Mutton Rogan Josh Recipe | మటన్ రోగన్ జోష్.. దీని రుచికి అయిపోతారు ఎవరైనా దిల్ ఖుష్!
05 March 2023, 13:25 IST
- Mutton Rogan Josh Recipe: ఇటీవలి కాలంలో మాంసాన్ని త్వరగా వండడానికి ప్రెషర్ కుక్కర్‌ని ఉపయోగిస్తున్నారు. కానీ అలా కాకుండా కుండలో సన్నని సెగ మీద నెమ్మదిగా ఇలా మటన్ రోగన్ జోష్ చేసి చూడండి, దీని రుచికి మీరు ఫిదా అవ్వాల్సిందే.
Mutton Rogan Josh
మాంసాహారులకు మటన్ రోగన్ జోష్ పేరు వింటేనే నోరు ఊరుతుంది. ఇది ఒక క్లాసిక్ కాశ్మీరీ వంటకం. మామూలు మటన్ కూరకంటే రోగన్ జోష్, ముదురు ఎరుపు రంగులో, దట్టమైన మసాలాలతో చిక్కటి రసాన్ని కలిగి ఉంటుంది. ఇది చూపుకు ఎంత ఆకర్షణీయంగా ఉంటుంది, దీని రుచి కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. ఎముకతో కూడిన లేత మాంసాన్ని ఉపయోగించి, సన్నని సెగమీద దీనిని నెమ్మదిగా చేస్తారు.
మటన్ రోగన్ జోష్‌లో రోగన్ లేదా రౌగన్ అంటే పర్షియన్ భాషలో నూనె లేదా నెయ్యి అనే అర్థం వస్తుంది, ఉర్దూలో ఎరుపు అని అర్థం కూడా ఉంది. అలాగే జోష్ అంటే జ్యూస్ అనే అర్థం వస్తుంది. మొత్తంగా మటన్ రోగన్ జోష్ అంటే నెయ్యిలో ఎర్రగా ఉడికించిన మాంసం కూర అనే అర్థం వస్తుంది. మరి మీరు ఈ సుగంధభరితమైన ఎర్రటి మాంసం కూరను రుచి చూడాలనుకుంటే ఇక్కడ మటన్ రోగన్ జోష్ రెసిపీ అందిస్తున్నాం. సూచనలు పాటిస్తూ మీరు ఈ వంటకాన్ని సిద్ధం చేసుకోండి.
Mutton Rogan Josh Recipe కోసం కావలసినవి
- 500 గ్రాముల ఎముకతో కూడిన లేత మటన్
- 2 నుండి 3 టేబుల్ స్పూన్లు నెయ్యి లేదా ఆవాల నూనె
- 1/2 కప్పు తాజా పెరుగు
- 2 టేబుల్ స్పూన్లు కాశ్మీరీ రెడ్ చిల్లీ పేస్ట్
- 1 కప్పు వేడి నీరు లేదా మటన్ స్టాక్
- 1 బిరియాని ఆకు
- 1/4 టీస్పూన్ లవంగాల పొడి
- 1/4 టీస్పూన్ దాల్చిన చెక్క పొడి
- 1/3 టీస్పూన్ ఏలకుల పొడి
- 1 టీస్పూన్ సోంపు పొడి
- 1 టీస్పూన్ అల్లం పేస్ట్
మటన్ రోగన్ జోష్ తయారీ విధానం
- ముందుగా ఒక కుండలో నూనె లేదా నెయ్యి వేడి చేసి, అందులో శుభ్రంగా కడిగిన మటన్ వేసి 1 నుండి 2 నిమిషాలు ఎక్కువ వేడి మీద వేయించాలి.
- మంటను మీడియంకు తగ్గించి, మసాల పొడులు వేసుకొని మాంసం కొద్దిగా గోధుమ రంగు వచ్చేవరకు ఓ 5 నిమిషాలు వేయించాలి.
- ఆపై పెరుగు, వేడి నీరు లేదా మటన్ స్టాక్ వేసి బాగా కలపండి. మీడియం వేడి మీద 3 నుండి 4 నిమిషాలు మూతపెట్టి ఉడికించాలి.
- ఉప్పు, కారం అన్ని వేసుకొని అవసరం అనుకుంటే మరికొన్ని వేడినీళ్లు పోసి మటన్ ముక్కలు మెత్తగా, లేతగా, ఎముక నుండి ఊడిపోయేటట్లు ఉడికించుకోవాలి. ప్రతి 7 నుండి 8 నిమిషాలకు మాంసాన్ని కదిలిస్తూ ఉండాలి,
- గ్రేవీ చిక్కగా మారింది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, అలాగే కాసేపు పక్కనపెట్టండి.
అంతే, రుచికరమైన మటన్ రోగన్ జోష్ రెడీ. దీనిని బాస్మతి రైస్, బటర్ నాన్, పరాటా లేదా రోటీతో తినవచ్చు. మటన్ రోగన్ జోష్ బిర్యానీ లేదా బాగార అన్నంకు బదులు సాదా బియ్యంతో చాలా రుచిగా ఉంటుంది.