తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Green Tomato Health Benefits । ఎర్రని వాటి కంటే ఆకుపచ్చని టమోటాలతోనే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం!

Green Tomato Health Benefits । ఎర్రని వాటి కంటే ఆకుపచ్చని టమోటాలతోనే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం!

HT Telugu Desk HT Telugu

08 November 2022, 15:18 IST

    • Green Tomato Health Benefits: ఎర్రని టమోటాలతో పోల్చితే ఆకుపచ్చని టమోటాలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఇవి ఎక్కడ దొరుకుతాయి, ఎలా తినాలి, తింటే ఏం లాభం ఇక్కడ తెలుసుకోండి.
Green Tomato Health Benefits
Green Tomato Health Benefits (Pixabay)

Green Tomato Health Benefits

మనకు టమోటాలు అనగానే ఎర్రగా నిగనిగలాడే టమోటాలు మాత్రమే ఉపయోగిస్తాం. దాదాపు అందరూ ఎర్రటి టమోటాలనే కూర వండుకుని తింటారు. మరి ఆకుపచ్చ టమోటాల గురించి తెలుసా? ఆకుపచ్చని టమోటాలు అంటే ఇది మరొక రకం టమోటా మాత్రం ఏం కాదు, కాయగా ఉన్న దశలో టామోటా లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. అందుకే వీటిని ఆకుపచ్చ టమోటాలు అంటారు. ఇవి ఎర్రగా పండిన టమోటాల మాదిరిగా మృదువుగా, మెత్తగా ఉండకుండా గట్టిగా ఉంటాయి. అలాగే రుచిలో కాస్త వగరుగా ఉంటాయి.

కొన్ని ప్రాంతాలలో ఎర్రని టమోటాలకు బదులుగా లేత ఆకుపచ్చ టమోటాలు తినడానికే ప్రాధాన్యతనిస్తారు. ముఖ్యంగా దక్షిణ అమెరికా ప్రాంతాలలో ఎక్కువగా ఆకుపచ్చని టమోటా కాయలను, మొక్కజొన్నతో కలిపి వివిధ రకాలుగా వండుకొని తింటారు.

ఎరుపు రంగు టమోటాలు తినడం ఎప్పుడూ ఆరోగ్యకరమే. అయితే ఈ ఆకుపచ్చని టామోటాలు కూడా మరింత ఆరోగ్యకరమైనవి. ఇందులో పోషకాల మోతాదు ఎర్రని వాటి కంటే ఎక్కువగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

టామోటాలలో టొమాటిన్ అనే కంటెంట్‌ ఉంటుంది. ఇది యాంటీబయాటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్, కార్డియో-ప్రొటెక్టివ్ గుణాలను కలిగి ఉండే ఒక గ్లైకోఅల్కలాయిడ్. ఇది శరీరానికి పోషకాల శోషణను పెంచుతుంది, జీవితకాలం వృద్ధి చెందేందుకు తోడ్పడుతుంది. ఇంకా ఈ టొమాటిన్ యాంటీ బాక్టీరియల్, యాంటీఫంగల్ లక్షణాలతో టమోటా కాయను సూక్ష్మజీవుల దాడిని తట్టుకునేలా నిరోధకతను కలిగి ఉంటుంది.

టొమాటిన్ కంటెంట్ కాయ దశలో ఉన్న ఆకుపచ్చ టమోటాలలో ఎక్కువ మోతాదులో ఉంటుంది. కిలో ఆకుపచ్చ టమోటాలలో సుమారు 500 mg వరకు టొమాటిన్ ఉంటుంది. అందుకే ఎర్రని వాటితో పోలిస్తే, ఆకుపచ్చని టమోటాలు సూక్ష్మజీవి రహితంగా, పోషకభరితంగా ఉంటాయి. ఇంకా అనేక బయోయాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటాయి. ఈ రకంగా ఆకుపచ్చవి మరింత శ్రేయస్కరమైన ఆహారంగా పేర్కొంటున్నారు. అయితే ఈ ఆకుపచ్చని టామోటాలను పచ్చిగా తినకూడదు. ఎందుకంటే ఇందులో సొలనిన్ అనే సమ్మేళనం ఉంటుంది. అది విషపూరితం కావచ్చు. అయితే చక్కగా ఉడికించుకొని, వండుకుని తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు.

Green Tomato Health Benefits- ఆకుపచ్చ టమోటాలతో ఆరోగ్య ప్రయోజనాలు

ఆకుపచ్చని టమోటాలలో టొమాటిన్ సమ్మేళనంతో పాటు విటమిన్ సి, విటమిన్ కె, ఫైబర్, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. కావున ఆకుపచ్చనివి తినడం వలన ఈ కింది ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.

గుండె ఆరోగ్యానికి మంచిది

గ్రీన్ టొమాటోలలో ఉంటే టొమాటిన్ కంటెంట్‌ గుండెకు రక్షణ కలిగించే ప్రయోజనాలను అందిస్తుంది. వీటిలో డైటరీ ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది, ఇది వాపు, రక్తపోటు, శరీర బరువు, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ ఎ కూడా ఉంది, ఇది కూడా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

ఆకుపచ్చ టమోటాలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది జలుబు, ఫ్లూ, ఇతర అంటు వ్యాధులకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.

జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

గ్రీన్ టమోటాలలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది, బరువు తగ్గడంలో సహాయపడుతుంది, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

చర్మానికి మంచిది

ఆకుపచ్చ టమోటాలలో బీటా కెరోటిన్, విటమిన్ ఎ వంటి పోషకాలను కూడా కలిగి ఉంటాయి. ఇది చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా స్కిన్ హీలింగ్‌ని పెంచుతుంది, తద్వారా ఆరోగ్యకరమైన, యవ్వనంగా కనిపించే చర్మాన్ని పొందవచ్చు.

క్యాన్సర్‌తో పోరాడగలదు

గ్రీన్ టమోటాలలో ఉండే టొమాటిన్ మన శరీరంలో రొమ్ము, పెద్దప్రేగు, కాలేయం, కడుపు క్యాన్సర్‌లో సాధారణంగా కనిపించే ప్రాణాంతక కణాల పెరుగుదలను నిరోధిస్తుంది.

టాపిక్