Winter Tips: శీతాకాలంలో చేతులు, కాళ్లు మరీ చల్లగా మారి ఇబ్బందిగా ఉందా? ఈ చిట్కాలు ట్రై చేయండి
03 December 2024, 10:30 IST
- Winter Tips: చలికాలంలో రకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి. కొందరికి చేతులు, కాళ్లు మరీ చల్లగా మారి ఇబ్బందిగా ఉంటుంది. ఇలా జరుగుతుంటే కొన్ని మార్గాల ద్వారా ఉపశమనం పొందవచ్చు.
Winter Tips: శీతాకాలంలో చేతులు, కాళ్లు మరీ చల్లగా మారి ఇబ్బందిగా ఉందా? ఈ చిట్కాలు ట్రై చేయండి
వాతావరణం చల్లగా ఉండే శీతాకాలంలో శరీరానికి సవాళ్లు ఎదురవుతాయి. ఇప్పుడిప్పుడే చలికాలం తీవ్రమవుతోంది. ఉష్ణోగ్రతలు పడిపోతూ శీతల వాతావరణం పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో చాలా మందికి రకరకాల ఇబ్బందులు తలెత్తుతాయి. శీతాకాలంలో కొందరికి చేతులు, కాళ్లు చాలా చల్లగా మారిపోతాయి. దీనివల్ల వణుకుగా అనిపిస్తుంది. దురద కూడా వచ్చే అవకాశం ఉంటుంది. చేతులు, చేతి వేళ్లు మరీ కూల్‍గా ఉంటాయి. దీంతో ఇబ్బందులు పడుతుంటారు. కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అవేవో చూడండి.
మాసాజ్ చేసుకోవాలి
శీతాకాలంలో చేతులు, కాళ్లు ఎక్కువ చల్లగా మారుతుంటే మసాజ్ చేసుకోవడం రిలీఫ్ ఇస్తుంది. మీ చేతులు, కాళ్లకు నిదానంగా మసాజ్ చేయాలి. ఇందుకోసం ముందుగా కొబ్బరినూనె లేకపోతే ఆవాల నూనె కాస్త మరిగించాలి. గోరు వెచ్చగా ఉన్నప్పుడే ఆ నూనెతో చేతులు, కాళ్లకు రుద్దుతూ మృధువుగా మసాజ్ చేసుకోవాలి. దీనివల్ల తక్షణమే వెచ్చదనంగా అనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగై చల్లదనం నుంచి ఉపశమనం కలుగుతుంది. నిద్రపోయే ముందు ప్రతీ రోజు ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఉదయం కూడా మసాజ్ చేసుకోవచ్చు.
గోరువెచ్చని నీటిలో..
కాళ్లు, చేతులు అతిగా చల్లగా అవుతుంటే గోరువెచ్చని నీరు కూడా సాయం చేస్తుంది. గోరువెచ్చని నీటిలో కాళ్లు, చేతులను కాసేపు ఉంచాలి. దీనివల్ల చాలా ఉపశమనం కలుగుతుంది. ఇది పాటించడం కూడా చాలా సులభం. గోరువెచ్చని నీటిలో చేతులు, కాళ్లు ఉంచడం ద్వారా కూడా రక్త ప్రసరణ బాగా అవుతుంది. చల్లదనం నుంచి తక్షణమే ఉపశమనం దక్కుతుంది. వణకడం, దురద లాంటివి కూడా తగ్గిపోతాయి. నొప్పుల నుంచి కూడా ఉపశమనంగా అనిపిస్తుంది.
సాక్స్, గ్లౌవ్స్
శీతాకాలంలో చేతులు, కాళ్లు అతిగా చల్లగా అవుతుంటే ఇంట్లో కూడా సాక్స్, గ్లౌవ్స్ ధరించడం మేలు. కాళ్లకు మందంగా ఉన్న సాక్స్ ధరిస్తే.. కాళ్లలో వెచ్చదనం నిలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చేతులకు కూడా ఉన్ని గ్రౌవ్స్ ధరించాలి. రాత్రి కూడా సాక్స్, గ్లౌవ్స్ ధరించి నిద్రించాలి. దీనివల్ల వెచ్చదనం మెరుగ్గా ఉంటుంది.
వర్కౌట్స్ చేయాలి
శారీరక శ్రమ తక్కువ ఉండే శీతాకాలంలో మరింత చలిగా అనిపిస్తుంది. అందుకే ఈ కాలంలో తప్పనిసరిగా వ్యాయామాలు చేయాలి. వర్కౌట్స్ చేయడం వల్ల శరీరంలో వెచ్చదనం పెరుగుతుంది. రక్తప్రసరణ బాగా జరిగి చురుకుదనం పెరుగుతుంది. అందుకే రెగ్యులర్‌గా వ్యాయామం చేయాలి.
ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్
ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఫుడ్స్ తినడం వల్ల శరీరంలోపల వెచ్చదనం మెరుగ్గా ఉంటుంది. అందుకే చలికాలంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండే నట్స్, గింజలు, కూరగాయలు, పండ్లు తినాలి. శరీరంలో జీవక్రియను ప్రోటీన్ మెరుగుపరుస్తుంది. అంతర్గతంగా వెచ్చదనాన్ని పెంచుతుంది. దీనివల్ల కాళ్లు, చేతులు చల్లబడడం సమస్య తగ్గే అవకాశం ఉంటుంది.