Gummadikaya Pulusu: టేస్టీ గుమ్మడికాయ పులుసు రెసిపీ, ఈ తీపి వంటకం వేడి వేడి అన్నంలో అదిరిపోతుంది
07 August 2024, 15:30 IST
- Gummadikaya Pulusu: గుమ్మడికాయతో ఏం కూరలు వండాలో అర్థం కావడం లేదా? ఇక్కడ మేము గుమ్మడికాయ పులుసు రెసిపీ ఇచ్చాము. బెల్లం చేసి వేసే ఈ రెసిపీ టేస్టీగా ఉంటుంది.
గుమ్మడికాయ పులుసు
గుమ్మడికాయ పులుసును ఇలా తీపిగా చేసుకొని తింటే.. గిన్నె ఖాళీ అయిపోతుంది. ముఖ్యంగా తెలుగువారికి ఈ గుమ్మడికాయ పులుసు నచ్చడం ఖాయం. గుమ్మడికాయతో చేసే ఈ పులుసు దక్షిణాది వంటకాల్లో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇప్పటి యువత ఈ ఆహారాలను తినేందుకు ఇష్టపడడం లేదు, కానీ ఒకప్పుడు గుమ్మడికాయ పులుసు లేనిదే గడిచేది కాదు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రెసిపీ. కాబట్టి దీన్ని అప్పుడప్పుడు చేసుకొని తినండి. ఇంటిల్లిపాదికీ నచ్చుతుంది. ముఖ్యంగా పిల్లలు ఈ తీపిగా ఉండే గుమ్మడికాయ పులుసును ఇష్టంగా తింటారు.
గుమ్మడికాయ పులుసు రెసిపీకి కావలసిన పదార్థాలు
గుమ్మడికాయ ముక్కలు - ఒక కప్పు
ఆవాలు - ఒక స్పూను
మెంతులు - పావు స్పూను
మినప్పప్పు - ఒక స్పూను
నూనె - సరిపడినంత
ఉల్లిపాయ - రెండు
కరివేపాకులు - గుప్పెడు
ఇంగువ - చిటికెడు
జీలకర్ర - ఒక స్పూను
ఎండుమిర్చి - రెండు
పచ్చిమిర్చి - రెండు
ధనియాల పొడి - ఒక స్పూను
కారం - అర స్పూను
పసుపు - చిటికెడు
నీరు - సరిపడినంత
చింతపండు పులుసు - అరకప్పు
బెల్లం తరుము - మూడు స్పూన్లు
కొత్తిమీర తరుగు - మూడు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
గుమ్మడికాయ పులుసు రెసిపీ
1. తీపి గుమ్మడికాయను ఈ రెసిపీ కోసం ఎంపిక చేసుకోవాలి.
2. చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
4. ఆ నూనెలో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, మెంతులు, జీలకర్ర, కరివేపాకులు, ఇంగువ వేసి వేయించుకోవాలి.
5. అందులోనే ఉల్లిపాయలను కాస్త పెద్ద ముక్కలుగా కోసుకొని వేసి వేయించుకోవాలి.
6. అలాగే పచ్చిమిర్చి కూడా వేసి వేయించాలి.
7. ఈ మొత్తం మిశ్రమం వేగే వరకు ఉంచాలి.
8. అందులో ముందుగా కోసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి.
9. కారం, పసుపు, ధనియాల పొడి వేసి వేయించుకోవాలి.
10. ఒక ఐదు నిమిషాలు చిన్న మంట మీద వేయించాక కాస్త నీరు వేసి వేయించాలి.
11. తర్వాత ఒక కప్పు నీరు వేసి గుమ్మడికాయల ముక్కలు మెత్తగా ఉడికే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి.
12. గుమ్మడి ముక్కలు మెత్తగా అయ్యాక ముందుగా చేసి పెట్టుకున్న చింతపండు పులుసును వేసి బాగా కలుపుకోవాలి.
13. రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఈ చింతపండు పులుసులోనే బెల్లం తురుమును కూడా వేసి కలుపుకోవాలి.
14. దీన్ని పావుగంటసేపు ఉడికించుకోవాలి. పైన కొత్తిమీరను చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి.
15. అంతే తీపి గుమ్మడికాయ పులుసు రెడీ అయినట్టే.
16. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చేసుకొని తినండి.. మీ ఇంటిల్లిపాదికి నచ్చడం ఖాయం. ఈ గుమ్మడికాయ రసంతో పాటు ముద్దపప్పుని కూడా పక్కన పెట్టుకుంటే ఆ జోడి అదిరిపోతుంది.
గుమ్మడికాయతో ఆరోగ్యం
గుమ్మడికాయతో చేసిన ఆహారాలను పురుషులు తినడం చాలా అవసరం .ఇది ప్రోస్ట్రేట్ గ్రంధిని ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రొస్టేట్ గ్రంథి వాపును తగ్గించడానికి గుమ్మడి కాయ సహాయపడుతుంది. ఈ గుమ్మడి కాయతో చేసిన వంటకాలు తినడం వల్ల మలబద్ధకం సమస్య కూడా రాదు. ఆహారం పూర్తిగా జీర్ణం అయిపోతుంది. గ్యాస్టిక్ సమస్యలు రాకుండా ఉంటాయి. హైబీపీ, అధిక బరువు వంటి సమస్యలు గుమ్మడికాయ తినడం వల్ల తగ్గుతాయి. పక్షవాతం వచ్చే అవకాశం తగ్గుతుందని ఎన్నో అధ్యయనాలు చెప్పాయి.
గుమ్మడిలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి గుమ్మడితో చేసిన ఆహారాన్ని తింటే త్వరగా పొట్ట నిండిపోతుంది. ఇతర ఆహారాలు తినరు. కాబట్టి బరువు పెరగకుండా ఉంటారు. మంచి నిద్ర పట్టడానికి కూడా గుమ్మడికాయలోని అమైనో ఆమ్లాలు సహాయపడతాయి. దీనిలో విటమిన్ సి, విటమిన్ ఇ, ఐరన్, బీటా కెరాటిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి రోగ నిరోధక శక్తి కూడా బలోపేతం అవుతుంది. అలాగే దీనిలో బెల్లాన్ని కూడా వేసాము. బెల్లంలో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.