Couple Workout Ideas | కలిసి వ్యాయామాలు చేస్తే కలదు ఆరోగ్యం, పెరుగును అనుబంధం!
26 June 2022, 9:07 IST
- మీ రోజూవారీ వ్యాయామాలను మీ జీవిత భాగస్వామితో కలిసి చేస్తే ఇద్దరికీ ఆరోగ్యం లభిస్తుంది. రోజూ వ్యాయామం చేయాలనే ఉత్సాహం, ప్రేరణ లభిస్తాయి. మీ మధ్య అనుబంధం కూడా పెరుగుతుంది. ఎలాంటి వ్యాయామాలు చేయవచ్చో ఇక్కడ చూడండి.
Couple Workouts
ఈరోజుల్లో ఆరోగ్యం ఉన్నవారే ఐశ్వర్యవంతులు. మరి ఆరోగ్యం కావాలంటే ఊరకనే రాదు. సంపాదించుకోవాలి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలి. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలి. అయితే ఉదయాన్నే లేచి వర్కవుట్స్ చేయడానికి ఆసక్తి రాకపోతే మీ జీవిత భాగస్వామిని మీ వర్కౌట్లలో భాగస్వామ్యం చేయండి. ఇద్దరూ కలిసి జంటగా వ్యాయామాలు చేస్తుంటే రోజూ చేయాలనే ఆసక్తి, ప్రేరణ కలుగుతుంది. ఇలా మీకు వ్యాయామంలో ఒకరు తోడున్నట్లు ఉంటుంది. మీరు వ్యాయామాన్ని కష్టంగా కాకుండా ఇష్టంగా చేయవచ్చు. మీ మధ్య అనుబంధం పెరుగుతుంది. ఇద్దరికీ ఆరోగ్యంగా, చురుకుగా ఉంటారు.
మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పుడు కలిసి ఎందుకు వ్యాయామాలు చేయకూడదు? అయితే ఆడవారికి, మగవారికి వేరేగా ఉండవచ్చు, అయినప్పటికీ ఇద్దరూ కలిసి చేసుకునే ఎక్సర్‌సైజులు ఏం ఉంటాయో ఇక్కడ కొన్ని ఐడియాలు ఇచ్చాం, వీటిలో మీకు నచ్చినవి ఎంచుకొని మీ అభ్యాసాలు మొదలు పెట్టవచ్చు.
కలిసి బరువులు ఎత్తడం
శరీర కొవ్వును కరిగించటానికి, కండరాల్లో బలాన్ని పెంచటానికి వెయిట్ లిఫ్టింగ్ ఉత్తమ మార్గం. ఇది మహిళలకు కూడా ఎంతో ప్రయోజనకరం. కాబట్టి జంటలు వెయిట్-లిఫ్టింగ్ చేయడం ప్రారంభిచాలి. డంబెల్స్, కెటిల్‌బెల్స్, వెయిటెడ్ బాల్ ఏవైనా సరే బరువులు ఒక క్రమబద్దతి ప్రకారం ఎత్తాలి. రెండు చేతులకు సమానం వ్యాయామం లభించేలా సెట్ల వారీగా బరువులు ఎత్తాలి.
కలిసి హైకింగ్ చేయండి
హైకింగ్ ఫిట్‌నెస్‌ను పెంచడమే కాకుండా మనస్సును ప్రశాంతంగా ఉంచే ఒక గొప్ప యాక్టివిటీ. ఉదయాన్నే లేదా సాయంత్రం పూట బయట ఆహ్లాదకరమైన వాతావరణంలో కలిసి వాకింగ్ చేయడం, జాగింగ్ చేయడం చేయాలి. ప్రకృతితో కనెక్ట్ అయినట్లు ఉంటుంది, స్వచ్ఛమైన గాలి పీల్చుకోవచ్చు. వ్యాయామం అవుతుంది. రాత్రికి మంచి నిద్రపడుతుంది.
యోగాసనాలు ప్రయత్నించండి
యోగా అయితే ఇంటి నుంచే సౌకర్యంగా చేసుకొని గొప్ప వ్యాయామం. యోగాతో శరీరం, మనసు రెండూ ఫిట్‌గా మారతాయి. జంటలు కలిసి చేసుకోవడానికి ఎన్నో రకాల యోగాసనాలు ఉన్నాయి. యోగాభ్యాసం చేయడం ద్వారా ఫలితాలను కూడా మీరు వేగంగా సాధించవచ్చు. ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా అందుకు తగినట్లు యోగాసనాలు ఉంటాయి. జంటలు కలిసి వాటిని ఆచరించవచ్చు. ( స్త్రీ, పురుషుల్లో సంతాన సామర్థ్యాన్ని యోగాసనాలు )
ఔట్‌డోర్ గేమ్స్ ఆడండి
ఔట్‌డోర్ గేమ్స్ జంటలకు అత్యంత ఆహ్లాదకరమైన వ్యాయామంగా ఉంటాయి. టెన్నిస్, షటిల్ లాంటివి జంటలు కలిసి ఇంటి వద్ద ఆడుకోవచ్చు. ప్రతిరోజూ ఇలాంటి ఔట్‌డోర్ గేమ్స్ ఆడుతూ ఉంటే చురుగ్గా ఉంటారు. క్రమంగా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఫిట్‌గా తయారవుతారు.
ఇలాగే వ్యాయామంతో పాటు మంచి పోషకాహారం కూడా తీసుకోండి. మంచి వ్యాయామం, సమతుల్యమైన ఆహారంతో జంటలు సీజన్‌తో సంబంధం లేకుండా ఏడాదంతా ఫిట్‌గా ఉండేలా చూసుకోవచ్చు. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు.