాయిలో 2 చెంచాల నూనె వేసుకుని వేడెక్కాక క్యాప్సికం ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. ఈ ముక్కల్ని తీసుకుని వేరే గిన్నెలో వేసుకోవాలి.
- అదే కడాయిలో కొద్దిగా జీలకర్ర, ఇంగువ వేసి చిటపటలాడాక పసుపు, ధనియాల పొడి, మిక్సీ పట్టుకున్న టమాటా మిశ్రమం కూడా వేసుకోవాలి. కారం, కసూరీ మేతీ కూడా వేసుకోవాలి. నూనె తేలేవరకు ఈ మిశ్రమాన్ని ఉడికించుకోవాలి.
- ఇప్పుడు అదే సమయంలో మరొక కడాయిలో చెంచా నూనె వేయి రెండు నిమిషాల పాటు పుట్టగొడుగుల్ని వేయించుకుని పక్కన పెట్టేసుకోవాలి.
- ఉడుకుతున్న గ్రేవీలో క్యాప్సికం, పుట్టగొడుగు ముక్కలు వేసుకుని కలుపుకోవాలి. ఉప్పు, గరం మసాలా కూడా వేసుకుని రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. కాస్త గ్రేవీ అవసరం అనుకుంటే అరకప్పు నీళ్లు పోసుకుని ఉడికించుకోవాలి. అంతే కడాయి మష్రూమ్ సిద్ధం అయినట్లే..