తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mouth Breathing: నోరు తెరిచి నిద్ర పోయే అలవాటు ఉందా? అది ఎంత ప్రమాదకరమో తెలుసా

Mouth Breathing: నోరు తెరిచి నిద్ర పోయే అలవాటు ఉందా? అది ఎంత ప్రమాదకరమో తెలుసా

Haritha Chappa HT Telugu

30 May 2024, 14:00 IST

google News
    • Mouth Breathing: కొంతమంది నోరు తెరిచి నిద్రపోతూ ఉంటారు. దాన్ని పెద్ద సమస్యగా పట్టించుకోరు. నిజానికి అతి ప్రమాదకరమైన సమస్య అంటున్నారు వైద్యులు.
నోటి ద్వారా శ్వాస తీసుకోవచ్చా?
నోటి ద్వారా శ్వాస తీసుకోవచ్చా? (Pexels)

నోటి ద్వారా శ్వాస తీసుకోవచ్చా?

Mouth Breathing: జలుబు బాగా చేసినప్పుడు ముక్కు దిబ్బడ కడితే నిద్రలో శ్వాస తీసుకోవడం వీలుకాదు. అలాంటప్పుడు చాలామంది నోరు తెరిచి నిద్రపోతూ ఉంటారు. ముక్కు దిబ్బడ కట్టినప్పుడు నోటి ద్వారా శ్వాస పీల్చుకోవడం కోసం ఇలా శరీరం ఆటోమేటిక్‌గా చేసే ప్రతిచర్య ఇది. అయితే జలుబు లేకపోయినా కూడా ఎంతోమందికి నోరు తెరిచి నిద్రపోయే అలవాటు ఉంటుంది. తాము అలా నిద్రపోతున్నామని కూడా వారికి తెలియదు. ఇలా దీర్ఘకాలికంగా నోరు తెరిచి నిద్రపోయే అలవాటు ఉన్నవారిలో ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు వైద్యులు.

నోటి ద్వారా శ్వాస తీసుకోవడం అనేది సాధారణ విషయమే. అలెర్జీలు, జలుబు కారణంగా ముక్కు ద్వారా శ్వాస తీసుకోలేకపోతే నోటి ద్వారా శ్వాస తీసుకుంటారు. తీవ్రంగా వ్యాయామం చేస్తున్నప్పుడు ఇలా నోటి ద్వారా శ్వాస తీసుకోవడం చేస్తూ ఉంటారు. ఇది కండరాలకు ఆక్సిజన్ వేగంగా అందేలా చేస్తుంది. అయితే నిద్రపోయినప్పుడు మాత్రం ఇలా నోరు తెరిచి నిద్ర పోవడం, నోటి ద్వారా శ్వాస తీసుకోవడం అనేది మంచి పద్ధతి కాదు.

నోటి ద్వారా శ్వాస ఎందుకు?

నిద్రలో నోరు తెరిచారంటే... మీరు నోటి ద్వారా శ్వాస తీసుకుంటున్నారని అర్థం. ఇలా చేయడం వల్ల నోరు పొడి బారడం, శ్వాస వాసన చెడుగా రావడం, స్వరం బొంగురు పోవడం, అలసిపోయినట్టు అనిపించడం, దీర్ఘకాలికంగా అలసట, కళ్ళ కింద నల్లటి వలయాలు రావడం... ఇవన్నీ కూడా మీరు నోటి ద్వారా శ్వాసను తీసుకుంటున్నారని సూచించే లక్షణాలు.

ఇలా ఎందుకు జరుగుతుంది?

నిద్రలో నోటి ద్వారా శ్వాస తీసుకోవడానికి కారణాలను వివరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ముక్కులోనికి వెళ్లే గాలి మృదమైన మార్గం ద్వారా ఊపిరితిత్తులను చేరుకోవాలి. అలా చేరుకోవడంలో అడ్డంకులు ఏర్పడినప్పుడు నోటి ద్వారా శ్వాస తీసుకోవడం జరుగుతుంది. అలాగే టాన్సిల్స్ పెద్దవిగా పెరిగినా, ఒత్తిడి అధికమైనా, మానసిక ఆందోళనలు ఎక్కువైనా, ముక్కులో పాలిప్స్ పెరిగినా, లేదా కణితులు ఉన్నా కూడా ఇలా నోటి ద్వారా శ్వాస తీసుకునే అలవాటు పెరుగుతుంది.

ఇలాంటి సమస్యలు వస్తాయి

నోటి ద్వారా ఇలా తరచూ శ్వాస తీసుకుంటూ ఉంటే నోరు పొడిగా మారిపోతుంది. బ్యాక్టీరియా కూడా ఎక్కువగా చేరుతుంది. చిగుళ్ల వాపు, దంత క్షయం వంటి సమస్యలు వస్తాయి. అలాగే గొంతు, చెవి ఇన్ఫెక్షన్లు పెరిగిపోతాయి. నోటి ద్వారా శ్వాస తీసుకోవడం వల్ల రక్తంలో ఆక్సిజన్ తక్కువగా చేరుతుంది. ఇది అధిక రక్తపోటుకు, గుండె వైఫల్యానికి కారణమవుతుంది. నోటి ద్వారా శ్వాస తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు కూడా మందగిస్తుంది. ఆస్తమాతో బాధపడుతున్న వ్యక్తులకు ఇలా జరిగితే ఆ సమస్య మరింతగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.

పిల్లల్లో కూడా ఇలా నోటితో శ్వాసించే లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో దాన్ని ఆ విషయాన్ని తేలిగ్గా తీసుకోకుండా వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం. ఆటిజం వంటి లక్షణాలు కలిగి ఉన్న పిల్లలు ఇలా నోటితో శ్వాసించే అవకాశం ఎక్కువ. కాబట్టి నోటితో శ్వాసిస్తున్నట్టు గుర్తిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.

టాపిక్

తదుపరి వ్యాసం