Jowar Dosa Recipe : జొన్నపిండితో దోసెలు.. తయారీ విధానం ఇదే
14 February 2023, 6:25 IST
- Breakfast Recipe : జొన్నరొట్టె ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా మంది తమ డైట్ లో ఇది భాగంగా ఉంటుంది. అయితే ఉదయం పూట.. జొన్నపిండితో చేసిన దోసెలను తిన్నా హెల్తీగా ఉండొచ్చు.
జొన్న దోసెల తయారీ
బ్రేక్‌ఫాస్ట్ హెల్తీగా ఉండాలి. ఆరోగ్యకరమైన అల్పాహారం(Breakfast) చేయాలంటే.. జొన్న దోసె(Jowar Dosa)ను ట్రై చేయండి. రుచితోపాటుగా ఆరోగ్యం కూడా బాగుంటుంది. దీనికోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. త్వరగానే చేసేయోచ్చు. జొన్నలో ప్రోటీన్లు, ఫైబర్ అధిక మెుత్తంలో ఉంటాయి. అధిక బరువుతో బాధపడేవారు.. ఈ జొన్నలను అల్పాహారంలో తీసుకుంటే ఫలితం ఉంటుంది. జొన్నలు త్వరగా ఆకలి కాకుండా కూడా చేస్తాయి.
ఇప్పుడు సరైన పోషకాలు లేని ఆహారంతో లేనిపోని సమస్యలు వస్తున్నాయి. అనేక రకమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. జొన్నల్ని ఆహారంలో చేర్చుకుంటే.. శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.
కావాల్సిన పదార్థాలు..
జొన్నపిండి-రెండు కప్పులు, మినపపప్పు-వంద గ్రాములు, ఉప్పు-తగినంత, నూనె-సరిపోయేంత, నీరు, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర, మిరియాల పొడి(తగినంతగా తీసుకోవాలి).
ముందుగా ఒక పెద్ద గిన్నెలో జొన్న పిండిని తీసుకోండి. దానిలో ఉప్పు, గ్రైండ్ చేసిన మినపపిండి, నీళ్లు వేసి బాగా కలపండి. ఉండలు లేకుండా చూసుకుంటూ బాగా కలపండి. ఈ మిశ్రమంలో ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, పశ్చిమిర్చి(Mirchi), జీలకర్ర, పెప్పర్ పొడి వేసి బాగా కలపాలి.
ఈ పిండి కాసేపు పక్కన పెట్టండి. తరువాత పిండి నీళ్లుగా.. దోసె పిండి మాదిరిగా కనిపిస్తుంది. కాస్త చిక్కగా ఉంది అనిపిస్తే మరికొన్ని నీళ్లు పోయోచ్చు. స్టౌవ్ వెలిగించి దానిపై దోస పాన్ ఉంచండి. అది బాగా వేడిగా ఉన్నప్పుడు.. పాన్ మీద పిండి పోయాలి. చుట్టు పక్కలా కాస్త నూనె వేయాలి. దోస మంచిగా మారే వరకు కాల్చండి. ఆ తర్వాత వేడివేడి జొన్న దోసెను టమోట చట్నీ లేదా కొబ్బరి చట్నీతో తింటూ ఎంజాయ్ చేయండి.