Weekend Workout Ideas । రోజూ వ్యాయామం అవసరం లేదు, వారాంతంలో ఒకసారి చేస్తే చాలు!
25 September 2022, 7:43 IST
- Weekend Workout Ideas: ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం అందరికీ సాధ్యం కాదు. అలాంటపుడు వారాంతంలో అయినా వ్యాయామం చేయాలి. వీకెండ్ వ్యాయామాలు సరదాగా ఉంటాయి, ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి.
Weekend Workout Ideas
ప్రతిరోజూ వ్యాయామం చేయటం, ఫిట్‌నెస్ కాపాడుకోవటం అంటే కొంతమందికి చాలా ఇష్టం. మరికొంత మందికి మాత్రం రోజూ వేకువజామున నిద్ర లేవమంటేనే బద్ధకం, ఆపై వ్యాయామం చేయటం అంటే అస్సలు కుదరని పని. ఆలస్యంగా నిద్రలేస్తే బ్రేక్‌ఫాస్ట్ చేయటానికే సరిగ్గా సమయం ఉండదు, ఇక వ్యాయామం చేసేది ఎప్పుడు? ఫిట్‌నెస్ కాపాడుకునే అవకాశం ఎక్కడ? ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతాయి. కానీ ఇందుకు కూడా ఒక పరిష్కారం ఉంది. వారం మొత్తం రోజంతా పనిచేసి ఎప్పుడో రాత్రికి నిద్రపోయి ఉదయం లేవాలంటే వీలుకాదు, ముందుగా నిద్ర అనేది ముఖ్యం. అయితే ఫిట్‌నెస్ సాధించటానికి ప్రతిరోజూ వ్యాయామం చేయాల్సిన పనిలేదు, వారంలో ఒకటి, రెండు సార్లు చేసిన సరిపోతుందని నిపుణులు అంటున్నారు.ఇలా చేసినా కూడా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చునని చెబుతున్నారు.
వారాంతపు వ్యాయామం ఆరోగ్య ప్రయోజనాలు
- ప్రతి వారం ఒకటి లేదా రెండు రోజులలో కనీసం 75 నిమిషాల తీవ్రమైన ఫిజికల్ యాక్టివిటీ లేదా 150 నిమిషాల మితమైన వ్యాయామం చేసే వారి ఆయుర్దాయం పెరుగుతుందని వివిధ అధ్యయనాలు వృద్ధి చేశాయి. 10 ఏళ్ల వ్యవధిలో వీకెండ్ వ్యాయామాలు చేసే వారి డేటాను పరిశీలించగా వారు కూడా క్రమం తప్పకుండా చేసే వారితో దాదాపు సమాన ఆరోగ్య ప్రయోజనాలను పొందుతున్నారని అధ్యయనాలు తెలిపాయి.
- శారీరకంగా క్రియారహితంగా పాల్గొనేవారి కంటే మరణానికి సంబంధించిన అన్ని కారణాలలో 8% తక్కువ ప్రమాదం.
- కనీసం వారంలో 3 రోజులైనా మితమైన వ్యాయామం చేసే వారికి గుండె జబ్బులు, క్యాన్సర్‌ల ద్వారా కలిగే మరణాల ముప్పు తక్కువగా ఉంటుంది.
- అలాగే ఉబకాయం, డయాబిటీస్ వచ్చే ముప్పు తక్కువగా ఉంటుంది. జీర్ణ సమస్యలు తగ్గుముఖం పడతాయి. మానసిక ఆరోగ్యమూ మెరుగుపడుతుంది. మొత్తంగా చెప్పాలంటే ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే కలిగే ప్రయోజనాలు దాదాపు కలుగుతాయి.
అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే.. వారాంతంలో వ్యాయామం చేయటాన్ని ఎంచుకునేవారు నేరుగా సిఫార్సు చేసిన 150 నిమిషాల వ్యాయామం చేసేందుకు ప్రయత్నించవద్దు. ముందుగా ఒక 20 నిమిషాలతో ప్రారంభించాలి. ఆ తర్వాత ఒక్కో వారం డోస్ పెంచుతూ వెళ్లాలని సూచిస్తున్నారు.
Weekend Workout Ideas - వారాంతంలో ఎలాంటి వ్యాయామాలు చేయవచ్చు?
అలాగే వారాంతంలో ఎలాంటి వ్యాయామాలు చేయగలమో నిపుణుల సలహా తీసుకోండి. కొన్ని సరళమైన వ్యాయామాలు కూడా చేయవచ్చు. అవేంటో ఓ 4 ఇక్కడ చూద్దాం.
పవర్ వాక్
పచ్చని వాతావరణం స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తూ నడకకు వెళ్లడం కూడా వ్యాయామంగా గొప్ప అనుభూతిని అందిస్తుంది. మీ హృదయ స్పందన రేటును పెంచడానికి, మీ వ్యాయామ తీవ్రతను పెంచడానికి వేగంతో నడవడానికి ప్రయత్నించండి. మీ స్నేహితులను కూడా ఆహ్వానించి పవర్ వాకింగ్ సెషన్ కోసం కలిసి నడవండి, పోటీపడుతూ నడవండి.
రన్ రాజా రన్
మీకు పరుగెత్తడం ఇష్టమైతే, పరుగుతీయండి. వారాంతంలో వీకెండ్ మారథాన్ అంటూ చాలా స్వచ్ఛంద సంస్థలు పరుగు పందాలు నిర్వహిస్తాయి. వాటి గురించి తెలుసుకొని ఆ మారథాన్ లో పాల్గొనండి. మీకు ఈ పరుగు ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇవ్వడమే కాకుండా మీ మూడ్ మెరుపరుస్తుంది. మీ నెట్వర్క్ కూడా పెరుగుతుంది.
మ్యూజిక్ యోగా
మీకు ఉరుకులు పరుగులు ఇష్టం లేకపోతే యోగాసనాలు వేయండి. మనసును శాంతపరిచే తేలికన సంగీతం వింటూ సంగీత యోగాను ఆచరించండి. ఇలా కూడా మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.
క్రీడలు ఆడండి
వారాంతంలో క్రీడలు ఆడటం ప్రాక్టీస్ చేయండి. క్రికెట్, ఫుడ్ బాల్, వాలీబాల్, షటిల్ ఏదైనా సరే ఆడవచ్చు. వారాంతం వర్కవుట్లలో మీరేమి ఒంటరి కాదు. మీరు ఏదైనా మైదానానికి వెళ్లిపోతే అక్కడ మీలాంటి వారు చాలా మందే ఉంటారు. మిమ్మల్ని తమ జట్టులో చేర్చుకునే వారూ లేకపోలేదు.
ఇక, సందేహించకుండా వారాంతంలో వ్యాయామం చేయండి. వీకెండ్ వీరుడు అనిపించుకోండి!