Evening Yoga। సాయంత్రం ఈ యోగాసనాలు వేస్తే ఒళ్లు నొప్పులు పోయి రిలాక్స్ అవుతారు!
28 July 2023, 18:48 IST
- Evening Yoga For Body Pains: సాయంత్రం పూట కొద్దిసేపు యోగా సాధన చేస్తే మంచి రిలీఫ్‌గా ఉంటుంది. వెన్నుపూస నొప్పి నుంచి విముక్తిని పొందడానికి, మీ శరీర భంగిమను సరిచేసుకోవడానికి ఎలాంటి యోగాసనాలు వేయాలో చూడండి.
Yoga For Body Pains:
Evening Yoga For Body Pains: వెన్నునొప్పి అనేది ఈరోజుల్లో చాలా మందికి సర్వసాధారణంగా మారింది. ముఖ్యంగా డెస్క్ జాబ్‌లు చేస్తున్నవారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. రోజంతా కంప్యూటర్ ముందు గంటల తరబడి పని చేస్తున్నపుడు వెన్నునొప్పి, మెడనొప్పి తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. ఇలా వెన్ను నొప్పి కలిగిన ప్రతీసారి నొప్పి నివారణ క్రీములు రాయడం, మందులు వేసుకోవడం ద్వారా తాత్కాలిక పరిష్కారమే లభిస్తుంది. ఇలాంటి నొప్పులకు కొన్ని యోగాసనాలు సరైన చికిత్సను అందిస్తాయి.
సాయంత్రం పూట కొద్దిసేపు యోగా సాధన చేస్తే మంచి రిలీఫ్‌గా ఉంటుంది. వెన్నుపూస నొప్పి నుంచి విముక్తిని పొందడానికి, మీ శరీర భంగిమను సరిచేసుకోవడానికి ఎలాంటి యోగాసనాలు వేయాలో చూడండి.
బాలాసనం
ఈ ఆసనం సాధన చేయడం ద్వారా మీ నడుమును సాగదీయవచ్చు. బాలాసనం మీ వెన్ను నుంచి చీలమండల వరకు కండరాల్లో సున్నితమైన సాగతీతను కలిగించి, మీ కండరాలను రిలాక్స్ చేస్తుంది. రోజంతా కూర్చొని పనిచేసి అలసిపోయిన రోజున, పడుకునే ముందు కొన్ని నిమిషాలు బాలాసనం వేయండి. ఇది మీకు శరీర నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది, మంచి విశ్రాంతి భావాలను కలిగిస్తుంది, హాయిగా నిద్రపోగలుగుతారు.
సేతు బంధాసనం
ఈ ఆసనంలో వీపును వంచి వంతెన వంటి ఆకారాన్ని ఏర్పరచడం ద్వారా సాధన చేస్తారు. సేతు బంధాసనం వెన్ను కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఈ భంగిమలో ఉన్నప్పుడు వెన్నుభాగం లోపలికి వంగుతుంది, ఛాతీ బయటకు తెరుచుకుంటుంది. తద్వారా వెన్నునొప్పిని నివారిస్తుంది. అలాగే ఛాతీ, మెడ, వెన్నెముక, తుంటి కండరాలను సాగదీసి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మీ శరీరాన్ని బలోపేతం చేయడంలో, శరీర సమతుల్యతను మెరుగుపరచడంలో సేతు బంధాసనం అద్భుతంగా సహాయపడుతుంది.
నౌకాసనం
నౌకాసనం పొట్ట భాగంలోని కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా ఈ అసనం సాధన చేయడం ద్వారా పెరిగిన పొట్టను ప్రభావవంతంగా తగ్గిస్తుంది. అదే విధంగా మీ వీపుపై ఒత్తిడి, భారాన్ని తగ్గించి వెన్నునొప్పి నుంచి రిలీఫ్ ఇస్తుంది, శరీరాకృతిని మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గించే మానసిక ప్రయోజనాలను నౌకాసనం అందిస్తుంది.
వీరభద్రాసనం
వీరభద్రాసనం కండరాల సామర్థ్యాన్ని మెరుగుప రుస్తుంది. చేతులు, కాళ్ళకు బలాన్ని చేకూరుస్తుంది. రెండు భుజాల మధ్య సమతుల్యత తీసుకువస్తుంది. మొత్తంగా శరీర సమతుల్యతను కాపాడుతుంది. వెన్నునొప్పులు సహా ఎలాంటి కండరాల నొప్పులు రాకుండా నివారిస్తుంది. ఎక్కువ సేపు కూర్చొని పని చేసే వారికి వీర భద్రాసనం చాలా ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ ఆసనం శరీరానికి శక్తినిస్తుంది, రోజంతా మిమ్మల్ని చురుకుగా ఉంచుతుంది.
ధనురాసనం
ఈ ఆసనం వెన్ను కండరాలు అలాగే ఉదర కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. కాళ్లు, చేతి కండరాలపై ప్రభావం చూపుతుంది. శరీర భాగాలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. శరీరాన్ని సాగదీసి భంగిమను సర్దుబాటు చేయడంలో సహాయపడుతుంది. తద్వారా వెన్నునొప్పి, మెడనొప్పులను నివారిస్తుంది.