Weight Loss Spices : బెల్లీ ఫ్యాట్ తగ్గించేందుకు వంట గదిలోని ఈ మసాలాలను ఉపయోగిస్తే చాలు
04 January 2024, 9:00 IST
- Weight Loss Journey : బరువు తగ్గించుకునేందుకు ఇంట్లో ఉన్న మసాలా దినుసులను ఉపయోగిస్తే చాలు. ఈజీగా తగ్గించుకోవచ్చు. చాలా సింపుల్.
బరువు తగ్గించేందుకు చిట్కాలు
బరువు తగ్గడం అనేది చాలా మంది ఎదుర్కొనే సమస్య. ఎన్ని వర్కౌట్లు చేసినా.., ఎంత డైట్ ఫాలో అయిన తగ్గడం లేదని బాధపడిపోతూ ఉంటారు. బరువు ఎక్కువైతే అనేక ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని వెంటాడుతాయి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. సహజంగా ఇంట్లోనే బరువు తగ్గేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా వంట గదిలోకి వెళ్లడం మాత్రమే.
భారతీయ మసాలా దినుసులను మీ ఫుడ్‌లో చేర్చుకుంటే.. మీ ఆహారం రుచి మాత్రమే మెరుగుపడదు. దీంతోపాటుగా బరువు తగ్గడంలో కూడా మీకు సాయపడుతుంది. వీటితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బొడ్డు కొవ్వును తగ్గించేందుకు భారతీయ మసాలా దినుసులు చక్కగా ఉపయోగపడతాయి. వాటితో మీ శరీరానికి ఎన్నో ప్రయోజనాలు వస్తాయి. మీరు బరువు తగ్గేందుకు తీసుకోవాల్సిన మసాలాలను చూద్దాం..
అధిక యాంటీఆక్సిడెంట్ కంటెంట్ కారణంగా జీలకర్ర గింజలు మెరుగైన జీవక్రియ, జీర్ణక్రియతో సంబంధం కలిగి ఉంటాయి. సాధారణంగా జీలకర్ర వాడకం క్యాలరీ బర్నింగ్‌ను పెంచుతుంది. బొడ్డు కొవ్వును తగ్గిస్తుంది. అందుకే పెద్దలు కూడా కొన్ని సందర్భాల్లో జీలకర్ర నమలమని చెబుతారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు జీలకర్ర పవర్ ఫుల్ ఇంటి నివారణ.
భారతీయ వంటకాల్లో పసుపుది ప్రత్యేకమైన స్థానం. ప్రతీ కూరలో దీనిని వాడుతారు. పసుపు ఎన్నో మంచి గుణాలను కలిగి ఉంది. ఇందులోని కర్కుమిన్ ఆరోగ్యానికి మంచిది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. కర్కుమిన్ వాపును తగ్గించడంలో, రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సాయపడుతుంది. అంతేకాదు.. కొవ్వు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా పొట్ట ప్రాంతంలోని కొవ్వును తగ్గించేందుకు పసుపును వాడాలి.
నల్ల మిరియాలు కూడా శరీరానికి గొప్ప ప్రయోజనాలను అందిస్తాయి. కొత్త కొవ్వు కణాల పెరుగుదలను నిరోధించడంలో దీని ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. నల్ల మిరియాలు మీ ఆహారాన్ని జీర్ణం చేసేందుకు ఉపయోగపడటమే కాకుండా, కొవ్వు పేరుకుపోకుండా నిరోధించడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మిరియాలతో కాషాటం చేసుకుని తాగితే మంచి ప్రయోజనాలు పొందుతారు.
రక్తంలో చక్కెరను సమతుల్యం చేయడానికి అత్యంత శక్తివంతమైన సుగంధ ద్రవ్యాలలో దాల్చిన చెక్క ఒకటి. దాల్చినచెక్క ఇన్సులిన్ పెరుగుదలను నిరోధిస్తుంది. అదనపు కొవ్వు నిల్వను తగ్గిస్తుంది. ముఖ్యంగా పొట్ట ప్రాంతంలో ఇది బాగా పనిచేస్తుంది. దీని తీపి రుచి కూడా చక్కెర కోరికలను అణచివేస్తుంది. మొత్తం బరువు నియంత్రణలో దాల్చిన చెక్క ఎంతగానో సాయపడుతుంది.
అల్లం థర్మోజెనిక్ చర్య శరీర ఉష్ణోగ్రతను పెంచడానికి, జీవక్రియను వేగవంతం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది కొవ్వును తగ్గించడంలో, కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. అల్లం జీర్ణక్రియను కూడా సులభతరం చేస్తుంది. ఉబ్బరం తగ్గిస్తుంది, కడుపు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఆయుర్వేదంలోనూ అల్లానికి ప్రత్యేకమైన స్థానం ఉంది.
పైన చెప్పిన మసాలా దినుసులను వంటలో ఉపయోగించాలి. సూప్‌లు, సలాడ్‌లలో నల్ల మిరియాలు, కూరలలో పసుపు, ఉదయం ఓట్‌మీల్‌లో దాల్చిన చెక్క, మసాలా మిశ్రమాలలో జీలకర్ర, టీలో అల్లం వాడుకోండి. ఈ మసాలా దినుసులను సమతుల్య ఆహారంలో చేర్చడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వలన మీరు మరింత ఆరోగ్యంగా ఉంటారు. ఇవి చేస్తే బరువు కోల్పోవడం ఈజీ అవుతుంది. కేవలం మసాలా దినుసులు తీసుకోవడమే కాదు.. శారీరక వ్యాయామం కూడా బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుంది.