Drinking Water | దంతాలు శుభ్రం చేసుకోకుండానే నీరు తాగితే ఆరోగ్యకరమేనా?
మీరు నిద్రలేచిన వెంటనే బ్రష్ చేయకుండానే నీరు తాగుతున్నారా? ఇది మంచి అలవాటేనా.. కాదా? నిపుణులు ఏమంటున్నారో ఇక్కడ తెలుసుకోండి..
Drinking water (Pixabay)
ఉదయం లేచిన తర్వాత పళ్లు తోముకోవడం అనేది అతి ముఖ్యమైన పరిశుభ్రత అలవాట్లలో ఒకటి. రోజుకు రెండుసార్లు నిద్రలేచిన తర్వాత ఒకసారి, పడుకునే ముందు ఒకసారి దంతాలను బ్రష్ చేయాలని సిఫార్సు చేయడమైనది. ఉదయం దంతాలను శుభ్రం చేసుకోనిదే ఏదీ తినకూడదు. బ్రష్ చేసుకున్న తర్వాతే ఏదైనా తినడం, తాగటం చేయాలి అని కూడా చెప్తారు. కానీ నిద్రలేచిన వెంటనే, బ్రష్ చేయకుండానే కొందరు గటగట నీరు తాగేస్తారు. మరి ఇలా బ్రష్ చేయకుండానే నీరు తాగితే మంచిదేనా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. అయితే నిరభ్యంతరంగా చేయవచ్చునంటున్నారు నిపుణులు.
నిజానికి, ఇలా తాగంటం మంచి ప్రయోజనాలను అందిస్తుందట. ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగితే వివిధ రకాల ప్రయోజనాలు ఉంటాయని పలు నివేదికలు వెల్లడించాయి.
ఉదయం లేచిన వెంటనే నీరు తాగితే ఈ ప్రయోజనాలుంటాయి
- మీరు నిద్రపోతున్నప్పుడు మీ శరీరం రాత్రి సమయంలో నీటిని పూర్తిగా ఉపయోగించుకుంటుంది. కాబట్టి ఉదయం లేచిన వెంటనే డీహైడ్రేట్ అయినట్లు అనిపిస్తుంది. లేచిన వెంటనే నీళ్లు తాగితే మళ్లీ రీహైడ్రేట్ అవ్వొచ్చు.
- నోటిలోని సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా రాత్రి సమయంలో వృద్ధి చెందుతాయి. మీరు ఉదయం బ్రష్ చేయడానికి ముందు కొన్ని నీళ్లతో నోటిని పుకిలించి, ఆపై నీళ్లు తాగితే వెంటనే మీ నోరు శుభ్రమవుతుంది. ఆ తర్వాత టూత్ బ్రషింగ్ చేస్తే మరింత ప్రభావవంతంగా నోరు శుభ్రమవుతుంది.
- బ్రష్ చేయడానికి ముందు నీరు తాగడం అలవాటు చేసుకుంటే రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుందట. సాధారణ దగ్గు, జలుబు, ఫ్లూ లేదా గవత జ్వరం వంటి అనారోగ్యాల బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
- బ్రష్ చేయడానికి ముందే నీరు తాగుతుండటం వలన అధిక రక్తపోటు తగ్గుతుంది, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
- మలబద్ధకం, పచ్చి త్రేనుపు లేదా నోటిపూత వంటి జీర్ణక్రియ సమస్యలతో పోరాడుతున్న వారికి, ఖాళీ కడుపుతో నీరు త్రాగడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఊబకాయంతో పోరాడటానికి కూడా సహాయపడుతుంది.
- రోజూ ఉదయం లేవగానే ఖాళీ కడుపున ఒక గ్లాసు నీరు తాగుతున్నప్పుడు స్టమక్ అల్సర్స్ లేదా అజీర్ణం వంటి సమస్యలు ఉండవు. అంతేకాదు చర్మం, జుట్టు రెండింటినీ మృదువుగా చేస్తుంది.
సంబంధిత కథనం