Bipolar Disorder | సూపర్ మ్యాన్‌లా పైనుంచి దూకేయాలనిపిస్తుందా? ఈ కథ చదవండి-world bipolar disorder day know a man s real life experience ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  World Bipolar Disorder Day- Know A Man's Real Life Experience

Bipolar Disorder | సూపర్ మ్యాన్‌లా పైనుంచి దూకేయాలనిపిస్తుందా? ఈ కథ చదవండి

Manda Vikas HT Telugu
Mar 30, 2022 04:43 PM IST

బైపోలార్ డిజార్డర్ సమస్య కలిగిన వ్యక్తులు ఆత్మహత్య చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు. కత్తి కనిపిస్తే పొడుచుకోవాలని, ఎత్తైన బిల్డింగ్ కనిపిస్తే దాని పైనుంచి దూకేయాలని వారికి అనిపిస్తుంది. ఈ రోజు ప్రపంచ బైపోలార్ డిజార్డర్ అవగాహన దినోత్సవం సందర్భంగా ఒక ప్రత్యేక కథనం

Bipolar Disorder (Representative Image)
Bipolar Disorder (Representative Image) (Pixabay)

ప్రతి మనిషి తన జీవితంలో కొన్ని సందర్భాల్లో మానసికంగా హెచ్చుతగ్గులకు లోనవడం సర్వసాధారణం. అయితే మితిమీరి ప్రవర్తిస్తే మాత్రం అది ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే అది ఒకరకమైన మానసిక రుగ్మత కావొచ్చు. ముఖ్యంగా బైపోలార్ డిజార్డర్ (Bipolar Disorder) ఉన్నవారిలో ఈ మానసిక అసమతౌల్యతలు విపరీతంగా ఉంటాయి.

ఎలా అంటే, ఇలాంటి వారికి కొద్దిపాటి విజయం దక్కినా మరీ ఎక్కువ ఉత్సాహంతో ఉరకలేస్తారు, అలాగే చిన్న విషయానికి కూడా తీవ్రంగా కుంగిపోతారు. ఒక్కోసారి బాగా ఎగ్జయిట్ అవుతారు, ఇంకోసారి ఈ జీవితమే ఒక వ్యర్థం అని ఆత్మహత్య ప్రయత్నాలూ చేస్తారు.

ఇవన్నీ బైపోలర్ డిజార్డర్ లక్షణాల కిందకే వస్తాయి. కాబట్టి ఒక వ్యక్తి మానసిక స్థితిని గమనించడం ఎంతో ముఖ్యం. విపరీత బుద్ధితో ప్రవర్తిస్తున్నప్పుడు వెంటనే గుర్తించి అందుకు తగిన వైద్యం తీసుకుంటే మంచిది. లేదా మొదటికే మోసం రావొచ్చు. ఈ బైపోలార్ డిజార్డర్ గురించి విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రతీ ఏడాది మార్చి 30న ప్రపంచ బైపోలార్ అవగాహాన దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.

బైపోలార్ డిజార్డర్ నుంచి బయటపడిన హైదరాబాద్‌కు చెందిన అనుదీప్ (పేరు మార్చాం) అనే వ్యక్తి తన అనుభవాలను పంచుకున్నాడు. అనుదీప్ తొలుత ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసే వాడు. అయితే ఒకనాడు తాను ప్రేమించిన వ్యక్తికి మరొకరితో పెళ్లి జరగటంతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు, అది బైపోలార్ డిజార్డర్‌కు దారితీసింది. ఆ తర్వాత ఏ అమ్మాయి తనను చూసినా, తనతో మాట్లాడినా ఆ అమ్మాయి తన ప్రేమలో పడిపోయిందనే భావనలో ఉండేవాడు.  ఎక్కడ లేని సంతోషం తన మొఖంలో ఉండేది. తనను మించిన లవర్ బాయ్ లేడేనంతలా ఫీలయ్యేవాడు. ఈ క్రమంలో కనిపించిన ప్రతీ అమ్మాయికి ప్రేమ ప్రతిపాదనలు చేశాడు. పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడేవాడు..

అంతలోనే ఒక్కసారిగా మూడ్ మారిపోయేది. తనకు ప్రేమ పడదు.. ఏదో కారణ జన్ముడు అనుకునేవాడు.. రోడ్డుపై భిక్షం అడిగిన వారికి తన సాలరీ మొత్తం ఇచ్చేశాడు. అదీ చాలదనట్లుగా అప్పులు చేసి మరీ డబ్బు పంచిపెట్టాడు. దీంతో తన తినడానికి కూడా ఏం లేకపోయేసరికి తీవ్రంగా నిరాశ చెందాడు. ఇక తనకు చావే శరణ్యం అని డిసైడ్ అయ్యాడు.. కానీ ఎలా చావాలి? అన్న ప్రశ్న తనను మళ్లీ వేధించి ఇబ్బంది పెట్టింది. దీంతో ఎత్తైన బిల్డింగ్ ఎక్కాడు.. తనను తాను సూపర్ మ్యాన్ లాగా ఫీలయ్యాడు. అక్కడ్నించి దూకబోగా అదృష్టవశాతూ తన స్నేహితుడొకరు వచ్చి ఆపాడు. ఊర్లో ఉన్న అనుదీప్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయాన్ని వివరించాడు.

దీంతో హుటాహుటిన వచ్చిన కుటుంబ సభ్యులు అనుదీప్‌కు ఏమైందోనని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రికి వెళ్లాక కూడా వైద్యుడికే వైద్యం ఎలా చేయాలో చెప్పటంతో ఆ డాక్టర్ సైకియాట్రిస్టుకి రిఫర్ చేశారు. దీంతో అక్కడ అనుదీప్ బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయింది. కొన్నాళ్ల పాటు వైద్యం తీసుకున్నాక ఇప్పుడు అనుదీప్ మళ్లీ మామూలు స్థితికి వచ్చాడు.

బైపోలార్ డిజార్డర్ ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • బైపోలార్ డిజార్డర్ కలిగిన వారు సూసైడ్ చేసుకోవాలనే ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి వారి సంరక్షకులు ఎప్పుడూ ఓ కంట కనిపెడుతూ ఉండాలి.
  • కొన్నాళ్ల పాటు వారిని బయటకు ఎటూ వెళ్లనివ్వకుండా ఇంటికే పరిమితం చేయాలి. వారిమానసిక స్థితిని పర్యవేక్షించాలి.
  • డాక్టర్లు సూచించిన మందులు నిత్యం క్రమం తప్పకుండా వాడుతూ ఉండాలి.
  • సరైన నిద్ర ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి.
  • ఒక షెడ్యూల్ ప్రకారం కార్యాచరణ ఉండేలా చూసుకోవాలి.
  • ఒత్తిడి, ఆందోళన చెందినపుడు ధైర్యం నింపాలి. వారిని పిచ్చివారిగా హేళన చేయకూడదు. మంచి కోరే సాంగత్యం కలిగి ఉండాలి.
  • ప్రతిరోజూ వ్యాయామం చేయాలి, సరైన ఆహారం తీసుకోవాలి, వైద్యుల సూచనలు పాటించాలి.

ఈ రకంగా కొన్నాళ్ల పాటు జాగ్రత్తగా ఉంటే బైపోలార్ డిజార్డర్ ను అధిగమించవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్