White Hair । చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుందా? కారణాలు, పరిష్కార మార్గాలు..!
08 September 2022, 22:54 IST
- మనిషికి జుట్టు రాలిపోవటం ఒక సమస్యతే, జుట్టు నెరిసిపోవటం.. తెల్లబడటం కూడా పెద్ద సమస్యే. చిన్న వయసులో జుట్టు నెరిసిపోవటం వలన పెద్దవారిలా కనిపిస్తారు. ఇందుకు కారణాలు, పరిష్కార మార్గాలు తెలుసుకోండి.
Premature White Hair Causes, solutions
వెంట్రుకల కుదుళ్లలో ఉండే ఫోలికల్స్ జుట్టు రంగును నిర్ణయిస్తాయి. ఈ ఫోలికల్స్ మెలనిన్ కలిగి ఉన్న వర్ణద్రవ్యం కణాలను ఉత్పత్తి చేస్తున్నంత కాలం వెంట్రుకలు నల్లగా నిగనిగలాడుతూ ఉంటాయి. అయితే కాలక్రమేణా ఈ హెయిర్ ఫోలికల్స్ పిగ్మెంట్ కణాలను కోల్పోతాయి, ఫలితంగా తెల్ల జుట్టు రంగు వస్తుంది.
వయసు పెరిగే కొద్దీ జుట్టు నెరిసిపోవడం సహజం. సాధారణంగా జుట్టు తెల్లబడే సమస్య 40 ఏళ్ల తర్వాత కనిపిస్తుంది. కానీ మారుతున్న వాతావరణం, సరైన పోషకాహారం తీసుకోకపోవడం, అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా చాలా మందిలో ఈ సమస్య 20-30 ఏళ్లకే మొదలవుతుంది. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం వలన వ్యక్తులు చాలా పెద్దవారిలా కనిపిస్తారు. ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. దీనిని కవర్ చేసేందుకు రకరకాల హెయిర్ డైలను, కలర్ షేడ్లను ఉపయోగిస్తారు.
అకాల తెల్ల జుట్టుకు సంబంధించిన మరికొన్ని సాధారణ కారణాలను ఇక్కడ తెలుసుకోండి. అలాగే జుట్టు నెరిసే ప్రక్రియను నెమ్మదింపజేయడం లేదా నిరోధించడం వంటి మార్గాలను కూడా తెలుసుకోండి.
1. ఒత్తిడి
దీర్ఘకాలం పాటు ఒత్తిడిని అనుభవిస్తే, అది నిద్రలేమి, ఆందోళన, ఆకలి మందగించటం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ పరిస్థితులన్నీ మీ జుట్టుపై చెడుప్రభావం చూపిస్తాయి. ఫలితంగా జుట్టు రాలడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు, క్రమక్రమంగా వెంట్రుకలు తెల్లబడటం ప్రారంభిస్తాయి. కాబట్టి మిమ్మల్ని ఒత్తిడి లేకుండా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి రోజూ ధ్యానం చేయండి.
2. రసాయన ఉత్పత్తులు వాడకం
రసాయనాలు అధికంగా ఉండే జుట్టు ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగించడం వలన కూడా జుట్టు తెలబడుతుంది. హెయిర్ ప్రొడక్ట్స్‌లో ఉండే సల్ఫేట్‌లు జుట్టుకు కొన్ని ప్రయోజనాలు చేకూర్చినప్పటికీ, వీటి వల్ల జుట్టు పొడిబారి, త్వరగా పాడైపోయేలా చేస్తాయి. ఇది జుట్టును తెల్లగా మారుస్తుంది. అందువల్ల సల్ఫేట్ లేని జుట్టు సంరక్షణ ఉత్పత్తులను ఎంచుకోండి.
3. విటమిన్ లోపం
శరీరంలో అవసరమైన విటమిన్లు లేకపోవడం మీ జుట్టు ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఫోలిక్ యాసిడ్, బయోటిన్ వంటి పోషకాల లోపంతో జుట్టు బూడిద రంగులోకి మారుతుంది. ఈ పోషకాల లోపాన్ని తీర్చడానికి, డైరీ ఉత్పత్తులు, గుడ్లు, మాంసం వంటి ముఖ్యమైన ఆహారాలను తీసుకోండి.
4. ధూమపానం
ఒక అధ్యయనం ప్రకారం, ధూమపానం అలవాటు వల్ల జుట్టు తొందరగా నెరసిపోతుంది. ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని మీ అందరికీ తెలుసు. ఈ అలవాటు ఊపిరితిత్తులు, గుండె ఆరోగ్యాన్ని దారుణంగా ప్రభావితం చేస్తుంది. అయితే ఈ పొగతాగే అలవాటు చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా హానికమే. సిగరెట్‌లలో ఉండే టాక్సిన్స్ వెంట్రుకల కుదుళ్లను దెబ్బతీస్తాయి. దీంతో జుట్టు తెల్లబడుతుంది.
5. అతినీలలోహిత కిరణాలు
UVA అలాగే UVB వంటి హానికరమైన సూర్య కిరణాలకు మీ శరీరం గురికావడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఇది జుట్టును పొడిగా, గరుకుగా మారుస్తుంది. జుట్టు రంగు నెరిసిపోవటానికి కూడా కారణం కావచ్చు. కాబట్టి ఎండలో ఎక్కువ తిరిగే వారు తలకు రక్షణ గొడుగు, టోపీలు ఉపయోగించాలి.