Teeth Whitening Tips । దంతాలు తెల్లగా మిలమిల మెరవాలంటే ఈ సింపుల్ టిప్స్ పాటించండి!
09 February 2023, 13:45 IST
- Yellow Teeth Whitening Tips: దంతాలు పసుపు రంగులో ఉన్నాయంటే దానికి కారణాలు అనేకం, కొన్ని అలవాట్లను మార్చుకోవడంతో పాటు, ఇక్కడ ఇచ్చిన టిప్స్ పాటిస్తే తెల్లగా మిలమిల మెరుస్తాయి.
Teeth Whitening Tips
ముఖానికి చిరునవ్వే అందం, కానీ నవ్వినవ్వుడు దంతాలు పసుపు రంగులో ఉంటే అప్పుడు మీ అందం ఆకర్షించదు. దంతాలు పసుపు రంగులోకి మారడానికి ప్రధాన కారణం దంతాలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం. పళ్లపై సూక్ష్మజీవుల వృద్ది వలన దంతాలపై పాకురు పేరుకుపోయి, పసుపు రంగులోకి మారుతాయి.
కాఫీ, టీలు ఎక్కువగా తాగడం, వైన్, సోడా, ఫ్లేవర్లతో కూడిన స్పోర్ట్స్ డ్రింక్స్ కూడా కారణమవుతాయి. మీరు తినే టొమాటోలు, కరివేపాకు, మసాలా దినుసులలోని వర్ణ ద్రవ్యాలు పసుపు రంగుకు కారణమవుతాయి. వయసు ప్రభావం, పొగాకు ఉత్పత్తులు నమలడం, ధూమపానం వంటి అలవాట్లు దంతాల రంగును మారుస్తాయి. కొన్నిసార్లు ఔషధాల ప్రభావమూ ఉంటుంది.
అందరూ తమ దంతాలు తెల్లగా, మిలమిల మెరిసేలా ఉండాలని కోరుకుంటారు. బ్రష్ చేసినప్పటికీ దంతాలపై పసుపు రంగు తొలగిపోనపుడు, ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.
Yellow Teeth Whitening Tips- పసుపు దంతాలను తెల్లగా చేసే చిట్కాలు
పసుపు దంతాలు తెల్లగా మెరిసేందుకు ఆయుర్వేద నిపుణులు అందించిన ఈ ప్రభావవంతమైన సహజ చిట్కాలు పాటించి చూడండి.
1. నల్ల తుమ్మ కొమ్మలు
మీరు పళ్ళు తోముకోవడానికి వేప కొమ్మలు, అలాగే నల్ల తుమ్మ చెట్టు కొమ్మలను ఉపయోగించండి. ఈ మూలికలు యాంటీ మైక్రోబియల్. వాటిని నమలడం వల్ల నోటి ఆరోగ్యాన్ని కాపాడుకునే యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్లు విడుదలవుతాయి. వీటిలో క్రిమినాశక గుణాలు పసుపు రంగుకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడి దంతాలను తెల్లగా శుభ్రపరుస్తాయి.
2. ఆయిల్ పుల్లింగ్
నోటిలో ఆయిల్ స్విష్ చేయడాన్ని ఆయిల్ పుల్లింగ్ అంటారు. ఈ అభ్యాసం చిగుళ్ళు, దంతాల నుండి సూక్ష్మజీవులను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది నోటి అల్సర్లను తగ్గించడంలో సహాయపడుతుంది. నోటి కండరాలకు కూడా వ్యాయామం లభిస్తుంది, వాటికి సరైన ఆకృతిని అందిస్తుంది.
3. టంగ్ స్క్రాపింగ్
నోటి కుహరాన్ని శుభ్రపరచడానికి, దంత ఫలకం ఏర్పడటానికి దారితీసే బ్యాక్టీరియా పెరుగుదలకు కారణమయ్యే అన్ని విషపదార్ధాలను తొలగించడానికి టంగ్ స్క్రాపింగ్ చేయడం చాలా ముఖ్యం.
4. హెర్బల్ మౌత్ రిన్స్
త్రిఫల లేదా యష్టిమధు కషాయాలు అద్భుతమైన మౌత్ రిన్సర్లుగా పనిచేస్తాయి. వీటితో నోటిని పుక్కిలించాలి. నోటి పరిశుభ్రత కోసం, నోటి పూతల నుండి ఉపశమనం పొందడం కోసం ఈ రకమైన హెర్బల్ మౌత్ రిన్స్ ప్రభావవంతంగా ఉంటుంది.
5. ప్రతిరోజూ రెండుసార్లు బ్రష్ చేయండి
రోజూ ఉదయం బ్రష్ చేయడమే కాకుండా, భోజనం చేసిన తర్వాత ప్రతిసారీ ముఖ్యంగా చాక్లెట్లు వంటి జిగట ఆహార పదార్థాలను తిన్న తర్వాత బ్రష్ చేయడం ముఖ్యం. రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం ముఖ్యం.
DIY Teeth Whitening Techniques - మరికొన్ని పద్దతులు
- అరటి తొక్క దంతాలను తెల్లగా మార్చడంలో కూడా సహాయపడుతుంది. అరటి తొక్క లోపలి తెల్లటి భాగాన్ని దంతాలపై రుద్దండి. తర్వాత గోరువెచ్చని నీటితో మీ దంతాలను కడగాలి. ఈ రొటీన్‌ని కొన్ని రోజులు క్రమం తప్పకుండా పాటించండి. మార్పు మీకే తెలుస్తుంది.
- ఆవాల నూనె, ఉప్పు మిశ్రమం దంతాల పసుపును తొలగించడంలో కూడా ఉపయోగపడుతుంది. అర చెంచా ఆవాల నూనెలో చిటికెడు ఉప్పు కలపండి, ఆ మిశ్రమంతో మీ దంతాలను బ్రష్ చేయండి. మిశ్రమాన్ని కొన్ని రోజులు క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల పసుపు రంగు సులభంగా తొలగిపోతుంది.
- స్ట్రాబెర్రీలను దంతాలపై రుద్దడం వల్ల కూడా దంతాలు అందంగా ఉంటాయి. ఇవి యాంటీఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉండటం చేత దంతాలపై పసుపు రంగు సులభంగా తొలగిపోతుంది.