Helicopter Parenting | మీ పిల్లలను ఎదగనివ్వండి.. స్వేచ్ఛగా ఎగరనివ్వండి!-what is helicopter parenting know its pros and cons ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Helicopter Parenting | మీ పిల్లలను ఎదగనివ్వండి.. స్వేచ్ఛగా ఎగరనివ్వండి!

Helicopter Parenting | మీ పిల్లలను ఎదగనివ్వండి.. స్వేచ్ఛగా ఎగరనివ్వండి!

Manda Vikas HT Telugu
May 05, 2022 12:52 PM IST

మీరు ఎప్పుడైనా హెలికాప్టర్ పేరెంటింగ్ గురించి విన్నారా? అదేంటది.. మాకు హెలికాప్టర్ తెలుసు, ధోనీ కొట్టే హెలికాప్టర్ షాట్ తెలుసు కానీ హెలికాప్టర్ పేరెంటింగ్ ఏంటి కొత్తగా అంటారా? కానీ ఇది కొత్తదేం కాదు పాతదే, పిల్లల పెంపకంలో ఒక విధానం. దీని కథేంటో తెలుసుకోండి..

<p>Parenting Tips</p>
Parenting Tips (Unsplash)

పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల బాధ్యత ఎంతో కీలకమైనది. వారికి సరైన నడక, నడత నేర్పించినపుడే వారు రేపటి పౌరులుగా ఉన్నతంగా ఎదుగుతారు. చాలామంది పేరేంట్స్ తమ పిల్లలకు అడిగినవన్నీ కొనిస్తున్నాం, కావాల్సినవన్నీ సమకూరుస్తున్నాం, వారి చదువుల కోసం ఖర్చు చేస్తున్నాం అని గర్వంగా చెప్పుకుంటారు. కానీ అందులో గొప్పేమి లేదు. నిజానికి తల్లిదండ్రులుగా అది వారి ప్రాథమిక బాధ్యత.

మరి కొంత మంది పేరేంట్స్ అయితే పిల్లలకు తాము చేయాల్సింది చేస్తున్నాం, ఇక బాగుపడతారా లేదా అనేది మా చేతుల్లో లేదు అనేలా వ్యవహరిస్తారు. అలాంటి పేరెంట్స్ తమ పిల్లలపై ఏదో కన్నందుకు తప్పదన్నట్లుగా బాధ్యత చూపిస్తారు  తప్ప నిజానికి వారి పిల్లలపై ఎలాంటి ప్రేమ చూపించరు. ఆ పిల్లలు పెద్దగా అయ్యాక వారి తల్లిదండ్రులతో కూడా అలాగే ప్రవర్తిస్తారు. అప్పుడు బాధపడితే ఎలాంటి ప్రయోజనం ఉండదు.

పిల్లలు ఎదుగుతున్న క్రమంలో వారు ఎన్నో సంఘటనలు ఎదుర్కొంటారు. అవన్నీ వారికి జీవితంలో కొత్తగా ఉంటాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలో వారికి అనుభవం ఉండదు. కాబట్టి పేరేంట్స్ తమ అనుభవంతో ఏది మంచి, ఏది చెడు అనేది తెలియజెచెప్పాలి. వారి ఆలనాపాలనా చూసుకోవాలి. వారి కష్టసుఖాలను పంచుకోవాలి. వారిని మంచి మార్గంలో పయనించేలా చేయాలి. ఏదైనా జరిగితే మేమున్నాం అనే భరోసా కల్పించాలి. ముఖ్యంగా వారికి మీ నుంచి మంచి జ్ఞాపకాలు ఉండాలి. అది మంచి పేరెంటింగ్.

పిల్లల పెంపకం అత్యంత ముఖ్యమైన టాస్క్. మంచి పేరేంట్స్ అనిపించుకోవడానికి చాలా రకాలు ఉంటాయి. అందులో ఒకటి 'హెలికాప్టర్ పేరింటింగ్'.

హెలికాప్టర్ పేరింటింగ్ అంటే ఏమిటి?

ఇంతకీ ఈ హెలికాప్టర్ పేరెంటింగ్ అంటే అర్థం ఏంటి? ఎందుకు అలా పిలుస్తారు ఇక్కడ సింపుల్ గా వివరించాం. ఎవరైతే తల్లిదండ్రులు తమ పిల్లలపై ఎక్కువ శ్రద్ధ కనిపిస్తారో, వారి పిల్లలకు సంబంధించి ప్రతీ విషయంలో తల్లి, తండ్రి ఇద్దరూ బాధ్యతగా వ్యవహరిస్తారో, పిల్లలు తమకు కష్టం కలిగిందని చెబితే తల్లిదండ్రులు వెంటనే వారికోసం వాలిపోతారో దీనినే హెలికాప్టర్ పేరెంటింగ్ అంటారు.

హెలికాప్టర్ పేరెంట్ అనే పదం మొదటగా "బిట్వీన్ పేరెంట్ & టీనేజర్" అనే ఆంగ్ల పుస్తకంలో ఉపయోగించారు. అందులో టీనేజర్ తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్‌లో ఉండి చదువుకుంటాడు. చుట్టూ తనకు కావాల్సిన వారు ఎవరూ ఉండకపోవడంతో నిరాశగా ఉంటారు. దీంతో ఆ తల్లిదండ్రులు తమ బిడ్డ పరిస్థితిని అర్థం చేసుకొని వెంటనే హెలికాప్టర్ లాగా అతడి వద్ద వాలిపోయి అతడిలో నైరాశ్యాన్ని పోగొట్టడమే కాకుండా అతడు విజయం సాధించేలా స్ఫూర్తిని కలిగిస్తారు. అప్పట్నించీ చాలామంది కళాశాల నిర్వాహకులు కొంతమంది పేరేంట్స్ వ్యవహారశైలిని చూసి వారిని హెలికాప్టర్ పేరేంట్స్‌గా అభివర్ణించడం మొదలుపెట్టారు. అది అలా పాపులర్ అయింది.

హెలికాప్టర్ పేరెంటింగ్‌లో తమ పిల్లలపై పేరేంట్స్ ప్రమేయం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ తరహా పేరెంటింగ్ తో కొన్ని అవరోధాలు కూడా ఉన్నాయి. పిల్లలను అర్థం చేసుకొని మెలగడం మంచిదే కానీ ప్రతీ విషయంలో జోక్యం చేసుకుంటే ఆ పిల్లల్లో స్వయంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాలు తగ్గిపోతాయి. కాబట్టి హెలికాప్టర్ పేరెంటింగ్ ఉండాలి, కానీ అది శృతిమించకూడదు. అది పిల్లలను స్వయంగా ఎగిరేలా చేయాలి. అప్పుడే అది మంచి పేరెంటింగ్ శైలి అనిపించుకుంటుంది.

Whats_app_banner

సంబంధిత కథనం