Hair Growth Oils। ఈ నూనెలు తలకు రాస్తే.. జుట్టు రాలటం ఆగి, ఒత్తుగా పెరుగుతుంది!
16 August 2022, 20:24 IST
- జుట్టు రాలే సమస్య ఇబ్బందిపెడుతుందా? అయితే కొబ్బరినూనెలో కొన్ని రకాల నూనెలు కలిపి తలకు అప్లై చేసుకోవటం ద్వారా జుట్టు రాలటం సమస్య తగ్గి, కొత్తగా వెంట్రుకలు పెరుగుతాయి. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి
Hair Growth Tips
ఈరోజుల్లో చాలా మంది యువత ఎదుర్కొంటున్న అతిక్లిష్టమైన సమస్య జుట్టు రాలటం. దువ్వుకున్నా, నూనె రాసుకున్నా, తలంటూ స్నానం చేసిన ప్రతీసారి పెద్ద మొత్తంలో వెంట్రుకలు ఊడిపోవటం చూస్తే మనసు కలవరపడుతుంది. ఫలితంగా చిన్నవయసులోనే బట్టతల ఇబ్బందిపెడుతుంది. పెళ్లి కాని వారికి ఈ సమస్య మరింత ఆందోళన కలిగిస్తుంది. ఒత్తిడితో కూడిన జీవనశైలి, సరైన ఆహారం తీసుకోకపోవటం, జుట్టును సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, వాతావరణ పరిస్థితులు జుట్టు రాలటానికి ప్రధాన కారణాలు.
ఇక, వర్షాకాలంలో జుట్టు రాలడం అనేది చాలా సాధారణ సమస్య. తేమ వాతావరణం కారణంగా తల వెంట్రుకలు చాలా బలహీనంగా మారి రాలడం ప్రారంభిస్తాయి. అటువంటి పరిస్థితుల్లో జుట్టు రాలడాన్ని నివారించడానికి సరైన సంరక్షణ చర్యలు తీసుకోవాలి. కొన్ని రకాల నూనెలు జుట్టు కుదుళ్లకు పట్టించటం ద్వారా జుట్టు రాలడం సమస్యను అధిగమించవచ్చు. వీటిని అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం ఆగిపోపోవటమే కాకుండా జుట్టుకు మెరుగైన పోషణ లభించి కొత్త వెంట్రుకలు కూడా పెరగడం ప్రారంభమవుతుంది. మరి ఆ నూనెలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
లెమన్ గ్రాస్ ఆయిల్
లెమన్ గ్రాస్ ఆయిల్ జుట్టుకు అద్భుతంగా పనిచేస్తుంది. తలలో చుండ్రు ఎక్కువగా ఉన్నట్లయితే లెమన్ గ్రాస్ నూనెను జుట్టుకు పట్టించాలి. కొన్నిసార్లు జుట్టులో చుండ్రు సమస్య కూడా జుట్టు రాలడానికి దారితీస్తుంది. అలాంటపుడు లెమన్ గ్రాస్ ఆయిల్ రాయటం వలన స్కాల్ప్ డ్రైనెస్ అనేది పోతుంది. మంచి పోషణ లభించి జుట్టు పెరుగుతుంది. షాంపూ లేదా కండిషనర్లో 4-5 చుక్కల లెమన్‌గ్రాస్ ఆయిల్ కలపి తలకు పట్టిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.
రోజ్మేరీ ఆయిల్
జుట్టు చాలా బలహీనంగా, మూలాల నుండి సన్నగా ఉంటే వెంట్రుకలు రాలిపోతాయి. ఇలాంటి సందర్భంలో రోజ్మేరీ నూనెను జుట్టుకు అప్లై చేసి చూడండి. ఇది జుట్టు ఆరోగ్యంగా పెరగటాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ రోజ్మరి నూనె స్కాల్ప్‌ని గట్టిగా పట్టుకోవడం వల్ల ఇది జుట్టుకు కుదుళ్ల నుంచి పోషణ అందించి జుట్టు రాలటాన్ని నివారిస్తుంది. క్రమక్రమంగా మీకు ఒత్తైన జుట్టు లభిస్తుంది. అయితే రోజ్మేరీ నూనెను కొబ్బరి నూనెతో కలిపి అప్లై చేస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. అర టీస్పూన్ కొబ్బరి నూనెలో కొన్ని చుక్కల రోజ్‌మేరీ ఆయిల్ కలపండి. దీన్ని తలకు పట్టించి అరగంట పాటు అలాగే ఉంచాలి. తర్వాత తేలికపాటి షాంపూతో జుట్టును కడగాలి. దీని ప్రభావం త్వరలో జుట్టు మీద కనిపిస్తుంది.
గంధపు నూనె
జుట్టు చాలా జిడ్డుగా, జిగటగా ఉంటే కూడా రాలిపోవటానికి దారితీస్తుంది. ఇలాంటి జుట్టు కలిగిన వారు గంధపు నూనె రాసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇది తలపై నూనెను ఉత్పత్తి చేసే గ్రంధులను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. దీని వల్ల జుట్టులో దురద, చుండ్రు, జిగట సమస్యలు తీరిపోతాయి. మెరుగైన ఫలితాల కోసం కొబ్బరినూనె లేదా ఆముదం నూనెలో కొన్ని చుక్కల గంధపు నూనెను మిక్స్ చేసి తలకు పట్టించాలి.
గమనిక: ఈ చిట్కాలు కేవలం మీ సమాచారం కోసం మాత్రమే. ఇవి పాటించే ముందు నిపుణుల సలాహా తీసుకోవటం ఉత్తమం.