ఫర్టిలిటీ సమస్యలా? ఈ 3 యోగాసనాలతో వాటికి చెక్ పెట్టండి
19 June 2023, 13:58 IST
International Yoga Day 2023: సంతానోత్పత్తి సమస్యలకు సీతాకొకచిలుక (బద్దకోణాసనం), పద్మాసనం, ఒంటె (ఉష్ట్రాసనం) ఆసనాల ద్వారా చెక్ పెట్టొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
International Yoga Day 2023: యోగాసనాలతో ఫర్టిలిటీ సమస్యలకు చెక్
సంతానోత్పత్తి కోసం ప్రయత్నిస్తున్నవారిలో ఫర్టిలిటీ సమస్యలు సవాలుగా నిలుస్తాయి. వైద్య చికిత్సతో పాటు యోగాసనాలు కూడా ఆచరించడం ద్వారా సమగ్రమైన విధానంలో ప్రయోజనం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. యోగా అనేది శారీరక భంగిమలు, శ్వాస వ్యాయామాలు, ధ్యానంతో కూడిన శాస్త్రీయ పద్ధతి. ఒత్తిడి తగ్గడం, రక్త ప్రసరణ పెరగడం సహా అనేక ప్రయోజనాలు ఫర్టిలిటీ సమస్యలకు పరిష్కరించడంలో ఉపయోగపడుతాయి.
అపోలో క్రెడిల్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ లో పని చేసే సర్టిఫైడ్ నియోనాటల్ థెరపిస్ట్ డాక్టర్ గీతికా సూద్ హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంబంధిత అంశాలను వివరించారు. ‘ఒత్తిడి వల్ల ఫర్టిలిటీలో సమస్యలు ఎదురవుతాయి. ఒవల్యూషన్, అండాల నాణ్యతపై కూడా ఒత్తిడి ప్రభావం చూపుతుంది. బాాలాసనం, విపరీత కరణి ఒత్తిడిని తగ్గిస్తాయి. రిలాక్సేషన్‌ను పెంచి మూడ్‌ను మెరుగుపరుస్తాయి. యోగా వల్ల కటి ప్రాంతంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. కటి ప్రాంతంలో కండరాలు ఫ్లెక్సిబుల్‌గా మారుతాయి. ఇందుకు ఉష్ట్రాసనం, పశ్చిమోత్తనాసనం, భద్రకోణాసనం, హస్త పాదాసనం ఉపయోగపడుతాయి. ఫర్టిలిటీ కోసం వాడే మందుల వల్ల ఎదురయ్యే సైడ్ ఎఫెక్ట్స్ కూడా యోగా వల్ల తగ్గిపోతాయి..’ అని వివరించారు.
థైరాయిడ్, పిట్యుటరీ గ్రంథుల పనితీరులో అసలమతుల్యతను యోగాసనాలు సరిచేస్తాయి. ఇవి సంతానోత్పత్తి సామర్థ్యం మెరుగపడడంలో తోడ్పడుతాయి. ‘క్రమం తప్పకుండా కపాలభాతి వంటి ప్రాణాయామం, నాడీ శోధన క్రియ వంటివి చేస్తే శరీరంలోని మలినాలన్నీ మాయం అవుతాయి. అలాగే స్ట్రెస్, యాంగ్జైటీ వంటివన్నీ దూరమవుతాయి. మెదడు, శరీరం చురుగ్గా పనిచేస్తాయి. ఇవన్నీ కూడా సంతానోత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరిచేవే. రోజూ 20 నిమిషాల పాటు ధ్యానం చేస్తే అపరిమితమైన ప్రయోజనాలు ఉంటాయి..’ డాక్టర్ గీతిక వివరించారు.
‘మీరు సంతాన సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టయితే మీరు తీసుకుంటున్న చికిత్సకు యోగా వల్ల మరింత ప్రయోజనం ఉంటుంది. అర్హులైన యోగా టీచర్ వద్ద అభ్యాసం చేయాలి. క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి..’ అని సూచించారు.
క్షేమవన చీఫ్ వెల్‌నెస్ ఆఫీసర్ డాక్టర్ నరేంద్ర శెట్టి ఇదే అంశాలపై వివరిస్తూ ‘మీ ఫర్టిలిటీ జర్నీలో నిర్ధిష్టమైన యోగాసనాలు ప్రాక్టీస్ చేస్తే సంతానోత్పత్తి సామర్థ్యం మెరుగుపడుతుంది. సీతాకోక చిలుక (బద్దకోణాసనం) భంగిమ, లోటస్ (పద్మాసనం) భంగిమ, ఒంటె (ఉష్ట్రాసనం) భంగిమలలో యోగాసనాలు చేసినప్పుడు సంతానోత్పత్తికి అవసరమైన హార్మోన్ల ఉత్పత్తి సమతులమవుతుంది. అయితే ఈ యోగాసనాలు వేసేముందు వైద్య నిపుణులను సంప్రదించాలి..’ అని సూచించారు. బటర్‌ఫ్లై భంగిమ, లోటస్ భంగిమ, ఒంటె భంగిమల ప్రయోజనాలను వివరించారు.
సీతాకోకచిలుక భంగిమ లేదా బద్ద కోణాసనం
సీతాకోకచిలుక భంగిమను బద్ద కోణాసన అని కూడా పిలుస్తారు. ఇది పునరుత్పత్తి అవయవాలను లక్ష్యంగా చేసుకుని కటి ప్రాంతంలో రక్త ప్రవాహాన్ని ప్రేరేపించే సున్నితమైన, ఇంకా శక్తివంతమైన భంగిమ.
ఈ ఆసనం వేయడానికి నేలపై కూర్చోండి, మీ మోకాళ్లను వంచి, మీ పాదాల అరికాళ్ళను ఒకదానితో ఒకటి టచ్ అయ్యేలా చేయండి. మీ మోకాలు బయటికి పడేలా చేయండి. మీ పాదాలను పట్టుకుని, మీ మోకాళ్లను సీతాకోకచిలుక రెక్కల వలె మెల్లగా తిప్పండి.
ఈ భంగిమ తుంటిని తెరవడానికి, లోపలి తొడలను విస్తరించడానికి, అండాశయాలు, ప్రోస్టేట్ గ్రంధిని ప్రేరేపించడానికి ఉపయోగపడుతుంది. రెగ్యులర్ ప్రాక్టీస్ వల్ల పెల్విక్ ప్రాంతంలో ప్రసరణను మెరుగుపరుస్తుంది. హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. సంతానోత్పత్తిని పెంచుతుంది.
లోటస్ భంగిమ లేదా పద్మాసనం
పద్మాసనం మనస్సు, శరీరానికి ప్రశాంతతను ఇస్తుంది. దీన్ని ప్రాక్టీస్ చేయడానికి నేలపై కూర్చుని, మీ కాళ్ళను చాపండి. ప్రతి పాదాన్ని దాని వ్యతిరేక కాలు తొడపై ఉంచండి. ఈ భంగిమ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఎండోక్రైన్ వ్యవస్థను సమతుల్యం చేస్తుంది. కటి ప్రాంతంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. శరీరం లోపల విశ్రాంతి లభించడం ద్వారా హార్మోన్ల అసమతుల్యత తగ్గుతుంది. పునరుత్పత్తి ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
ఒంటె భంగిమ లేదా ఉష్ట్రాసనం
ఒంటె భంగిమ లేదా ఉష్ట్రాసనం ఉదర ప్రాంతంతో సహా మొత్తం ముందు శరీరాన్ని విస్తరించే ఒక ఉత్తేజకరమైన భంగిమ. నేలపై మోకరిల్లి మద్దతు కోసం మీ చేతులను మీ దిగువ వీపుపై ఉంచండి. మీ తుంటిని ముందుకు నెట్టేటప్పుడు మీ వీపును సున్నితంగా వంచండి. మీ చేతులను కాళ్లపై ఉంచండి. ఈ భంగిమ పునరుత్పత్తి అవయవాలను ఉత్తేజపరిచేందుకు, పెల్విక్ ప్రాంతానికి రక్త ప్రవాహాన్ని పెంచడానికి, భుజాలలో ఒత్తిడిని విడుదల చేయడానికి సహాయపడుతుంది. ఒంటె భంగిమను క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తే ఒత్తిడి తగ్గుతుంది. హార్మోన్ల సమతుల్యత మెరుగుపడుతుంది. తద్వారా సంతానోత్పత్తి పెరుగుతుంది.