Sprouted ragi benefits: ఇలా మొలకెత్తిన రాగులను చేసుకుని తిన్నారంటే అధిక బరువు ఇట్టే తగ్గుతారు
29 May 2024, 7:00 IST
- Sprouted ragi benefits: అధిక బరువుతో పాటు డయాబెటిస్ వంటి ఎన్నో రోగాలతో ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. అలాంటి వారికి మొలకెత్తిన రాగులు ఎంతో మేలు చేస్తాయి.
మొలకెత్తిన రాగులు
Sprouted ragi benefits: మొలకెత్తిన గింజలు అనగానే అందరూ ఎక్కువగా పెసలు, సెనగలు వంటి వాటికే ప్రాధాన్యత ఇస్తారు. కానీ చిరుధాన్యాల్లో ఒకటైన రాగులును మొలకెత్తుకుని తినవచ్చు. ఇలా మొలకెత్తిన రాగులను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు అదుపులో ఉంటాయి. రాగులను ఫింగర్ మిల్లెట్స్ అని పిలుస్తారు. పోషకాహార నిపుణులు కచ్చితంగా రాగులను ఆహారంలో భాగం చేసుకోమని చెబుతారు. ఈ రాగుల్లో కార్బోహైడ్రేట్లు, క్యాల్షియం, ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెరను నియంత్రించేందుకు తోడ్పడతాయి. బరువును కూడా తగ్గిస్తాయి.
ప్రతిరోజూ ఒక కప్పు మొలకెత్తిన రాగులు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి చిట్కా. మొలకెత్తిన రాగుల్లో డైరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గించేందుకు చాలా సహాయపడుతుంది. అతిగా తినే అవకాశాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల మీరు తినే ఆహారం తగ్గుతుంది. క్యాలరీలు తగ్గడం వల్ల బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ ఒక కప్పు మొలకెత్తిన రాగులను తినేందుకు ప్రయత్నించండి.
డయాబెటిస్ రోగులకు
మొలకెత్తిన రాగులు మధుమేహ రోగులకు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి. ఈ రాగుల్లో డైటరీ ఫైబర్, పాలిఫెనాల్స్ ఉంటాయి. ఇవన్నీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. రాగుల్లో ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర శోషణను నెమ్మదించేలా చేస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలో అమాంతం పెరగవు. కాబట్టి మొలకెత్తిన రాగులు డయాబెటిస్‌ను నిర్వహించేందుకు ఉత్తమమైన ఆహారంగా చెప్పుకోవచ్చు.
రక్తహీనత తగ్గేందుకు
వేసవిలో మొలకెత్తిన రాగులను తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. దీనిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి రాగులు సహాయపడతాయి. మొలకెత్తిన రాగుల్లో ఐరన్ స్థాయిలు అధికంగా ఉంటాయి. కాబట్టి పిల్లలు, మహిళలు అధికంగా వీటిని తినడం చాలా అవసరం.
అధిక కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఇలా శరీరంలో అధిక కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా నియంత్రించడానికి మొలకెత్తిన రాగులు ఉత్తమ ఆహారమని చెప్పుకోవాలి. వీటిలో అమినో ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. మొలకెత్తిన రాగులను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల కాలేయంలోని కొవ్వు కరుగుతుంది. దీనివల్ల గుండె ఆరోగ్యము పెరుగుతుంది.
మొలకెత్తిన రాగులను అనేక రకాలుగా తినవచ్చు. మొలకెత్తిన రాగుల్లో కాస్త నీరు, పాలు వేసి ఉడికించి గంజిలా కాచుకొని తినవచ్చు. దీనిలో చిటికెడు ఉప్పు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. అలాగే స్మూతీల రూపంలో తినవచ్చు. ఈ మొలకెత్తిన రాగుల్లో పండ్లు, పెరుగు, కొంచెం తేనె వేసి కలుపుకుంటే స్మూతీగా మారిపోతుంది. రాగులను రుబ్బుకొని ఇడ్లీ, దోశ వంటివి చేసుకోవచ్చు.