Foods To Avoid : ఈ ఆహారాలు వేసవిలో తినకూడదు.. మంచిది కాదు
02 April 2024, 12:30 IST
- Foods In Summer : కొన్ని రకాల ఆహారాలకు వేసవిలో దూరంగా ఉండాలి. అప్పుడే శరీరానికి మంచిది. లేదంటే సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది.
వేసవిలో తినకూడని ఆహారాలు
ఈ సంవత్సరం ఎండలు దంచికొట్టేలా ఉన్నాయి. ఈ సమయంలో ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. సీజన్ మారుతున్న కొద్దీ ఆహారంలో కూడా మార్పు రావాలి. వేసవిలో నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినాలి. ఏది పడితే అది తింటే మాత్రం ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. చిన్నాపెద్దా అందరూ వేసవిలో సరైన డైట్ పాటించాలి. అప్పుడే మెుత్తం శ్రేయస్సుకు మంచిది. సాధారణంగా మనం ఆరోగ్యకరమైన ఆహారాలు కూడా వేసవిలో కడుపులో ఇబ్బందిని కలిగిస్తాయి. వాటి గురించి అందరూ తెలుసుకోవాలి.
వేసవిలో జీడిపప్పు, పిస్తా డ్రై ఫ్రూట్స్‌ను పరిమితిలో తినండి. తాజా పండ్లను ఉపయోగించండి. వీటిలో పోషకాలు ఉన్న మాట నిజమే. అయితే ఉష్ణోగ్రతను పెంచుతాయి. ఈ రకమైన డ్రై ఫ్రూట్స్ వర్షాకాలం, చలికాలంలో చాలా మంచివి. వీటిని ఆ సమయంలోనే తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. వేసవిలో తీసుకుంటే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఎండాకాలంలో కాకుండా సాధారణ సమయాల్లో తినండి.
కొందరికి స్పైసీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. వేసవిలో తక్కువ స్పైసీ ఫుడ్ తినాలి. వంటల్లో యాలకులు, లవంగాలు, వెల్లుల్లి, అల్లం తక్కువగా వాడండి. ఇవి ఉష్ణోగ్రతను పెంచుతాయి. తర్వాత చెమటలు ఎక్కువగా వస్తాయి. శరీరంలో చిరాకు ఫీల్ కలుగుతుంది. అందుకే స్పైసీ ఆహారాలు తగ్గించాలి.
వేసవి వేడి సమయంలో నూనెలో వేయించిన ఆహారాన్ని తినవద్దు. పిజ్జా, బర్గర్‌లు, కబాబ్‌లు వంటివి తీసుకోవద్దు. అలాగే కృత్రిమంగా తీయబడిన శీతల పానీయాలు తాగకూడదు. ఇక వీధి ఆహారం లేదు. అవసరమైతే తాజా పండ్ల రసాలు తాగాలి. కూల్ డ్రింక్స్ జోలికి వేసవిలో అస్సలు పోకూడదు.
వేసవిలో ఇడ్లీ, పూరీ, చపాతీ, ఉప్పు కలిపిన పదార్థాలు తినకూడదు. ఎందుకంటే ఇలాంటి ఆహారం తిన్నప్పుడు చాలా దాహం, అలసటగా అనిపిస్తుంది. అలాంటి ఆహారాన్ని తినకూడదు. ఒకవేళ మీరు ఇంటి వద్దే ఉంటే.. ఆ ఆహారాలు తీసుకోండి. బయట తిరిగే అవసరం ఉన్నప్పుడు ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలు అస్సలు మట్టుకోవద్దు.
వేసవిలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. మద్యం సేవించి ఎండలో నడిస్తే హీట్ స్ట్రోక్ వస్తుంది. వేసవిలో మద్యం తీసుకోకపోవడమే మంచిది. మద్యం తీసుకుంటే బాడీ డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. ఇది మీ ఆరోగ్యాన్ని పూర్తిగా పాడు చేస్తుంది. అందుకే వేసవిలో మద్యానికి దూరంగా ఉండాలి.
కాఫీని మితంగా తీసుకోండి. మీరు ఎంత ఎక్కువ కాఫీ తాగితే అంత కెఫీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. బాడీ ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కెఫీన్ ఉండే పదార్థాలు తీసుకోకపోవడమే మంచిది.
వేసవిలో మాంసం మంచిది కాదు. చికెన్ శరీరంలో ఉష్ణోగ్రత పెంచుతుంది. అలాగే వేసవిలో మాంసం త్వరగా పాడైపోతుంది. జీర్ణక్రియ కూడా కష్టమవుతుంది. మాంసం మితంగా తినాలి. నెలలో ఒకటి రెండుసార్లు తింటే చాలు. ప్రతీ రోజూ తినడం మాత్రం శరీరానికి సమస్యలు తెచ్చిపెడుతుంది.
నీరు అధికంగా ఉండే ఆహారాన్ని తినండి. వేసవిలో పుచ్చకాయ, ఇతర పండ్లు వంటి నీరు అధికంగా ఉండే ఆహారాన్ని తినండి. దాహం కలిగించే ఆహారం తీసుకోవద్దు. ఉప్పు తక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే చాలా మంచిది. జంక్ ఫుడ్స్‌కు బదులు పండ్లు తినడం చాలా మంచిది.
చాలా దాహంగా అనిపించినప్పుడు మనం ఫ్రిజ్‌లో ఉంచిన వాటిని తింటాం. కూల్ వాటర్ తాగుతాం. కానీ అది ఆరోగ్యానికి మంచిది కాదు. బదులుగా మీరు చల్లగా ఉండే మట్టి కుండలో నీరు లేదా మజ్జిగ వేసి తాగితే అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ ఏడాది ఎండ వేడిమి ఎక్కువగా ఉన్నందున ఆహారం విషయంలో చాలా శ్రద్ధ వహించాలి. అప్పుడే మీ మెుత్తం ఆరోగ్యం బాగుంటుంది.