World Lung Cancer Day 2022 । సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ కూడా ప్రాణాంతకమే!
World Lung Cancer Day 2022 | రొమ్ము క్యాన్సర్ తర్వాత ఎక్కువ మంది చనిపోయేది ఊపిరితిత్తుల క్యాన్సర్ తోనే. ఈ క్యాన్సర్ రావటానికి గల ప్రధాన కారణాలు, చికిత్స, నివారణ మార్గాలు ఇక్కడ తెలుసుకోండి.
ఊపిరితిత్తుల క్యాన్సర్ మన దేశంలో నాల్గవ అత్యంత సాధారణ క్యాన్సర్. ఈ రకమైన క్యాన్సర్ నుంచి తప్పించుకోవడానికి ఎటువంటి కచ్చితమైన మార్గం లేనప్పటికీ, జీవనశైలిలో కొన్ని మార్పులు చేయడం ద్వారా నివారించవచ్చు. ఇందులో భాగంగా వెంటనే ధూమపానం మానేయడం ఈ ప్రాణాంతక వ్యాధిని నివారించే మొదటి అడుగు. ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రారంభ దశలో ఉన్నపుడు లక్షణాలు అరుదుగా కనిపిస్తాయి. వ్యాధి ముదిరేకొద్దీ కొన్ని సంకేతాలు కనిపించడం ప్రారంభమవుతాయి. అందుకే దీనిని సైలెంట్ కిల్లర్ అంటారు.
ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలు ఇలా ఉంటాయి. దగ్గుతున్నప్పుడు రక్తం రావడం, ఊపిరి ఆడకపోవడం, ఛాతీ నొప్పి, ఊహించని విధంగా బరువు తగ్గడం, ఎముకల నొప్పి ఉండటం వంటివి ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు సంబంధించిన కొన్ని సంకేతాలు.
ధూమపానం చేయడం, ఆస్బెస్టాస్, యురేనియం, ఆర్సెనిక్ మొదలైన కాలుష్య కారకాలకు ఊపిరితిత్తులు గురికావడం వలన ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్ సంభవిస్తుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కారణమయ్యే అలవాట్లు, కారకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ప్రతి ఏడాది ఆగష్టు 1న, ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ అవగాహన దినోత్సవం (World Lung Cancer Day)ను నిర్వహిస్తున్నారు.
చరిత్ర, ముఖ్య ఉద్దేశ్యం
ఊపిరితిత్తుల్లోని కణాలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల వచ్చే క్యాన్సర్. ఇది ఊపిరితిత్తులతోనే ఆగిపోకుండా చుట్టూ ఉన్న అవయవాలకు కూడా వ్యాపించే అవకాశం ఉంది. దాదాపు 85 శాతం దీర్ఘకాలం పాటు పొగాకు సేవించే వారిలో ఈ క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తాయి. మిగతా 10–15% కేసుల్లో ధూమపానం చేయని వారు ఉన్నారు. 2012 గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 18 లక్షల మంది ఈ ఊపిరితిత్తుల బారిన పడగా అందులో సుమారు 16 లక్షలమంది మరణించారు. ఆడవారిలో రొమ్ము కాన్సర్ తర్వాత ఎక్కువ మంది ఈ వ్యాధి వలనే మరణిస్తున్నారు. అందుకే ఈ వ్యాధి గురించి, కలుగజేసే కారకాల గురించి, చికిత్స, నివారణల గురించి ప్రజలకు తెలియాలని ప్రపంచ వ్యాప్తంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ అవగాహన దినోత్సవం నిర్వహించటం ప్రారంభమైంది.
ప్రమాద కారకాలు, నివారణ మార్గాలు
ధూమపానం- మీరు ప్రతిరోజూ తాగే సిగరెట్‌ల సంఖ్యతో ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. అదే సమయంలో పొగత్రాగటం మానేస్తే అది ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.
సెకండ్ హ్యాండ్ స్మోకింగ్- ధూమపానం నేరుగా చేయకపోయినా మరొక మార్గంలో పొగ పీల్చినా అది కూడా లంగ్ క్యాన్సర్‌కు దారితీస్తుంది. అందువల్ల పొగాకు చేసే వారికి, ఇతర వాయువులు పీల్చటం నుంచి దూరంగా ఉండాలి.
క్యాన్సర్ కుటుంబ చరిత్ర- కుటుంబంలో ఎవరికైనా ఊపిరితిత్తుల క్యాన్సర్ బారినపడిన చరిత్ర ఉంటే, కుటుంబంలోని మిగతా వ్యక్తులు ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
కాలుష్య కారకాలు- వాయుకాలుష్యం, రేడియేషన్ థెరపీ, రేడాన్ వాయువు పీల్చటం మొదలైన కాలుష్య కారకాలు ఊపిరితిత్తుల క్యాన్సర్ కు కారణమవుతాయి.
మంచి పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవడం, వారంలో ఎక్కువ రోజులు వ్యాయామం చేయడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వలన ఈ వ్యాధి ప్రమాదాన్ని నివారించవచ్చు.
సంబంధిత కథనం
టాపిక్