తెలుగు న్యూస్  /  Lifestyle  /  Have Spicy And Tasty Dinner Tonight, Here Is Jollof Rice Recipe

Jollof Rice Recipe | స్పైసీగా.. టేస్టీగా జోలోఫ్ రైస్ చేసుకోండి ఇలా ఈజీగా!

HT Telugu Desk HT Telugu

30 January 2023, 19:07 IST

    • Jollof Rice Recipe: ఎర్రగా, కారంగా ఎంతో రుచికరంగా ఉండే జోలోఫ్ రైస్ వంటకాన్ని మీరు ఎప్పుడూ తిని ఉండరు, కానీ ఒక్కసారి తింటే మళ్లీ తినకుండా ఉండరు. రెసిపీ ఇక్కడ ఉంది చూడండి.
Jollof Rice Recipe
Jollof Rice Recipe (Unsplash)

Jollof Rice Recipe

బిర్యానీ నుంచి ఖిచ్డీ వరకు అన్నంతో చేసుకోవడానికి మనకు అనేక రకాల వంటకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఎప్పుడూ ఒకే రకంగా తినడం మీకు నచ్చకపోతే, కొత్తగా మరొక రైస్ రెసిపీని మీ ముందుకు తీసుకువస్తున్నాం. ఈ రైస్ రెసిపీ పేరు జోలోఫ్ రైస్.

ఇది ఆఫ్రికా దేశాలలో వండుకునే ఒక రైస్ వెరైటీ. ఈ వంటకాన్ని సాధారణంగా బాస్మతి బియ్యం, టమోటాలు, ఉల్లిపాయలు, సుగంధ ద్రవ్యాలు, కూరగాయలు లేదా మాంసంతో కలిపి ఒకే కుండలో తయారు చేస్తారు. దీనిని వండే విధానం మనం చేసుకునే పులావును పోలి ఉంటుంది. అయితే ఉపయోగించే పదార్థాలు వేరు కాబట్టి దీని ఫ్లేవర్ కూడా విభిన్నంగా ఉంటుంది. .

జోలోఫ్ రైస్‌ను ఎవరైనా చాలా సులభంగా, తక్కువ సమయంలోనే చేసుకోవచ్చు. మీకు సమయం లేనపుడు వెంటనే ఏదైనా తినాలి అనిపించినపుడు ఈ రుచికరమైన జోలోఫ్ రైస్ మీకొక మంచి ఛాయిస్‌గా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా వెజిటెబుల్ జోలోఫ్ రైస్ ఎలా చేయాలో ఇక్కడ ఇచ్చిన రెసిపీ ఆధారంగా చేసేయండి.

Jollof Rice Recipe కోసం కావలసినవి

  • 2 కప్పుల బాస్మతి బియ్యం
  • 4 పెద్ద టమోటాలు
  • 2 వెల్లుల్లి రెబ్బలు
  • 2 టేబుల్ స్పూన్లు అల్లం తురుము
  • 1 ఎర్రటి క్యాప్సికమ్
  • 2 ఉల్లిపాయలు
  • 2 టేబుల్ స్పూన్ల కారం
  • 2 ఎర్రటి చిన్న మిరపకాయలు
  • 3 బిర్యానీ ఆకులు
  • 3 టేబుల్ స్పూన్లు కూరగాయల నూనె
  • 2 టేబుల్ స్పూన్లు టొమాటో పేస్ట్
  • ఉప్పు రుచికి తగినంత
  • కొత్తిమీర గార్నిషింగ్ కోసం

జోలోఫ్ రైస్ తయారు చేసే విధానం

1. ముందుగా బాస్మతి బియ్యాన్ని కడిగి పక్కనపెట్టుకోండి.

2. ఆ తర్వాత టొమాటోలు, క్యాప్సికమ్, 2 ఉల్లిపాయలు తరిగిన ముక్కలు, మిరపకాయలు, కారం, ఉప్పు, అల్లం, వెల్లుల్లి అన్నీ కలిపి ఒక బ్లెండర్లో వేసి మెత్తని పేస్టులాగా స్పైసీ టొమాటో సాస్ తయారు చేయండి.

3. ఇప్పుడు బాణాలిలో వెజిటబుల్ ఆయిల్ వేసి, ఆపై సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసి, మీడియం వేడి మీద వేయించాలి, ఆపై టొమాటో పేస్ట్, కొన్ని వేడి నీరు, బిర్యానీ ఆకులను వేసి బాగా కలపండి.

4. ఇప్పుడు ఇందులో ఇది వరకు చేసుకున్న స్పైసీ టొమాటో సాస్ వేసి బాగా కలపండి.

5. ఈ దశలో బాస్మతి బియ్యం వేసి బాగా కలిపి, మీడియం వేడి మీద 10-12 నిమిషాలు ఉడికించండి. నీటిని సర్దుబాటు చేసుకోండి.

6. తరువాత మంట తగ్గించి, మూతపెట్టి మరో 10-12 నిమిషాల పాటు ఉడికించాలి.

5. అన్నం ఉడికిన తర్వాత, పైనుంచి కొత్తిమీర వేసి గార్నిషింగ్ చేసుకోవాలి.

అంతే, స్పైసీగా టేస్టీగా ఉండే జోలోఫ్ రైస్ రెడీ. వేడివేడి అన్నంలో రైతా లేదా ముల్లంగి చట్నీ, లేదా నిమ్మకాయ పిండుకొని తినవచ్చు. ఆమ్లెట్, చికెన్ ముక్కలతో కలుపుకొని తింటే కూడా అద్భుతంగా ఉంటుంది.