Ganga Pushkaralu 2023 । గంగా పుష్కరాలు జరిగే ప్రదేశాలు, తేదీల వివరాలు, స్నాన ఘాట్‌ల సమాచారం!
22 April 2023, 15:54 IST
- Ganga Pushkaralu 2023: ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి మాత్రమే జరిగే గంగా పుష్కరాల మహా జాతర శనివారం నుంచి ప్రారంభమైంది, ముఖ్య తేదీల వివరాలు, స్నాన ఘాట్‌ల సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
Ganga Pushkaralu 2023
Ganga Pushkaralu 2023: గంగా పుష్కరాలు ఎంతో ప్రాముఖ్యత కలిగినవి. ఇది ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి మాత్రమే జరిగే మహా జాతర. పురాణాల ప్రకారం, గంగను సుర నది అని కూడా పిలుస్తారు, ఇది మూడులోకాల్లో ప్రవహించే పుణ్యనది. పుష్కరుడు బృహస్పతితో కలిసి అశ్వినీ నక్షత్ర మేష రాశిలోకి ప్రవేశించినప్పుడు గంగా పుష్కరాలు ప్రారంభమవుతాయి. గంగా పుష్కరం వైశాఖ శుక్ల ద్వితీయ నాడు, ప్రారంభమై వైశాఖ శుక్ల త్రయోదశి నాడు ముగుస్తుంది. ఇది మేష రాశిలో గురు సంక్రమణం ప్రారంభాన్ని సూచిస్తుంది.
2023లో గంగా పుష్కరాలు ఏప్రిల్ 22న ప్రారంభమై 3 మే 2023న ముగుస్తున్నాయి. మళ్లీ ఈ గంగా పుష్కరాలు పన్నేండేళ్లకు గానీ రావు. అంటే తదుపరి గంగా పుష్కరాలు 2035వ సంవత్సరంలో వస్తాయి. కాబట్టి ఇంతటి మహత్తరమైన గంగా పుష్కరాల జాతరలో పాల్గొనడం గొప్ప అదృష్టం. పుష్కర సమయంలో గంగా స్నానాలు చేయడం, కర్మకార్యాలు నిర్వహించడం, ఇతర ఆచారాలు పాటించడం ఎంతో పుణ్యం అని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు.
Ganga Pushkaram Places 2023- గంగా పుష్కరాలు జరిగే ప్రదేశాలు
గంగా పుష్కరాలు గంగానదీ తీరం వెంబడి ఉండే పవిత్ర పుణ్యక్షేత్రాలలో జరుగుతాయి. అందులో ముఖ్యమైనవి..
- హరిద్వార్
- బద్రీనాథ్
- కేదార్ నాథ్
- అలహాబాద్ (ప్రయాగ)
- గంగోత్రి
- గంగాసాగర్
- వారణాసి (కాశీ)
వారణాసి క్షేత్రంలో గంగా పుష్కర స్నానానికి 64 స్నాన ఘాట్‌లు ఉన్నాయి. అన్నింటిలో మణికర్ణికా ఘాట్ ముఖ్యమైనది.
Ganga Pushkaralu DOs- గంగా స్నానాలు చేసేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- నోటిఫైడ్ ఘాట్‌లలో మాత్రమే పవిత్ర స్నానం చేయండి
- ఘాట్ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి
- నమోదిత పురోహితులను మాత్రమే సంప్రదించండి
- స్వచ్ఛమైన, పరిశుభ్రమైన నీరు మాత్రమే త్రాగాలి
- అత్యవసర పరిస్థితుల్లో లైఫ్‌సేవర్‌ల సేవలను వినియోగించుకోండి
- పవిత్ర స్నానం తర్వాత వీలైనంత త్వరగా ఘాట్ నుండి బయలుదేరండి
- ఏదైనా సమాచారం కోసం వ్యక్తులని నమ్మకుండా, సమాచార కేంద్రాలను సంప్రదించండి.
Ganga Pushkaralu Don'ts- చేయకూడని పనులు
- వ్యర్థ పదార్థాలను నదిలో వేయకండి
- గంగా స్నానం సమయంలో సబ్బు లేదా షాంపూ ఉపయోగించవద్దు
- కలుషితమైన ప్రదేశాలలో తినవద్దు
- నీళ్ల లోతుకు వెళ్లవద్దు
- విలువైన ఆభరణాలు ధరించవద్దు
పవిత్ర గంగా స్నానం చేసేటపుడు త్రికరణ శుద్ధితో ఉండాలి. ఆచారాలను భక్తితో నిర్వహించాలి. గంగానది పవిత్రతను కాపాడుతూ పుణ్యస్నానం ఆచరించాలి, పుష్కర స్నానంలో పాల్గొనేటప్పుడు శుభ్రమైన వస్త్రాలను ధరించండి. స్నానం ఆచరించేటపుడు తర్పణాలు వదలాలి.