Scuba Diving In India | నీటి అడుగున మరో ప్రపంచం చూసేయండి.. స్కూబా డైవింగ్‌కు అద్భుత ప్రదేశాలు ఇవే!
30 January 2023, 13:03 IST
- Scuba Diving In India: మీకు సముద్ర గర్భంలో ఏం ఉంటుందో అన్వేషించాలనుకుంటున్నారా? అయితే స్కూబా డైవింగ్ చేసి ఆ ముచ్చట తీర్చుకోండి. భారతదేశంలో సురక్షితమైన ప్రదేశాలు ఇక్కడ చూడండి.
Scuba Diving In India
సాయంకాలానా సాగరతీరాన కూర్చొని అలల తాకిడిని అనుభూతి చెందితే చెప్పలేని హాయి, ప్రశాంతమైన సముద్రం, సుందరమైన సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు వీక్షించడం చెప్పలేని ఆనందాన్ని కలిగిస్తాయి. అయితే ఇవన్నీ మనకు భూమిపై కనిపించే ఒక ప్రపంచం అయితే, `భూమి అంచులను దాటి సముద్రం లోపలికి తొంగిచూస్తే అక్కడ మరో ప్రపంచం ఉంటుంది. మీరు ఇదివరకు ఎన్నడూ చూడని జీవరాశి, నీటిలోపల పెరిగే నాచులాంటి ఆల్గే మొక్కలు, సముద్ర గర్భంలో దాగి ఉన్న అనేక రహస్యాలను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. స్కూబా డైవింగ్ మీకు ఈ అవకాశం కల్పిస్తుంది, సాహస ప్రియులకు ఇదొక గొప్ప అడ్వెంచర్.
Scuba Diving In India- భారతదేశంలో స్కూబా డైవింగ్ ప్రదేశాలు
మీరు నీటి అడుగున విహారయాత్రను కోరుకుంటే భారతదేశంలో స్కూబా డైవింగ్ కు ప్రసిద్ధి చెందిన కొన్ని అద్భుతమైన ప్రదేశాలు ఇక్కడ తెలుసుకోండి.
గోవా
విలాసవంతమైన విహారయాత్రకు గోవా ఒక గొప్ప ప్రదేశం. ఇక్కడ అనేక వాటర్ స్పోర్ట్స్ జరుగుతాయి. స్కూబా డైవింగ్‌కు కూడా ఈ ప్రదేశం ప్రసిద్ధి. విలక్షణమైన పగడాలు, విశేషమైన జలచరాలను ఇక్కడ అన్వేషించవచ్చు. నీటి అడుగున తీవ్రమైన ప్రవాహాలు లేకుండా, మంచి దృశ్యమానత ఉంటుంది. ఇక్కడ మీరు చేసే స్కూబా డైవింగ్‌ను మీకు పూర్తి ఆనందాన్ని కలిగిస్తుంది. భారతదేశంలో స్కూబా డైవింగ్ కోసం సురక్షితమైన ప్రదేశాలలో గోవా ఒకటి.
అండమాన్
అండమాన్ దీవులు స్కూబా డైవింగ్‌కు అనువైన నేపథ్యాన్ని అందిస్తాయి. అద్భుతమైన పగడాలు, చెడిపోని పగడపు దిబ్బలు మీ కాలక్షేపానికి సరైన నిర్వచనాన్ని అందిస్తాయి. అండమాన్ భారతదేశంలోని అత్యుత్తమ స్కూబా డైవింగ్ గమ్యస్థానాలలో ఒకటిగా పరిగణించవచ్చు. మీరు నీటి అడుగున చేపట్టే మీ ప్రయాణంలో తాబేళ్లు, మోరే ఈల్స్, మంటా రేస్, ట్రెవల్లీ, బ్యాట్ ఫిష్‌లను చూడవచ్చు.
పాండిచ్చేరి
భారతదేశ తూర్పు తీరంలో ఉన్న ఏకైక డైవింగ్ ప్రదేశం పాండిచ్చేరి. ఈ ప్రాంతం దాని సహజమైన పగడపు దిబ్బలు, రాతి ఉద్గారాలు, మానవ నిర్మిత శిఖరాలు, జాక్‌ఫిష్, సముద్రపు పాములు, ఫ్యాన్ పగడాలతో సహా సముద్ర జీవుల విస్తృత వైవిధ్యంను చూడవచ్చు ఈ కారణంగా పాండిచ్చేరిలో స్కూబా డైవింగ్ ఎంతో ప్రత్యేకమైనది. ఇది స్కూబా డైవింగ్ కోసం భారతదేశంలోని అత్యుత్తమ ప్రదేశాలలో ఒకటి. నిపుణులకే కాకుండా అనుభవం లేనివారికి కూడా ఇది సరైన గమ్యస్థానం.
లక్షద్వీప్
స్కూబా డైవింగ్‌కు భారతదేశంలోని అగ్రశ్రేణి ప్రదేశాలలో లక్షద్వీప్ ఒకటి. ఇక్కడ నీలిరంగు, స్ఫటికాకార మడుగులు, మంటా రేస్ జాతి చేపలు, తాబేళ్లు, రంగురంగుల చేపలు, అప్పుడప్పుడు చుట్టూ తిరిగే సొరచేపలు, తిమింగలాలతో కూడిన ఈ ప్రదేశం మీకు ఉత్కంఠభరితమైన జీవితకాలపు అనుభూతులను పంచుతాయి.
నేత్రాణి
కర్నాటక తీరంలో, పావురాల ద్వీపం అని కూడా పిలువబడే నేత్రాణి అనే సుందర ప్రదేశం మురుడేశ్వర్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. చిన్న హృదయాకారంలో ఉన్న ఈ ద్వీపం స్కూబా డైవింగ్ కోసం ప్రత్యేకమైనది. ఇది వేల రకాల చేపలు, పగడాలు, హంప్‌బ్యాక్ తిమింగలాలతో సహా వివిధ రకాల జలచరాలకు నిలయం. మీరు మీ ప్రయాణంలో తిమింగలం, సొరచేపలను ఎదుర్కొనే అదృష్టం కూడా కలిగి ఉండవచ్చు. భత్కల్ షిప్‌బ్రెక్ అనేది నేత్రాణిలో ప్రసిద్ధ డైవింగ్ స్పాట్. భారతదేశంలో అత్యుత్తమ స్కూబా డైవింగ్ ప్రదేశాలలో నేత్రాణి కూడా ఒకటి.
మరి మీరు ఆసక్తిగా ఉన్నారా? అయితే వెంటనే ఈ ప్రదేశాలకు వెళ్లి దూకేయండి (డైవింగ్ చేయండి), సాగర యానం చేస్తూ సముద్ర గర్భంలో మరో ప్రపంచాన్ని చుట్టి రండి.