Yoga Pose: ఈ యోగాసనంతో మహిళలకు ఎన్నో ప్రయోజనాలు.. నెలసరి నొప్పుల ఉశమనం నుంచి మరిన్ని..
22 November 2024, 6:00 IST
- Yoga Pose: మహిళలకు ఉత్కట కోణాసనం చాలా ప్రయోజనాలను కల్పిస్తుంది. నెలసరి నొప్పిని తగ్గించగలదు. కండరాల దృఢత్వం సహా మరిన్ని లాభాలు ఉంటాయి. ఈ ఆసనం వివరాలు ఇవే..
Yoga Pose: ఈ యోగాసనంతో మహిళలకు ఎన్నో ప్రయోజనాలు.. నెలసరి నొప్పుల ఉశమనం నుంచి మరిన్ని..
కొన్ని యోగాసనాలు మహిళలకు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయి. వాటి వల్ల కొన్ని సమస్యల నుంచి ఉపశమనం దక్కడంతో పాటు పూర్తిస్థాయి లాభాలు ఉంటాయి. అలాంటి కోవలోకే వస్తుంది ఉత్కట కోణాసనం. ఈ ఆసనం రెగ్యులర్‌గా చేయడం మహిళలకు ఎన్నో లాభాలు ఉంటాయి. ఈ ఆసనాన్ని దేవత ఆసనం అని కూడా పిలుస్తుంది. ఉత్కట కోణాసనం వల్ల కలిగే ముఖ్యమైన లాభాలు ఏవో ఇక్కడ చూడండి.
నెలసరి నొప్పి నుంచి ఉపశమనం
ఉత్కట కోణాసనం వేయడం వల్ల నెలసరి నొప్పి నుంచి మహిళలకు ఉపశమనం లభిస్తుంది. ఈ భంగిమ వల్ల నొప్పి తగ్గుతుంది. మోనోపాజ్ నుంచి వచ్చే సమస్యలు తగ్గేందుకు కూడా ఈ ఆసనం తోడ్పడుతుంది.
కండరాల దృఢత్వం మెరుగు
ఉత్కట కోణాసనం వేయడం వల్ల తొడలు, తుంటి సహా శరీర కింది భాగంలో కండరాల దృఢత్వం పెరుగుతుంది. శరీర స్థిరత్వాన్ని, శక్తిని పెంచుతుంది. నడవడం, మెట్లు ఎక్కడం లాంటివి సులువుగా చేసేలా తోడ్పడుతుంది. చేతులు, భుజాలు, వెన్ను, రొమ్ములకు కూడా మేలు జరుగుతుంది.
రక్త ప్రసరణ
శరీర కింద భాగంలో రక్తప్రసరణ మరింత మెరుగ్గా ఉండేలా ఉత్కట కోణాసనం చేయగలదు. దీనివల్ల శరీరమంతా ఆక్సిజన్ సులభంగా ప్రవహించేలా తోడ్పడుతుంది. ఈ ఆసనం వల్ల గుండె ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. నడుము దృఢత్వం కూడా ఈ ఆసనం వల్ల మెరుగవుతుంది.
ప్రత్యుత్పత్తి వ్యవస్థకు..
శరీరంలో ప్రత్యుత్పత్తి (రీప్రొడక్టివ్) అవయవం పనితీరును ఉత్కట కోణాసనం మెరుగుపరుస్తుంది. ఈ ఆసనం గర్భిణులకు కూడా ఎంతో మేలు చేస్తుంది. ప్రసవం సులభం అయ్యేందుకు ఇది సహకరిస్తుంది.
ఒత్తిడి తగ్గుతుంది
ఉత్కట కోణాసనం వేయడం వల్ల మానసిక ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఒత్తిడి, ఆందోళన తగ్గేందుకు కూడా ఈ ఆసనం తోడ్పడుతుంది. ఏకాగ్రత కూడా పెరిగేలా సహకరిస్తుంది. అంతర్గత సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది.
ఉత్కట కోణాసనం ఆసనం ఇలా..
- ఉత్కట కోణాసనం వేసేందుకు, ముందుగా ఓ చోట నిటారుగా నిల్చోవాలి. ఆ తర్వాత రెండుకాళ్లను పక్కలకు దూరంగా జరపాలి.
- కాళ్లను దూరంగా ఉంచి.. మోకాళ్లను వంచాలి. ముందుకు వంగకుండా మోకాళ్లను వంచి శరీరాన్ని కిందికి తీసుకురావాలి.
- అలా వీలైనంత మేర మోకాళ్లను బెండ్ చేస్తూ కిందికి వంగాలి.
- ఆ తర్వాత చేతులతో నమస్కారం చేస్తున్నట్టుగా పెట్టాలి. అయితే, నమస్కరిస్తున్నట్టుగా చేసినప్పుడు మీ చేతులు ఎల్ షేప్‍లో 90 డిగ్రీల కోణంలో చక్కగా ఉండాలి.
- ఈ భంగిమలో కాసేపు ఉండాలి. 3 నుంచి 5 సార్లు గాఢంగా శ్వాస తీసుకొని వదిలేంత వరకు అలాగే ఉండాలి. ఆ తర్వాత కాళ్లను దగ్గరిగా తెచ్చి నిలబడాలి. మళ్లీ ఆ ఆసనం రిపీట్ చేయాలి.
- ఆ ఆసనం వేస్తున్నప్పుడు చేతులను పైకి చూపిస్తున్నట్టుగా చాపి నమస్కరిస్తున్నట్టు పెట్టవచ్చు.
టాపిక్