Neuralgia । మెడలు వంచి పనిచేస్తున్నారా? ఈ సమస్య తలెత్తవచ్చు!
25 April 2023, 20:30 IST
- Neuralgia: నరాలు నొప్పిగా అనిపిస్తున్నాయా? అది న్యూరాల్జియా అనే అరుదైన నాడీ రుగ్మత కావచ్చు. లక్షణాలు, కారణాలు, చికిత్స గురించి తెలుసుకోండి.
Neuralgia- rare nerve disorder
Neuralgia: నరాల నొప్పికి అనేక కారణాలు ఉండవచ్చు. కండరాలపై పడే ఒత్తిడి, అధిక బరువు, కొన్ని రకాల ఔషధాల ప్రభావం, మధుమేహం, ఇన్ఫెక్షన్ మొదలైన వాటి వల్ల నరాలు ప్రభావితం అవుతాయి. ఫలితంగా నరం నొప్పి కలుగుతుంది. ఇది క్రమంగా న్యూరల్జియాగా రూపాంతరం చెందవచ్చు. న్యూరల్జియా శరీరంలోని ఏ భాగాన్నైనా ప్రభావితం చేస్తుంది. ఈ సమస్య ఉన్నప్పుడు ప్రభావిత ప్రాంతంలో తేలికపాటి నుండి తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. కొన్ని సార్లు నొప్పి పదునుగా పొడుస్తున్నట్లుగా అనిపించవచ్చు.
ఇటీవల కాలంలో మొబైల్స్, ల్యాప్‌టాప్‌ల వాడకం బాగా పెరిగిపోయింది. రోజంతా ల్యాప్‌టాప్, కంప్యూటర్ లపై పనిచేసే వారు ఈ రకమైన నరాల నొప్పిని ఎదుర్కొంటున్నారు. ల్యాప్‌టాప్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కళ్లకు హాని కలిగించడమే కాకుండా, నరాలపై కూడా ఒత్తిడి పెరుగుతుంది. గంటల పాటు మెడ, నడుమును వంచి పనిచేయటం మూలానా మెడ భాగంలో, వీపు దిగువ భాగంలో నొప్పి కలుగుతుంది. ఇటీవల చేసిన ఒక అధ్యయనం ప్రకారం,ల్యాప్‌టాప్‌లను ఎక్కువగా ఉపయోగించే వారిలో 80 శాతం మంది న్యూరల్జియాతో బాధపడుతున్నారు. న్యూరల్జియా లక్షణాలు, కారణాలు, చికిత్స గురించి తెలుసుకుందాం
Neuralgia Symptoms- న్యూరల్జియా లక్షణాలు
- మెడ నుండి మోచేయి వరకు నొప్పి.
- భుజంలో తిమ్మిరి, పదునైన నొప్పి
- ప్రభావిత ప్రాంతంలో మంట, తిమ్మిరి లాంటి అనుభూతి
- కండరాల బలహీనత, కండరాలు లాగటం
- నరాల సంకోచించినట్లు అనిపించడం, కండరాలు మెలితిప్పడం
- నడుస్తున్నప్పుడు నొప్పి అనిపిస్తుంది
- ముఖం, దంతాలు లేదా దవడలో తీవ్రమైన నొప్పి
- ముఖంలో ఒక వైపు నొప్పి
నొప్పి అకస్మాత్తుగా ప్రారంభమవుతుంది , తరువాత చాలా తీవ్రంగా మారుతుంది. నొప్పి ఉన్న చోట తాకినపుడు లేదా ఒత్తిడి పడినప్పుడు కూడా నొప్పిగా ఉంటుంది.
Neuralgia Causes - న్యూరల్జీయాకు కారణాలు
- ఎక్కువ సమయం పాటు తలను క్రిందికి, వెన్నును ముందుకు వంచిన స్థితిలో ఉంచడం
- మెడ కండరాలపై ఒత్తిడి
- మెడ భాగంలో గాయాలు లేదా కణితులు
- రక్త నాళాలలో నొప్పి, వాపు
- కొన్ని రకాల అంటువ్యాధులు, గౌట్ వ్యాధి
- మధుమేహం
- కొన్ని కేసులలో కారణాలు ఉండకపోవచ్చు
కొన్ని మందుల ద్వారా న్యూరల్జీయా నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. పరిస్థితిలో మార్పులేకపోతే వైద్యులు స్కానింగ్ నిర్వహిస్తారు. శస్త్ర చికిత్స చేసి సమర్థవంతంగా చికిత్స చేయవచ్చు.
Neuralgia Treatment- న్యూరల్జియా చికిత్స
కొన్ని మందులు, ఆయింటిమెంట్ల ద్వారా న్యూరల్జీయా నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. లేదా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఇవ్వవచ్చు. పరిస్థితిలో మార్పులేకపోతే వైద్యులు పలు రకాల స్కానింగ్ నిర్వహిస్తారు. ఆ తర్వాత సర్జరీ చేసి సమర్థవంతమైన చికిత్స అందించగలరు.