Quit Smoking । ఈ సంకేతాలు గమనిస్తే.. వెంటనే స్మోకింగ్ మానేయండి!
08 January 2024, 20:15 IST
- Quit Smoking: ధూమపానం క్యాన్సర్ సహా అనేక అనారోగ్య పరిస్థితులకు కారణం. మీరు పొగత్రాగడం మానేయాలని చెప్పే ప్రమాద సంకేతాలు, ధూమపానం వదిలిస్తే కలిగే లాభాలు తెలుసుకోండి.
Quit Smoking
Quit Smoking: ధూమపానం, పొగాకు ఉత్పత్తుల వాడకం అనేది క్యాన్సర్, గుండె జబ్బులు, శ్వాసకోశ వ్యాధులు సహా అనేక రకాల అనారోగ్య పరిస్థితులను కారకమయ్యే ప్రమాదకరమైన అలవాటు. ఇది అందరికీ తెలిసిన విషయమే, అయినప్పటికీ ఒకసారి అలవాటుపడిన తర్వాత ధూమపానం మానేయడం కొందరికి కష్టంగా ఉంటుంది. కానీ, మీ ఆరోగ్యం, మీ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని మీరు తీసుకునే అత్యంత ముఖ్యమైన నిర్ణయాలలో ఇది ఒకటి.
పరిస్థితి తీవ్రంగా మారినపుడు మీ శరీరం కొన్ని హెచ్చరిక సంకేతాలను పంపుతుంది. ఆ సంకేతాలు మీరు గమనించినట్లయితే వెంటనే ధూమపానం, పొగాకు ఉత్పత్తుల వాడకం మానేయాలని అర్థం. ఆ సంకేతాలేమిటో ఇప్పుడు తెలుసుకోండి.
దీర్ఘకాలికమైన దగ్గు
ధూమపానం మానేయాలని చెప్పే అత్యంత సాధారణ హెచ్చరిక సంకేతాలలో దీర్ఘకాలిక దగ్గు ఒకటి. మీరు దీర్ఘకాలికంగా దగ్గుతో ఉంటే, అది ధూమపానం చెడు ప్రభావమే. ముఖ్యంగా ఉదయం పూట, సిగరెట్ పొగ నుండి విషాన్ని తొలగించడానికి మీ ఊపిరితిత్తులు కష్టపడుతున్నాయని దాని అర్థం కావచ్చు. కాలక్రమేణా, ఇది దీర్ఘకాలిక బ్రోన్కైటిస్, ఇతర శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది.
ఊపిరి ఆడకపోవడం
ఏదైనా చిన్నపాటి శారీరక శ్రమ చేసినపుడు కూడా మీరు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇది మీకు ఊపిరి ఆడకపోవడానికి దారితీస్తుంది. ఎందుకంటే సిగరెట్ పొగ ఊపిరితిత్తులు ఆక్సిజన్ తీసుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. మీరు ఒక చిన్న నడక తర్వాత లేదా కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత మీ ఊపిరి పీల్చుకోవడానికి కష్టపడుతున్నట్లు అనిపిస్తే, అది ధూమపానం మానేయడానికి సమయం కావచ్చు.
రుచి, వాసన లేకపోవడం
పొగత్రాగడం వలన కూడా మీరు వాసన, రుచిని కోల్పోతారు . మీకు ఇష్టమైన ఆహారపదార్థాలు తిన్నప్పటికీ కూడా మునుపటిలా వాటి రుచిని మీరు ఆస్వాదించలేరు. వాసన సరిగ్గా రావడం లేదని మీరు గ్రహించినట్లయితే, అది ధూమపానం వలన ఏర్పడిన దుష్ప్రభావమే. కాబట్టి వెంటనే సిగరెట్ మానేయాలి.
నోటి ఆరోగ్యం చెడిపోవడం
సిగరెట్ పొగలో అనేక రసాయనాలు ఉంటాయి, ఇవి కాలక్రమేణా మీ దంతాల సహజ రంగును మారుస్తాయి. మీ నోటి ఆరోగ్యం దెబ్బతింటుంది, చిగుళ్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అంతేకాదు మీ చేతులు కూడా సహజత్వాన్ని కోల్పోతాయి. మీరు మీ దంతాలు పసుపు రంగులోకి మారుతున్నాయని గమనిస్తే, ధూమపానం మానేయడానికి ఇది సమయం కావచ్చు.
దీర్ఘకాలిక అనారోగ్యాలు
ధూమపానం ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె జబ్బులు, స్ట్రోక్‌తో సహా అనేక తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ముడిపడి ఉంది. మీరు ఇలాంటి వ్యాధుల చరిత్రను కలిగి ఉంటే లేదా మీ కుటుంబంలో ఇదివరకే ఇలాంటి సమస్యలు ఉంటే , అది ఇంకా మీ ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. ఈ ప్రమాదాన్ని తగ్గించడానికి వీలైనంత త్వరగా ధూమపానం మానేయడం చాలా ముఖ్యం.
ఊపిరితిత్తులు స్వీయ-శుభ్రత కలిగిన అవయవాలు. మీరు కాలుష్య కారకాలకు గురికానప్పుడు అవి తమను తాము శుభ్రం చేసుకోవడం, నయం చేసుకోవడం ప్రారంభిస్తాయి. కాబట్టి మీరు పొగత్రాగటం, వాయుకాలుష్యం, ఇతర హానికరమైన టాక్సిన్‌లకు దూరంగా ఉండటం వలన మళ్లీ ఊపిరితిత్తులు శుభ్రపడతాయి. మీ ఆరోగ్యం గొప్పగా మెరుగుపడుతుంది. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సరైన ఆహారం తినడం ద్వారా మీ శ్రేయస్సును పెంచుకోవచ్చు. శ్వాస వ్యాయామాలు మీ శ్వాసక్రియను, మీరు ఆక్సిజన్ తీసుకునే సామర్థ్యాన్ని మెరుగుపరచగలవు.