తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Split Personality | ఒకసారి రమేష్‌లా మరోసారి సురేష్‌లా.. మీలో ఓ అపరిచితుడు ఉన్నాడనడానికి సంకేతాలు ఇవే!

Split Personality | ఒకసారి రమేష్‌లా మరోసారి సురేష్‌లా.. మీలో ఓ అపరిచితుడు ఉన్నాడనడానికి సంకేతాలు ఇవే!

HT Telugu Desk HT Telugu

10 March 2023, 19:07 IST

    • Multiple Personality Disorder:  అప్పుడే రాము, ఆకస్మికంగా రెమోగా మారడం, ఆపైమ మళ్లీ క్యారెక్టర్ చేంజ్. ఇలా అపరిచితుడిలా క్యారెక్టర్లు మార్చడం నటనా? లేక ఏదైనా రోగమా? తెలుసుకోండి ఇక్కడ.
Multiple Personality Disorder:
Multiple Personality Disorder: (Unsplash)

Multiple Personality Disorder:

Multiple Personality Disorder: కొన్నేళ్ల కిందట 'అపరిచితుడు' అనే ఒక సినిమా వచ్చింది. అందులో హీరో ఒకసారి రాముడు మంచి బాలుడులా, మరోసారి అల్లరి రెమోలో ఇంకోసారి భయంకరమైన అపరిచితుడిలా ప్రవర్తిస్తాడు. ఇలా ఒకే వ్యక్తి విభిన్నమైన వ్యక్తిత్వాలు ప్రదర్శించడాన్ని వైద్య పరిభాషలో 'మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్' గా చెబుతున్నారు. దీనినే డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ (DID) అని కూడా పిలుస్తారు.

ఇది ఒక మానసిక రుగ్మత. దీనినే కథావస్తువుగా మలుచుకొని అనేక సంవత్సరాలుగా అనేక చలనచిత్రాలు, టెలివిజన్ ధారావాహికలు ప్రదర్శితమయ్యాయి. అయితే మానసిక వ్యాధుల చికిత్స విషయంలో మాత్రం ఇది ఒక వివాదాస్పద రోగనిర్ధారణగా మిగిలిపోయింది. ఎందుకంటే ఈ వ్యాధి నిజమైనదేనా లేక నటిస్తున్నారా అనే అనుమానం చాలా మందికి కలుగుతుంది. కానీ, మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ (MPD) అనేది నిజమైనదే. చాలా అరుదుగా ఈ వ్యాధికి గురవుతారు, సాధారణ జనాభాలో కేవలం 1% మంది మాత్రమే దీని వలనప్రభావితం అవుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది నిజమైనదో, కాదో నిర్ధారించటానికి నిపుణులు లోతైన పరీక్ష చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఈ అవస్థను సాకుగా చూపి దుర్వినియోగపరిచే వారూ లేకపోలేదు.

మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ సంభవించటానికి కారణాలు

డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ మూలాలు తరచుగా చిన్ననాటి గాయాలు, తీవ్రమైన సమస్యలు లేదా వివిధ అంశాలలో దుర్వినియోగం నుండి ఉత్పన్నమవుతాయి. సాధారణంగా బాల్యంలో మనసుకు అయిన గాయం, శారీరక, భావోద్వేగ లేదా లైంగిక వేధింపులు, బాల్యంలో నిస్సహాయతతో ఎదుర్కొన్న క్షోభ వంటివి కారణం అవుతాయి. ఇలాంటి బాధాకరమైన సంఘటనలు అనుభవించిన సమయంలో మెదడు దాని ప్రతిస్పందనగా ఆ చేదు జ్ఞాపకాలను విడదీస్తుంది, ఈ మార్పు అసంకల్పితంగా వారి గుర్తింపులో మార్పును కలిగిస్తుంది అని న్యూఢిల్లీలోని ఫోర్టిస్ ఫ్లట్ లెఫ్టినెంట్ రాజన్ ధాల్ హాస్పిటల్ లో కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ అయిన డాక్టర్ త్రిదీప్ చౌదరి తెలిపారు.

పర్సనాలిటీ డిజార్డర్ లక్షణాలు, సంకేతాలు

DID అనేది ఒక వ్యక్తి తన గుర్తింపును, తనలోని వ్యక్తిత్వాన్ని,రెండు లేదా అంతకంటే ఎక్కువగా ప్రదర్శించే పరిస్థితి. ఈ క్రమంలో వారు ఒకసారి రమేష్‌లా, మరోసారి సురేష్‌లా వివిధ పేర్లతో, ప్రత్యేకమైన వ్యక్తిగత చరిత్ర కలిగినట్లు, వేర్వేరు లక్షణాలను ప్రదర్శిస్తారు. కొన్నిసార్లు చిన్నపిల్లల్లా లేదా చాలా పెద్దవారిలో కూడా మాట్లాడవచ్చు. DID ఉన్న వ్యక్తులు ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తారు, అంతకుముందు వారు ఎలా ప్రవర్తించారో వారికేమీ గుర్తుండదు.

DID సంబంధిత ఇతర సాధారణ సంకేతాలు ఇలా ఉండవచ్చు

  • అనవసరపు ఆందోళన
  • భ్రమలో ఉండటం
  • తరచుగా డిప్రెషన్.
  • దిక్కుతోచని స్థితి.
  • డ్రగ్ లేదా ఆల్కహాల్‌కు బానిసవడం
  • జ్ఞాపకశక్తి లోపించడం.
  • ఆత్మహత్య ఆలోచనలు లేదా స్వీయ-హాని.

DIDకి చికిత్స ఏమి?

డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ ను నేరుగా చికిత్స చేయడానికి మందులు లేవు. అయితే లక్షణాలను తగ్గించడం, భావోద్వేగాలను అదుపుచేయడం, ఆందోళనలు ఆలోచనల ప్రక్రియలపై నియంత్రణ సాధించడంలో సహాయపడే మానసిక చికిత్సను అందిస్తారు. ఈ చికిత్స వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతుంటుంది.