Parenting Tips | ఈ లక్షణాలు ఉన్నాయంటే 'మీ రాముడు మంచి బాలుడు కాదు' !-parenting tips here are some warning signs that your child is spoiled ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Parenting Tips- Here Are Some Warning Signs That Your Child Is Spoiled

Parenting Tips | ఈ లక్షణాలు ఉన్నాయంటే 'మీ రాముడు మంచి బాలుడు కాదు' !

HT Telugu Desk HT Telugu
Jan 24, 2023 04:54 PM IST

Parenting Tips - మీ పిల్లలు చెడిపోయారని తెలుసుకోవడం ఎలా? ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇస్తున్నాం, ఈ లక్షణాలు ఉంటే వారి ప్రవర్తనను మార్చాల్సిన అవసరం ఉంది.

Parenting Tips
Parenting Tips (Unsplash)

ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలను ప్రేమిస్తారు. తల్లిదండ్రులుగా మీ పిల్లలపై అమితమైన ప్రేమను కురిపించడంలో మీకు ఏది అడ్డు కాదు. అయితే అదే సమయంలో వారిని అతి గారాభం చేయకూడదు. ఒక్కోసారి మీ అతి ప్రేమ మీ పిల్లల ప్రవర్తనను పాడు చేయవచ్చు. పిల్లలు తప్పు చేసినపుడు వారికి అది అర్థమయ్యే రీతిలో తెలియజెప్పాలి. వారు చెడు దారిలో నడవకుండా కొన్ని ఆంక్షలు విధించాలి, నిబంధనలు పెట్టాలి. మీ పిల్లలు తప్పు చేసినప్పటికీ వారి ప్రవర్తనను అంగీకరించడం చేస్తే, వారు తప్పు ఏదో, ఒప్పో ఏదో తెలుసుకోలేరు. భవిష్యత్తులో ఇది మీకు చాలా చిక్కులను తీసుకురాగలదు.

పిల్లలకు ఏ భయం లేకపోతే వారు మరింత మొండిగా, దుందుడుకు స్వభావంతో వ్యవహరిస్తారు. ఇప్పుడే వారిని మీరు నియంత్రించలేకపోతే, వారు పెరిగి పెద్దయినపుడు వారిలో మంచితనం అనేది ఉండదు. అందుకే పెద్దలు అంటారు 'మొక్కై వంగనిది, మానై వంగునా అని' అంటే మొక్క దశలోనే వంగనపుడు, పెరిగి మహావృక్షం అయితే అది వంగదు అని అర్థం.

పిల్లల పెంపకం అనేది ఒక బాధ్యతాయుతమైన కర్తవ్యం. పిల్లలు కోరినదల్లా తెచ్చి ఇవ్వడం, వారిని అల్లారు ముద్దుగా పెంచుకోవడం మాత్రమే కాదు. వారిని క్రమశిక్షణగా పెంచడం, మంచి చెడులు నేర్పించడం, వారిని సరైన దారిలో నడిపించడమే అసలైన పేరెంటింగ్.

Parenting Tips - Spoiled Child Behaviors- చెడిన పిల్లలను గాడిలో పెట్టడం ఎలా?

మీ పిల్లలు చెడిపోయారు అని చెప్పటానికి వారిలో కొన్ని లక్షణాలు చూస్తే చాలు. ఇక్కడ కొన్ని ఉదాహారణలు తెలియజేస్తున్నాం. ఇలాంటి ప్రవర్తన కనబరిస్తే మీ రాముడు మంచి బాలుడు కాదు, కాబట్టి సరైన మార్గంలో పెట్టడం తల్లిదంద్రులుగా మీ బాధ్యత.

మిమ్మల్ని గౌరవించరు

పిల్లలు మీ మాట అస్సలు వినరు, మిమ్మల్ని ఏమాత్రం గౌరవించరు. మీరు చెప్పే చిన్న చిన్న పనులు చేయడానికి కూడా సాకులు చెబుతుంటే, జాగ్రత్తగా ఉండండి. ఇది మున్ముందు మరింత మొండి ప్రవర్తనకు దారితీయవచ్చు. వారు మీ మాట వినడం మిమ్మల్ని గౌరవించడం, పెద్దలను గౌరవించడం నేర్పించాలి.

వద్దు అనే మాటను వారు సహించలేరు

చెడిపోయిన పిల్లలు ఓపికను కలిగి ఉండరు. ఏదైనా సందర్భంలో, మీరు వద్దు అని చెబితే, వారు అస్సలు సహించలేరు. బిగ్గరగా అరవడం, అందినవి పగలగొట్టం, అందితే మిమ్మల్ని సైతం కొట్టడం మొదలైనవి చేస్తూ ప్రతీకారం తీర్చుకోవచ్చు. వారు తమ అవసరాలు తీర్చుకోవడానికి ఎంతదూరమైనా వెళ్తారు, తరచుగా మానిప్యులేటివ్ విధానాలను ఉపయోగిస్తారు.

ఎంత ఇచ్చినా సంతృప్తి చెందరు

మీరు వారికి తినడానికి ఇష్టమైన కుకీలు, లేదా చాక్లెట్‌లు లేదా బొమ్మలు ఏమి ఇచ్చినా తీసుకోరు, ఆనందపడరు. అంతకు మించి కావాలి అని కోరుతారు. మీ ప్రేమను ఒక ఆసరాగా వాడుకుంటారు.

సుపీరియారిటీ కాంప్లెక్స్

చెడిపోయిన పిల్లలు ఇతరులపై ఎల్లప్పుడూ ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తారు. తమ మాటే నెగ్గాలని ప్రవర్తిస్తారు. అందుకోసం సహచర పిల్లలపై కూడా దాడులకు దిగుతారు.

వారిలో క్రీడాస్ఫూర్తి లేదు

ఆటలు ఆడే సమయంలో మీ బిడ్డ ప్రవర్తించే తీరును బట్టి వారు ఎంతగా చెడిపోయారనేది గుర్తించవచ్చు. గేమ్‌లో ఓడిపోయినప్పుడు వారు ఏడవడం లేదా ప్రకోపించడం ప్రారంభించినట్లయితే, వారి ప్రవర్తన మార్చాలి.

చెడిపోయిన పిల్లల ప్రవర్తనను మెరుగుపరచడంలో మీకు సహాయపడే చిట్కాలు

- పిల్లలు ఏది చేసినా వారిని ప్రశంసించకండి. అది ప్రశంసించాల్సిన విషయం కానపుడు దానిని అంగీకరించవద్దు.

- బహుమతులు ఇవ్వండి, అయితే పిల్లలు ఏదైనా సాధించినపుడు మాత్రమే మరింత పెద్ద బహుమతిని ఆఫర్ చేయండి.

- పిల్లలకు గెలుపు, ఓటములు రెండూ అవసరమే.. ఆడటం ముఖ్యం అని తెలియజేయండి. వారి వైఫల్యాలను గుర్తించి, ప్రోత్సహించండి.

- మీరు అంగీకరించినా, అంగీకరించకపోయినా మీ బిడ్డ మీకు ఏది చెప్పాలనుకున్నా వినండి. ఇది వారికి విన్న అనుభూతిని కలిగిస్తుంది, ఇది వారి మనస్సును చల్లబరుస్తుంది.

చెడిపోయిన పిల్లలు వెంటనే ప్రతిదీ కోరుకుంటారు, వారికి ఓపిక పట్టడం నేర్పండి. కొన్నిసార్లు నిరాకరించండి, ఇది పిల్లల స్వీయ-క్రమశిక్షణను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్