Blackheads Remove Tips : ముక్కుపై బ్లాక్ హెడ్స్ పోయేందుకు ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలు
19 March 2024, 9:30 IST
- Blackheads : బ్లాక్ హెడ్స్ తో చాలామంది చిరాకుగా ఫీలవుతారు. కొందరికి ముక్కు మీద ఎక్కువగా బ్లాక్ హెడ్స్ ఉంటాయి. వీటిని తొలగించేందుకు ఇంట్లోని వస్తువులనే ఉపయోగించవచ్చు.
బ్లాక్ హెడ్స్ పోవడానికి చిట్కాలు
మీ ముక్కు పైభాగం, మీ ముక్కు చుట్టూ బ్లాక్ హెడ్స్ ఉన్నాయా? ముక్కును అద్దంలో చూసుకుంటూ గిల్లుతున్నారా? ముక్కు పైన నల్లటి మచ్చలు కనిపిస్తున్నాయా? అలా అయితే మీ చర్మ రంధ్రాలు మురికి, మృతకణాలతో మూసుకుపోయాయని అర్థం. చర్మ రంధ్రాల నుండి మురికి, మృత కణాలను ఎలా తొలగించాలో చూద్దాం..
చాలా మంది ఈ బ్లాక్‌హెడ్స్‌ను తొలగించడానికి దుకాణాల్లో విక్రయించే అనేక రసాయనాలతో కూడిన ఉత్పత్తులను కొనుగోలు చేసి వాడుతారు. పని చేసినా అది తాత్కాలికమే. రసాయన ఉత్పత్తులు కొందరిలో చర్మంపై దుష్ప్రభావాలను కలిగిస్తాయి. ఇంట్లోని వస్తువులతోనే బ్లాక్ హెడ్స్ పొగొట్టుకోవచ్చు. చర్మానికి కూడా సురక్షితం. నల్ల మచ్చలను వదిలించుకోవడానికి మీకు సహాయపడే కొన్ని సహజమైన ఫేస్ ప్యాక్‌లు కింద ఉన్నాయి. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు ఈ ఫేస్ ప్యాక్‌లను ఉపయోగిస్తే నల్ల మచ్చలు పోయి చర్మం శుభ్రంగా, కాంతివంతంగా, మృదువుగా ఉంటుంది.
దాల్చిన చెక్క పొడి ఫేస్ ప్యాక్
ముందుగా ఒక గిన్నెలో 1 స్పూన్ దాల్చిన చెక్క పొడి, 1 టేబుల్ స్పూన్ తేనె వేసి కలపాలి. తర్వాత ముఖానికి పట్టించాలి. అనంతరం పైన కాటన్ స్ట్రిప్ ఉంచి సున్నితంగా నొక్కండి. తర్వాత దానిని 10-15 నిమిషాలు అలానే ఉంచండి. ఆపై కాటన్ స్ట్రిప్ తొలగించండి. చివరగా గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని కడగాలి.
గ్రీన్ టీ ఆకుల ఫేస్ ప్యాక్
ముందుగా గ్రీన్ టీ ఆకులను లేదా గ్రీన్ టీ బ్యాగ్ ను వేడి నీటిలో గంటసేపు నానబెట్టండి. నల్లమచ్చలపై అప్లై చేయాలి. 20 నిమిషాల పాటు పెట్టాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. దీన్ని రోజూ రాత్రిపూట ఉపయోగిస్తే ముఖంపై ఉన్న నల్లటి మచ్చలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.
ఓట్ పౌడర్, పెరుగు ఫేస్ ఫ్యాక్
ఒక గిన్నెలో 2 టేబుల్‌స్పూన్ ఓట్ పౌడర్ తీసుకుని, అందులో 3 టేబుల్ స్పూన్ల పెరుగు కలపాలి. తర్వాత దీన్ని ముఖానికి పట్టించి 10-15 నిమిషాల పాటు నాననివ్వాలి. తర్వాత చల్లటి నీటితో చేతులను తడిపి, ముఖాన్ని సున్నితంగా స్క్రబ్ చేసి, చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఈ ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మంపై ఉన్న మురికి, మృతకణాలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారి బ్లాక్ హెడ్స్ పోతాయి.
గుడ్డు తెల్లసొనతో..
ఒక గిన్నెలో గుడ్డులోని తెల్లసొన మాత్రమే తీసుకోవాలి. తర్వాత ముఖానికి పట్టించి ఆరనివ్వాలి. ఆ తర్వాత గుడ్డులోని తెల్లసొనను మళ్లీ రెండోసారి అప్లై చేయాలి. ఆరిన తర్వాత మూడోసారి అప్లై చేసి అలాగే ఆరనివ్వాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. కావాలనుకుంటే, మీరు 1/2 టీస్పూన్ నిమ్మరసం, 1 టీస్పూన్ తేనెను కూడా కలపవచ్చు. ఇలా వారానికి రెండు సార్లు ఉపయోగిస్తే చర్మంలోని మురికి, మృతకణాలు అన్నీ తొలగిపోతాయి.
టొమాటో ఫేస్ ప్యాక్
టమోటో ఫేస్ ప్యాక్ కోసం ముందుగా పండిన టొమాటోను గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు టొమాటో తురుమును ముఖమంతా అప్లై చేసి 2 నిమిషాల పాటు మృదువుగా మసాజ్ చేయాలి. తర్వాత 15 నిమిషాల పాటు నానబెట్టి చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా అప్పుడప్పుడు టొమాటోలతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే ముఖం మెరిసిపోతుంది. బ్లాక్ హెడ్స్ పోతాయి.