Parenting Tips | 'యూజ్ లెస్ ఫెలో.. ఎందుకు పనికి రావు' అంటూ మీ పిల్లలపై అరవకండి!
Parenting Tips: యూజ్ లెస్ ఫెలో.. ఎందుకు పనికి రావు, భూమికి భారం నువ్వు, తిండి దండగ, పోయి చావుపో, ఇంట్లో నుంచి వెళ్లిపో.. ఇవన్నీ మన సమాజంలో చాలా మంది పేరేంట్స్ కామన్‌గా ఉపయోగించే డైలాగ్స్. మీరు మీ పిల్లల్ని ఇలాగే తిడతారా? అయితే ఈ స్టోరీ చదవండి.
Parenting Tips: పిల్లలను పెంచడం అంత తేలికైన పని కాదు. ఎప్పటికప్పుడు వారి అవసరాలను తీర్చడంతో పాటు, వారికి సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా పట్టించుకోవాలి, అప్పుడే పిల్లలు మంచి వ్యక్తులుగా ఎదగగలరు. చాలా సార్లు తల్లిదండ్రులు తమ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడంలో ఆందోళన చెందుతూ, అదే కోపాన్ని పిల్లలపై ప్రదర్శించే సందర్భాలు ఉంటాయి. పిల్లలు ఏ చిన్న తప్పు చేసినా వారిని కించపరుస్తూ వారిపై ఉపయోగించే పరుష పదజాలం భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. ఇది పిల్లల మనసుని ప్రభావితం చేస్తుంది. కాబట్టి తప్పుచేసినపుడు సరైన రీతిలో వారికి తెలియజేయాలి. మీ జీవిత అనుభవం వారికి ఉపయోగపడేలా ఉండాలి గానీ, ఒత్తిడికి గురిచేయకూడదు. ఇప్పుడు ఇష్టారీతిన వ్యవహరించడం వలన, అది వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయవచ్చు, అలాగే వారితో మీ సంబంధాలు భవిష్యత్తులో దెబ్బతీయవచ్చు. మీకు ఎంత కోపం వచ్చినా ఇలాంటి మాటలను మీ పిల్లలతో ఎప్పుడూ అనకండి.
బూతులు తిట్టవద్దు
కొంత మంది తల్లిదండ్రులు, ఏదో అందోళనలో ఉంటారు. అదే సమయంలో పిల్లలు విసుగు తెప్పించినపుడు కోపంతో తమ పిల్లలతో ఇష్టారీతిన దుర్భాషలాడతారు. ఇలా చేయడం పిల్లలపై చెడు ప్రభావం చూపుతుంది. వారు పెద్దయ్యాక అదే రీతిలో మీకు గౌరవం ఇస్తారు.
పనికిరాని వాడు అనవద్దు
పిల్లలు ఎదిగే క్రమంలో ఎన్నో తప్పులు చేయడం సహజం. వారికి ఏం కావాలో, వారి సత్తా ఏంటో వారికి తెలియదు. ఏదైనా నేర్చుకుంటేనే వస్తుంది. తల్లిదండ్రుల స్థానంలో ఉంటూ వారిని మీరే సరిగ్గా అంచనా వేయలేక, మీ అంచనాలకు తగినట్లుగా లేనపుడు. నీకు ఏదీ చాతకాదు, నువ్వొక యూజ్ లెస్ అంటూ వారిని అనొద్దు. నిజంగా తాము ఎందుకు పనికిరాము అనే భావనలో ఉంటారు.
మీకు భారం అనవద్దు
పిల్లల్ని కన్నది మీరు అయినపుడు వారు మీకు భారంగా భావించకూడదు. వారి కోసం మీరు కష్టపడేది నిజమే. కానీ ఆ కష్టాన్ని వారిపై రుద్దకూడదు. మీకు భారం కాకుండా ఏం చేయాలో అని వారు తీవ్ర ఆందోళనకు గురవుతారు. కానీ ఆ సమయంలో వారికి ఏం చేయాలో అనే పరిణితి ఉండదు.
వెళ్లి చావుపో.. అనకండి
ఇది కూడా చాలా మంది పేరెంట్స్ కామన్ డైలాగ్. ఇలాంటి మాటలు పిల్లల మైండ్ పై కూడా చాలా చెడు ప్రభావం చూపుతాయి. తల్లిదండ్రులు వారి పిల్లలతో ఇలా అనడం మానుకోవాలి. ఇలా దెప్పిపొడవడం వలన పిల్లలు అభద్రతా భావానికి లోనవుతారు.ఏదైనా తీవ్ర నిర్ణయం తీసుకుంటే అప్పుడు బాధ్యులు మీరే అవుతారు.
ఇంటి నుండి వెళ్లిపో
ఇలా తరచుగా మీరు మీ పిల్లల్ని అనే వారైతే, వెంటనే మీరు మీ అలవాటును మార్చుకోవాలి. ఎప్పుడూ ఇలా అనడం వలన మీకు వారిపై ప్రేమలేదని పిల్లలు భావిస్తారు. మీకు దూరం అయ్యే ప్రయత్నాలు చేసే ప్రమాదం ఉంది.
చివరగా చెప్పేదేమిటంటే.. చాలా మంది పేరేంట్స్ ఒక భావనలో ఉంటారు. పిల్లలను మేము ఎంతో కష్టపడి, పెంచి పెద్ద చేశాం. ఇప్పుడు రెక్కలు వచ్చాయి, ఎగిరిపోయారు. మమ్మల్ని పట్టించుకోవడం లేదని అంటారు. చిన్నప్పట్నించీ మీరు ఎలా అయితే పెంచారో, ఎంత ప్రేమగా చూసుకున్నారో అదే మీకు పిల్లలు తిరిగి ఇస్తారు. అదే క్రమంలో వారు ఉన్నత స్థానాలకు ఎదిగే అవకాశం వచ్చినపుడు ఆ దిశగా వెళ్లడానికి ప్రయత్నిస్తారు. కానీ మీరు పెంచి పోషించారు, వారు మీకు బానిస అని అనుకోవద్దు. వారు ఎదుగుదలను అడ్డుకుంటున్నపుడు మీ పెంపకానికి విలువ లేనట్లే. నేటి బాలలే, రేపటి పౌరులు అంటారు. కాబట్టి పిల్లల నుంచి ఏదీ ఆశించకుండా ప్రేమగా చూసుకోండి, మీకు జీవితంలో ఏమి ఉన్నా, లేకపోయినా సంతృప్తి అనేది కచ్చితంగా ఉంటుంది.
సంబంధిత కథనం