Tomato Oats: బరువును అదుపులో ఉంచే టమోటో ఓట్స్, బ్రేక్ ఫాస్ట్‌కు బెస్ట్ రెసిపీ
Tomato Oats: బరువు తగ్గాలనుకునేవారు ఓట్స్ తో చేసిన వంటకాలు తినేందుకు ఇష్టపడతారు.
Tomato Oats: బరువు తగ్గాలనుకునేవారు బ్రేక్ ఫాస్ట్‌లో ఓట్స్ తో చేసిన ఆహారాలు తినేందుకు ఇష్టపడతారు. అయితే ఓట్స్ ను పాలతో, లేదా పెరుగుతో తింటే అంత టేస్టీగా ఉండవు. దీంతో టమోటోలు, మసాలా దినుసులు కలుపుకొని టమాటో ఓట్స్ రెసిపీని చేసుకుంటే టేస్టీగా ఉంటాయి. పాల రెసిపీతో పోలిస్తే ఈ టమాటో ఓట్స్ తినేందుకు రుచికరంగా అనిపిస్తాయి. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ మీరే చేసుకొని తింటారు. పిల్లలకు కూడా దీన్ని తినిపించవచ్చు. పావుగంటలోనే ఇది రెడీ అయిపోతుంది, కాబట్టి అప్పటికప్పుడు చేసుకుని తినవచ్చు కూడా. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
టమాటో ఓట్స్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
ఓట్స్ - ఒకటిన్నర కప్పు
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
గ్రీన్ పీస్ - రెండు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
టమోటాలు - రెండు
గరం మసాలా - అర స్పూను
ధనియాల పొడి - అర స్పూను
కారం - అర స్పూను
పసుపు - పావు స్పూను
బిర్యానీ ఆకు - ఒకటి
ఉల్లిపాయ - ఒకటి
పచ్చిమిర్చి - రెండు
అల్లం - చిన్న ముక్క
జీలకర్ర - ఒక స్పూను
నెయ్యి - రెండు స్పూన్లు
టమాటో ఓట్స్ రెసిపీ
1. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి రెండు స్పూన్ల నెయ్యిని వేయాలి.
2. అందులో జీలకర్ర, అల్లం తరుగు, నిలువుగా తరిగిన పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి.
3. ఆ తరువాత ఉల్లిపాయ తరుగును వేసి వేయించాలి.
4. అందులోనే బిర్యానీ ఆకులు వేసుకోవాలి.
5. దీన్ని చిన్న మంట మీద పెట్టి పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి వేయించుకోవాలి.
6. ఆ తర్వాత సన్నగా తరిగిన టమోటో ముక్కలను వేసి ఉప్పు కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి.
7. ఆ తర్వాత రెండు స్పూన్ల గ్రీన్ పీస్ వేసి కలపాలి.
8. అందులోనే నాలుగు కప్పుల నీళ్లను కూడా వేసుకోవాలి.
9. మూత పెట్టి పది నిమిషాలు ఉడకనివ్వాలి.
10. ఆ తరువాత ఓట్స్ అందులో వేసి బాగా కలపాలి.
11. ఐదు నిమిషాలు దాన్ని ఉడికించాక పైన కొత్తిమీరను చల్లుకోవాలి. అంతే టమాటా ఓట్స్ రెసిపీ రెడీ అయినట్టే.
దీన్ని తింటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇది బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. డైట్ లో ఉన్నవారు ఈ టమాటా ఓట్స్ తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉండదు. టమోటోలు, నెయ్యి, ఓట్స్... ఇవన్నీ కూడా మన శరీరానికి మేలు చేసేవే. కాబట్టి ఇవి దీన్ని అందరూ చేసుకోవచ్చు. రుచిలో కూడా ఇది దేనికీ తీసిపోదు. స్పైసీగా కావాలనుకునేవారు పచ్చిమిర్చి లేదా కారాన్ని ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది.
టాపిక్