Tomato Rice : టొమాటో రైస్ ఇలా చేయండి.. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు
Tomato Rice With Peas : ఉదయం అల్పాహారంగా టొమాటో రైస్ చేయండి. అయితే ఇందులోకి బఠానీలు వేయండి. రుచితోపాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
మార్నింగ్ టైములో చాలా బిజిబిజిగా ఉంటాం. సమయం లేక మంచి ఆహారం తినలేకపోతున్నాం. ముఖ్యంగా పని చేసే మహిళలకు ఈ సమయం చాలా కీలకమైనది. వారు కూడా పనికి వెళ్లేందుకు త్వరగా ఇంట్లో అన్ని సిద్ధం చేసి ఉండాలి. పిల్లలను సిద్ధం చేయాలి. వారికి అల్పాహారం, భోజనం వండి పెట్టాలి.
ఇలాంటి గజిబిజి జీవితంలో చాలా మంది బ్రేక్ ఫాస్ట్ కేలవం బ్రేడ్ జామ్ తోనే సరిపెట్టుకుంటున్నారు. అందుకే బఠానీలతో కూడిన టొమాటో రైస్ చేయండి. ఆరోగ్యానికి మంచిది. మధ్యాహ్నం లంచ్ బాక్సులోకి కూడా తీసుకెళ్లొచ్చు. బ్రేక్ ఫాస్ట్‌లాగా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. 20 నిమిషాల్లో ఈ రెసిపీ తయారు చేసుకోవచ్చు.
టొమాటో రైస్‌కు కావాల్సిన పదార్థాలు
బియ్యం - రెండు కప్పులు, ఉల్లిపాయ- ఒకటి(కట్ చేసుకోవాలి), టొమాటోలు - నాలుగు (సన్నగా తరిగినవి), బఠానీలు - ఐదు టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి - ఒకటి (చీల్చుకోవాలి), అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక టేబుల్ స్పూన్, ఎర్ర మిరప పొడి - ఒక టేబుల్ స్పూన్, పసుపు పొడి - అర టేబుల్ స్పూన్, టొమాటో సాస్ - ఒక టేబుల్ స్పూన్, ఉప్పు - రుచికి సరిపడా, నీరు - రెండు కప్పులు, నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు
టొమాటో రైస్ తయారీ విధానం
మెుదలు కుక్కర్‌లో నెయ్యి వేయాలి. నెయ్యి వేడి అయ్యే వరకు వేచి చూడాలి.
ఇప్పుడు అందులో పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా కలపాలి. దానికి తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.
అనంతరం టొమాటోలు వేసి బాగా కలపాలి. టొమాటోలు బాగా ఉడకనివ్వండి
ఇప్పుడు అల్లం-వెల్లుల్లి పేస్ట్, పసుపు పొడి, ఎర్ర మిరపకాయలను జోడించాలి. వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి.
తర్వాత కుక్కర్‌లో బఠానీలు వేయండి. ఈ బఠానీలను ఇతర పదార్థాలతో కలిపి నాలుగైదు నిమిషాలు ఉడకబెట్టాలి.
ఇప్పుడు టొమాటో సాస్, రుచి కోసం ఉప్పు వేయండి. ఈ పదార్థాలన్నీ కాసేపు బాగా ఉడకనివ్వండి.
తర్వాత కడిగిన బియ్యాన్ని కుక్కర్‌లో వేయండి. ఇతర పదార్ధాలతో బియ్యం బాగా కలుపుకోవాలి.
కుక్కర్‌లో నీరు పోసి పదార్థాలను బాగా కదిలించండి. ఇక కుక్కర్ మూత మూసివేయండి.
నాలుగు విజిల్స్ వచ్చే వరకు వేచి ఉండండి. తర్వాత స్టవ్ ఆపివేయండి. టొమాటో రైస్ విత్ బఠానీలు రెడీ.. వేడిగా సర్వ్ చేయండి.
టొమాటో రైస్ నాలుగు సార్లు విజిల్స్ వచ్చే వరకు మాత్రమే ఉడికించాలి. టమోటాలు మాత్రమే కాకుండా ఉల్లిపాయలను కూడా వేయించి నెయ్యిలో బాగా వేయించాలి. ఈ టొమాటో రైస్ బాత్ రుచిని పెంచడానికి ఒక టీస్పూన్ టొమాటో సాస్ కలపడం గుర్తుంచుకోవాలి.