Diabetes Early Symptoms | డయాబెటిస్ ప్రారంభ దశ లక్షణాలు ఇలా ఉంటాయి, విస్మరిస్తే మొదటికే మోసం!
03 November 2023, 17:18 IST
Diabetes Early Symptoms: షుగర్ వ్యాధి (డయాబెటిస్) కి ప్రారంభ దశలో కొన్ని లక్షణాలు ఉంటాయి. వాటిని విస్మరించకూడదు. అతిగా దాహం వేయడం, అతిగా మూత్రవిసర్జన చేయడం వంటివి మధుమేహానికి సంకేతాలు కావచ్చు.
Diabetes Early Symptoms
మధుమేహం అనేది ఒక దీర్ఘకాలిక అనారోగ్య సమస్య, ఈ వ్యాధి ఒకసారి వస్తే ఎప్పటికీ నయం కాదు. ఎందుకంటే దీనిని పూర్తిగా నయం చేసే చికిత్స లేదు. కేవలం లక్షణాలను మాత్రమే నియంత్రించగలం. కచ్చితమైన ఆహార నియమాలతో పాటు డాక్టర్స్ సూచించిన మందులు తీసుకోవడం వలన షుగర్ వ్యాధి ముదరకుండా కాపాడుకోవచ్చు. కాబట్టి ఈ పరిస్థితి తెచ్చుకోవడం కంటే, మధుమేహం రాకుండా అదుపుచేసుకోవడం మంచిది.
మధుమేహం ప్రారంభ దశలో ఉన్నప్పుడు కొన్ని లక్షణాలు ఉంటాయి. దానిని చికిత్స చేయకుండా వదిలేస్తే తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.
Diabetes Early Symptoms- మధుమేహం ప్రారంభ లక్షణాలు
ఇక్కడ మధుమేహంకు సంబంధించిన ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయో చూడండి.
తరచుగా మూత్ర విసర్జన
తరచుగా మూత్రవిసర్జన చేస్తుంటే అది మధుమేహం వ్యాధికి ప్రారంభ సంకేతం. రక్తంలో చక్కెర స్థాయిలు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, మూత్రపిండాలు మూత్రం ద్వారా అదనపు గ్లూకోజ్‌ను ఫిల్టర్ చేసి తొలగించడానికి ప్రయత్నిస్తాయి. దీనివల్ల వ్యక్తి సాధారణం కంటే ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేస్తాడు.
మెడ చుట్టూ ముదురిన చర్మం
అకాంథోసిస్ నైగ్రికన్స్ అనేది మెడ, గజ్జ, చంకల చుట్టూ కనిపించే ఒక పరిస్థితి. చర్మం మందపాటి ఆకృతిలో, అతుకుల వలె కనిపిస్తుంది. ఇది డయాబెటిస్‌కు సూచన కావచ్చు కాబట్టి వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
నోరు పొడిబారడం
నోరు పొడిబారడం అనేది నోటిలో లాలాజల ఉత్పత్తి తగ్గడం వల్ల కలుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం ఇందుకు కారణం కావచ్చు. పొడిబారిన నోరు మధుమేహంకు ఒకహెచ్చరిక సంకేతం. అదనంగా నోటిలో లాలాజలం తక్కువైతే మీ దంతాలు, చిగుళ్ళలో సమస్యలకు దారితీయవచ్చు.
వాసనతో కూడిన శ్వాస
మీరు శ్వాస తీసుకునేటపుడు ఏదైనా పండిన వాసన పీల్చుతున్న అనుభూతి కలిగి ఉంటే, అది మధుమేహానికి సంబంధించిన ఒక సైడ్ ఎఫెక్ట్. వైద్యపరంగా, దీనిని డయాబెటిక్ కీటోయాసిడోసిస్ అంటారు. శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించలేనప్పుడు, శక్తి కోసం కొవ్వులను విచ్ఛిన్నం చేసే ప్రక్రియలో కీటోన్‌లను విడుదల చేసినప్పుడు ఇది జరుగుతుంది. రక్తప్రసరణలో అదనపు కీటోన్ల ఉనికి కారణంగా, శ్వాస తీసుకుంటున్నపుడు ఒక రకమైన వాసన వస్తుంది.
వికారం
వికారంగా అనిపించడం, తలతిరగడం కూడా మధుమేహానికి సంకేతం. ఈ అనారోగ్యం జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది, ప్రత్యేకించి, రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది, ఇది గ్యాస్ట్రోపరేసిస్‌కు దారితీస్తుంది, ఇక్కడ ఆహారం జీర్ణం కావడానికి జీర్ణవ్యవస్థ సామర్థ్యం దెబ్బతింటుంది. ఫలితంగా వికారం కలుగుతుంది.
కాళ్లలో తీవ్రమైన నొప్పి
అధిక రక్త చక్కెర స్థాయిలు నరాలను దెబ్బతినవచ్చు, దీనిని డయాబెటిక్ న్యూరోపతి అంటారు. ఈ పరిస్థితి కలిగిన వ్యక్తుల్లో తరచుగా కాళ్లు, పాదాల ప్రాంతంలో నొప్పి, మంట లేదా తిమ్మిరిని అనుభవిస్తారు. మీరు ఈ లక్షణాలను అనుభవిస్తున్నట్లయితే, మీ చక్కెర స్థాయిలు చాలా ఎక్కువగా ఉన్నాయని సూచించవచ్చు.
తరచుగా అంటువ్యాధులు
మధుమేహం శరీరం రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది, తద్వారా తరచుగా అంటువ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ఏదైనా గాయం అయినపుడు అది మానటానికి ఎక్కువ సమయం తీసుకుంటే కూడా మధుమేహానికి సంకేతం.
మీరు ఈ లక్షణాలలో దేనినైనా అనుభవిస్తే, వీలైనంత త్వరగా వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రారంభ దశలోని రోగనిర్ధారణ చేస్తే, మధుమేహం రాకుండా చికిత్స చేయడం సులభం అవుతుంది.