Egg Yolk: గుడ్డులోని పచ్చసొన తినడం ఎంత అవసరమో తెలుసా? ఇది చదివితే ప్రతిరోజూ తింటారు
Egg Yolk: గుడ్డులోని పచ్చసొన తింటే బరువు పెరిగి పోతామని ఎంతోమంది భయం. అందుకే దాన్ని బయటపడేస్తూ ఉంటారు. నిజానికి దాన్ని తినడం చాలా అవసరం.
Egg Yolk: పోషకాల పవర్ హౌస్... కోడిగుడ్డు. ప్రతిరోజూ ఒక గుడ్డు తింటే చాలు... మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు అందుతాయి. అంతేకాదు దీన్ని కేవలం ఉడకబెట్టి తినేయొచ్చు. వండేందుకు పెద్ద కష్టపడక్కర్లేదు. కాబట్టి ఇది మంచి అల్పాహారం అని చెప్పుకోవాలి. ఎంతోమంది గుడ్డులోని పచ్చ సొనను బయట పడేస్తారు. తెల్లసొన మాత్రం తిని పొట్ట నింపుకుంటారు. నిజానికి మనం తినాల్సింది పచ్చ సొననే. రోజుకు ఒక పచ్చ సొన తినడం వల్ల ఎవరూ బరువు పెరిగిపోరు. కాబట్టి రోజుకో పచ్చసొనను తినడం చాలా అవసరం. పచ్చసొన తినడం వల్ల ప్రయోజనాలు తెలిస్తే వదిలి పెట్టకుండా తింటారు.
గుడ్డు పచ్చసొన ఎందుకు తినాలి?
పచ్చసొనలో మనకు అవసరమైన పది రకాల పోషకాలు ఉంటాయి. ఒక గుడ్డును రోజుకు తినడం వల్ల మన శరీర అవసరాల్లో 15% తీరుతాయి. గుడ్డులోని పచ్చసొనలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. ఇది రెటినోల్ రూపంలో దొరుకుతుంది. మన కళ్ళలోని రెటీనాకు ఇది చాలా అవసరం. రేచీకటి రాకుండా అడ్డుకుంటుంది. వయసు పెరుగుతుంటే వచ్చే అంధత్వం రాకుండా రక్షిస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
గుడిలోని పచ్చసొనలోనే విటమిన్ డి మూలాలు ఉంటాయి. ఇది ఆస్టియోపొరాసిస్ వంటివి రాకుండా అడ్డుకుంటాయి. అలాగే దీనిలో విటమిన్ ఈ కూడా మెరుగ్గా ఉంటుంది. దీన్ని తినడం వల్ల చర్మానికి ఎలాంటి నష్టాలు రావు. చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది. చర్మంపై ముడతలు పడడం, మొటిమలు రావడం వంటి సమస్యలు తగ్గుతాయి.
గుడ్డులోని పచ్చ సొనలో విటమిన్ కె అధికంగా ఉంటుంది. గాయాలు తగిలినప్పుడు రక్తం గడ్డ కట్టడం చాలా అవసరం. లేకుంటే అధిక రక్తస్రావమై ప్రాణాపాయం కలుగుతుంది. ఇలా గాయాల నుంచి రక్తాన్ని ఆపే శక్తి విటమిన్ Kకు ఉంది. ఇది గుడ్డులో పుష్కలంగా ఉంటుంది.
మన శరీరానికి అత్యవసరమైన బి విటమిన్లు గుడ్డులో పుష్కలంగా ఉంటాయి.బి విటమిన్లు ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడతాయి. నాడీ వ్యవస్థను కాపాడతాయి. చర్మం, కళ్ళు ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. అలసట, బలహీనత, చర్మ రోగాలు రాకుండా అడ్డుకుంటాయి. మన మెదడు శక్తికి ఈ బి విటమిన్లు చాలా అవసరం. యాంగ్జయిటీ, డిప్రెషన్ వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి. ఇక విటమిన్ బి12 మనకు ఎంతో ముఖ్యమైనది. విటమిన్ బి12 లోపిస్తే తీవ్రంగా అలసిపోతారు. బలహీనంగా అనిపిస్తారు. మతిమరుపు వచ్చేస్తుంది. చదివింది ఏదీ గుర్తుపెట్టుకోలేరు. నరాల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇక విటమిన్ బి9గా పిలిచే ఫోలిక్ యాసిడ్ గర్బిణిలకు చాలా అవసరం. గర్భధారణ సమయంలో పిండం అభివృద్ధికి ఇది సహాయపడుతుంది. పుట్టబోయే బిడ్డలు న్యూరల్ ట్యూబు లోపాలు రాకుండా కాపాడుతుంది. గుండె సంబంధిత వ్యాధులను రాకుండా అడ్డుకుంటుంది.
గుడ్డు తినడం వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. కాబట్టి గుడ్డులోని పచ్చ సొనను పడేయడం మానేయండి. ప్రతిరోజూ ఒక గుడ్డును పచ్చసొనతో పాటు తింటే ఎంతో ఆరోగ్యం.
టాపిక్