Ganga Pushkaralu : గంగా పుష్కరాలకు కాశీ వెళ్తున్నారా? టెంట్ సిటీలో రూమ్స్ బుక్ చేయండి
21 April 2023, 11:08 IST
- Ganga Pushkaralu 2023 : ఏప్రిల్ 22 నుంచి మే 3 వరకు.. గంగా నది పుష్కరాలు జరుగుతాయి. అయితే ఈ సందర్భంగా కొంతమంది కాశీ వెళ్లాలని అనుకుంటారు. వారు.. టెంట్ సిటీలో రూమ్స్ బుక్ చేసుకోవచ్చు.
టెంట్ సిటీ
ఏప్రిల్ 22 నుంచి మే 3 వరకూ గంగా నది పుష్కరాలు జరుగుతాయి. 12 రోజుల పాటు జరిగే ఈ పుష్కరాలు చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ సమయంలో గంగానది(Ganga River) తీర ప్రాంతాలు.. పుణ్యస్నానాలు చేసే భక్తులతో నిండిపోతాయి. ఇప్పటికే.. ఆయా ప్రాంతాల్లో ఘాట్లు సిద్ధం చేశారు. గంగోత్రి, గంగాసాగర్, హరిద్వార్, బదిరీనాథ్, కేదారనాథ్, వారణాసి, అలహాబాద్ క్షేత్రాల్లో ఘాట్లు సిద్ధమయ్యాయి.
పుష్కరాలకు వెళ్లేవారు.. ఎక్కడ ఉండాలా అని ఆలోచిస్తూ ఉంటారు. వారణాసి(Varanasi) వెళ్లే భక్తులు.. కాటేజీలు అందుబాటులో లేకుంటే.. టెంట్ సిటీలో రూమ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. గంగా నది తీరంలో వంద హెక్టార్లలో టెంట్ సిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే సాధారణంగానే.. కాశీలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక పుష్కరాలు కావడంతో మరింత మంది వచ్చే అవకాశం ఉంది. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు టెంట్ సిటీ(Tent City)ని ఏర్పాటు చేశారు.
టెంట్లతో నివాస కుటీరాలను నిర్మించారు. ఇందులో బస చేయోచ్చు. 100 హెక్టార్లలో నిర్మించిన టెంట్ సిటీలో ఒకే విడత 200 మంది వసతి చేయోచ్చు. అయితే గంగా దర్శన్ విల్లాస్, ప్రీమియం టెంట్స్, సూపర్ డీలక్స్ టెంట్స్ అనే మూడు రకాల విభాగాలుగా ఉన్నాయి. విల్లాస్ ల్లో 900 చదరపు అడుగులు, కాశీ సూట్స్ లో 576 చదరపు అడుగులు, సూపర్ డీలక్స్ లో 480 నుంచి 580 చదరపు అడుగులు, డీలక్స్ లో 250 నుంచి 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో వసతి కల్పిస్తారు.
ధర ఎంతంటే
ఇందులో కొన్ని రకాల వసతులు కూడా ఉంటాయి. చిన్నపాటి ఫ్రిజ్ ఉంటుంది. టీవీ, గీజర్, రూమ్ హీటర్ లాంటి వసతులు కూడా కల్పిస్తారు. ప్రీమియం, డీలక్స్ టెంట్ రూమ్ కావాలి అనుకుంటే.. రూ.12 వేల నుంచి 14 వేల వరకూ ఉంది. మీరు https://www.tentcityvaranasi.com వెబ్‌సైట్‌కు వెళ్లి చూడొచ్చు. టెంట్ సిటీ ప్యాకేజీలు(Tent City Package) బుక్ చేసుకోవచ్చు. దర్శన్ విల్లాలో ఒకరికి రూ.20 వేలు, కాశీ సూట్స్‌లో ఒకరికి రూ.12వేలు, ప్రీమియం ఏసీ టెంట్‌లో ఒకరికి రూ.10 వేలు, డీలక్స్ టెంట్‌లో రూ.7,500 ఛార్జీలుగా నిర్ణయించారు.
ఒక రాత్రి, 2 రోజుల ప్యాకేజీ ధరలు అన్నమాట. అయితే ఇందులోనే.. బోటు ప్రయాణం, లంచ్, టీ, బోట్ టూర్, గంగా హారతి, డిన్నర్, కల్చరల్ ప్రోగ్రామ్స్, గంగా స్నానం లాంటివి కూడా ఉంటాయి. పర్యాటకులు వివిధ ఘాట్ల నుంచి పడవలో టెంట్ సిటీకి చేరుకోవచ్చు. అక్టోబర్ నుంచి జూన్ వరకూ మాత్రమే ఈ టెంట్ సిటీ అందుబాటులో ఉంటుందని గమనించాలి. ఆ తర్వాత వర్షాకాలం కారణంగా తీసేస్తారు. పర్యాటకులకు టెంట్ సిటీలో వేర్వేరు ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయి. ఒక్కసారి వెబ్ సైట్ సందర్శించి.. తెలుసుకోవచ్చు.